నిన్న స్టాలిన్... నేడు కేసీఆర్..?

Update: 2021-11-09 12:30 GMT
కేంద్రంలోని మోడీ సర్కార్ మీద విరుచుకుపడుతున్న ముఖ్యమంత్రుల జాబితా పెరుగుతోంది. మోడీకి బయట పల్లకీ మోతా బాగానే ఉంది. ఈ మధ్యనే ఒక ఇంటర్నేషల్ సర్వే కూడా మోడీ సార్ గ్రేట్ అని చెప్పేసింది. అదే టైమ్ లో దేశంలో మాత్రం మోడీ గ్రాఫ్ క్రమంగా తగ్గుతోంది. ఇక ఉత్తరాదిన బీజేపీ వేవ్ తగ్గుతోంది అనడానికి రీసెంట్ గా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలను ఒక సంకేతంగా తీసుకోవచ్చేమో. ఇంకా కరెక్ట్ రిజల్ట్ కావాలి అంటే 2022లో జరిగే అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చే దాకా వేచి చూడవచ్చు. మొత్తానికి మోడీ మాస్టార్ ఉత్తేజ పూరిత ప్రసంగాలకు ఈసారి ఓట్లు పడవని అంచనాలు ఏవో ఉండాలి. దాంతో కేసీయార్ కూడా మోడీ మీద విరుచుకుపడుతున్నారు. అవును నేను మోడీని ఆ మధ్యన ఫాసిస్ట్ అని కూడా అన్నాను అని కేసీయార్ మీడియా మీట్ లో గట్టిగా చెప్పుకున్నారు అంటే ఈ డేరింగ్ వెనక చాలానే కధ ఉందనుకోవాలి.

సౌతిండియా తీసుకుంటే ఈ ఏడాది మేలో తమిళనాడులో అధికారంలోకి వచ్చిన డీఎంకే అధినేత స్టాలిన్ అయితే మోడీ సర్కార్ మీద బాగానే తగులుకుంటున్నరు. నీట్ పరీక్షల నుంచి ఏ అంశాన్ని ఆయన అసలు విడిచిపెట్టడంలేదు. ఆయన పక్కన ఇపుడు కేసీయార్ వచ్చి చేరారు. మరో వైపు చూస్తే కేరళ సీఎం పినరయ్ విజయన్ ఎటూ కమ్యూనిస్ట్ నేత. ఇలా దక్షిణాదిన ఉన్న అయిదు రాష్ట్రాల్లో మూడింట కమలానికి రెడ్ సిగ్నల్స్ పడిపోయాయి. ఇక మిగిలింది బీజేపీ పాలిత రాష్ట్రం కర్నాటక. అక్కడ కూడా కాంగ్రెస్, జనతాదళ్ బాగానే పుంజుకుంటున్నాయి. ఏపీ విషయం తీసుకుంటే బహు చిత్రంగా ఉంది. ఇక్కడ మూడు ప్రాంతీయ పార్టీలు ఈ రోజుకీ బీజేపీని పల్లెత్తు మాట అనడానికి ఎందుకో వెనకాడుతున్నాయి అన్న విమర్శలు ఉన్నాయి.

అధికార వైసీపీ అనేక కీలక సమస్యల మీద మాత్రం మౌనమే నా భాష అంటోంది. ఇక తెలుగుదేశం అయితే స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తున్న బీజేపీని పెద్దగా టచ్ చేయడంలేదు. జనసేన పవన్ కళ్యాణ్ కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో ఈ రోజుకీ వైసీపీనే తప్పు పడుతున్నారు. మొత్తానికి బీజేపీకి సౌత్ మొత్తానికి ఏమైనా ఆశగా ఉంది అంటే అది ఏపీనే అని చెప్పుకోవాలి. అయితే ఇది కూడా కొంతకాలమే అంటున్నారు. ఎవరి లెక్కలు వారికి ఉన్నాయిక్కడ. కేంద్రంలో బీజేపీ పట్టు కాస్తా సడలగానే ఎవరి రాజకీయం వారు స్టార్ట్ చేస్తారని కూడా చెప్పాలి. టోటల్ గా చూసుకుంటే బీజేపీకి ఉత్తరాది ఉత్త చేతులిచ్చినా దక్షిణాది దయా దాక్షిణ్యం కూడా చూపను అంటోంది. మరి వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు దారేదీ అంటే ఆ పార్టీ వ్యూహకర్తలనే జవాబు అడగాలేమో.
Tags:    

Similar News