బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌ల్లో కొత్త కోణం

Update: 2018-05-08 16:53 GMT
ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు త‌నంత తానే చిక్కుల్లో ప‌డ్డారా? అవ‌స‌ర‌మైన స‌మాచారం అందించుకండా అనుకోని వివాదాన్ని ఆయ‌న త‌లకెత్తుకున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. న‌వ్యాంద్ర‌ప్ర‌దేశ్ ర‌థ‌సార‌థిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత చంద్ర‌బాబు అనేక విదేశీ ప‌ర్య‌ట‌న‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. పెట్టుబ‌డుల ఆక‌ర్ష‌ణ కోస‌మ‌ని కొన్నిసార్లు - రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణానికి సంబంధించి అంటూ ఇంకొన్ని సార్లు, అంత‌ర్జాతీయ సంస్థ‌ల ఆహ్వానం మేర‌కు ప్ర‌సంగించేందుకు అంటూ ఇంకొన్ని ద‌ఫాలుగా చంద్ర‌బాబు చ‌క్క‌ర్లు కొట్టిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన వివ‌రాలు చెప్పండంటే మాత్రం పొంత‌న‌లేని స‌మాధానాలు ఇచ్చారు. దీంతో చంద్ర‌బాబు నిజంగానే ప్ర‌జ‌ల కోస‌మే విదేశాల్లో ప‌ర్య‌టించారా లేదా త‌న సొంత ప‌నులు చ‌క్క‌బెట్టేందుకా అనే కొత్త సందేహాన్నిఆయ‌నే సృష్టించారు.

ముఖ్యమంత్రి  హోదాలో చంద్ర‌బాబు - ఐటీ రంగంలో పెట్టుబ‌డులు ఆక‌ర్షించేందుకు అంటూ ఆయ‌న త‌న‌యుడు నారాలోకేష్ స‌హా పుర‌పాల‌క మంత్రి నారాయ‌ణతో క‌లిసి టీడీపీ అధినేత వివిధ దేశాల్లో ప‌ర్య‌టించారు. ఈ టూర్ల‌లో ప‌లు ఆశ్చ‌ర్య‌క‌ర అంశాలు కూడా క‌నిపించాయి. అదే ప్ర‌త్యేక విమానాల‌తో ఆయా దేశాల‌ను చుట్టేయ‌డం. నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఈ ప‌ర్య‌ట‌న‌లు జ‌రిపాయ‌ని గ‌తంలోనే ప‌లు విప‌క్షాలు ఆరోపించాయి. ఒక‌ద‌శ‌లోనే వైసీపీ ఎమ్మెల్యే, ప్ర‌జా ప‌ద్దుల సంఘం చైర్మ‌న్ బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి ఈ వివ‌రాల‌ను అడిగిన‌ప్ప‌టికీ అధికారులు ఇవ్వ‌లేదు. దాదాపుగా ఆయ‌న రెండు నెల‌ల పాటు నిరీక్షించిన‌ప్ప‌టికీ ఫలితం నిరాశే. ఈ నేప‌థ్యంలో ఓ సామాన్యుడు చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న వివ‌రాలు తెలుసుకునేందుకు ఆర్టీఐ ద్వారా అప్పీలు చేస్తే దిమ్మ‌తిరిగే స‌మాధానం వ‌చ్చింది.

ముఖ్య‌మంత్రి హోదాలో చంద్ర‌బాబు చేసిన ప‌ర్య‌ట‌న వివ‌రాల గురించి స‌ద‌రు వ్య‌క్తి ద‌ర‌ఖాస్తు చేయ‌గా అసిస్టెంట్‌ సెక్రటరీ (ప్రొటోకాల్‌), సాధారణ పరిపాలన శాఖలోని పబ్లిక్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఆఫీసర్ అవాక్క‌య్యే సమాధానం ఇచ్చారు. ఆర్‌టీఐలోని ఫలాన సెక్షన్‌ ప్రకారం మీకు సమాధానం ఇవ్వడం కుదరదని ఊహించ‌ని రీతిలో  తిప్పిపంపారు. దీంతో స‌ద‌రు దరఖాస్తుదారుడు త‌న ఆర్జిని పై అధికారులకు పెట్టుకున్నాడు. చిత్రంగా అక్క‌డా అదే స‌మాధానం వ‌చ్చింది. అంతేకాకుండా ఓ ప్రభుత్వ వెబ్‌సైట్ వివ‌రాలు ఇస్తూ...అందులో మీకు కావాల్సిన స‌మాచారం ఉంద‌ని, అక్క‌డ చూసుకోవాల‌ని కోరారు. దీంతో షాక్ తిన‌డం స‌దరు హక్కుల కార్య‌క‌ర్త వంత‌యింది. ఆ సైట్లో ఉన్న స‌మాచారం అస్త‌వ్య‌స్తం, ఒక‌దానికి ఒక‌టి పొంత లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

కాగా, ఈ ప‌రిణామాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ‌డంతో స‌హజంగానే చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మవువుతున్నాయి. నిజంగా రాష్ట్ర అభివృద్ధి కోస‌మే ముఖ్యమంత్రి ప‌ర్య‌టిస్తే వాటిని వెల్ల‌డించ‌డానికి ఏం ఇబ్బంది అంటూ కొంద‌రు లాజిక్ తీస్తున్నారు. మ‌రికొంద‌రు..`ప్ర‌చారాన్ని కోరుకునే చంద్ర‌బాబు త‌న వివ‌రాలు ఇస్తే..ప్ర‌జ‌ల‌కు తెలుస్తుంది క‌దా? త‌ద్వారా ఆయ‌న‌కే మేలు. అయినప్ప‌టికీ వాటిని బ‌హిరంగ ప‌ర్చ‌డం లేదంటే ఏదో మ‌త‌లబు ఉండే ఉంటుంది` అంటూ సందేహాలు లేవ‌నెత్తుతున్నారు. ఒక‌వేళ బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్న‌ట్లు కేంద్రం ఇస్తున్న నిధుల‌ను దారిమ‌ళ్లిస్తూ అది బ‌య‌ట‌కు వ‌స్తుంద‌నే ఇలా డొంక‌తిరుగుడు రిప్లై ఇస్తున్నారా అంటూ చ‌ర్చించుకుంటున్నారు.

Tags:    

Similar News