చావుపై హాకింగ్ ఎంత వివ‌రంగా చెప్పారంటే?

Update: 2018-03-14 09:05 GMT
మ‌నిషిలో అంతులేని విషాదాన్ని నింపుతుంది మ‌ర‌ణం. అప్ప‌టివ‌ర‌కూ మ‌న‌తో ఉండి.. కాసేప‌టికే మ‌రెప్ప‌టికి తిరిగి రాలేని లోకాల‌కు వెళ్లిపోయేలా చేసే మ‌ర‌ణం ఎవ‌రికైనా ఉలికిపాటే. అంద‌రూ పుట్టుక‌ను కోరుకుంటారే కానీ మ‌ర‌ణాన్ని ఎప్ప‌టికిప్పుడు వాయిదా వేసుకోవాల‌నుకుంటారు. ఒక‌వేళ మృత్యువు వెంటాడుతుంటే.. దానికి దూరం అయ్యేందుకు మ‌నిషి ప‌డే త‌ప‌న అంతా ఇంతా కాదు.

ఇలా చెప్పుకుంటూ పోతే మ‌ర‌ణం మీద చాలానే ఉంటుంది. మ‌న మాట‌ల్ని ప‌క్క‌న పెడితే.. ప్ర‌ముఖ భౌతిక శాస్త్ర‌వేత్త స్టీఫెన్ హాకింగ్ మ‌ర‌ణం మీద ఏం చెప్పారు. ప్ర‌పంచంలో ఎంతోమంది శాస్త్ర‌వేత్త‌లు ఉన్నా.. వారెవ‌రూ క‌నిపెట్ట‌లేని విష‌యాల్ని బ‌య‌ట‌కు తీసుకురావ‌టం ఆయ‌న గొప్ప‌త‌నం. ఇక‌.. ఆయ‌న ఆవిష్క‌రించిన కొన్ని సిద్ధాంతాలు అవున‌నే వారే కానీ.. దాన్ని ఫ్రూవ్ చేయ‌లేని ప‌రిస్థితి. మ‌నిషి ఆలోచ‌న‌ల‌కు కొన్ని వంద‌ల ఏళ్లు ముందుండి ఆలోచించే హాకింగ్ ఈ రోజు మాన‌వాళికి శాశ్వితంగా గుడ్ బై చెప్పేశారు. గ‌తంలో ఆయ‌న మ‌ర‌ణం గురించి ఏం చెప్పారో చూస్తే.. హాకింగ్ గొప్ప‌త‌నం ఏమిటో ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

"మరణం తర్వాత జీవితం లేదు. స్వర్గం అన్న‌ది ఒక కట్టుకథ. మరణం తర్వాత జీవితం.. స్వర్గం.. నరకం లాంటివేమీ లేవు.  మృత్యువు అంటే భయపడే వారి కోసం అల్లిన కట్టుకథలు. మనిషి మెదడు కూడా కంప్యూటర్ లాంటిదే.. విడి భాగాలు పాడయ్యాక‌ కంప్యూటర్‌ పని చేయటం ఆగిపోయినట్టే మెదడు కూడా ఆగిపోతుంది. ఒక్కసారి మెదడు ప‌ని చేయ‌టం నిలిచిపోయిన తర్వాత ఏమీ ఉండదు.అందుకే.. కన్నుమూసే లోపే మనకున్న శక్తి సామర్థ్యాల్ని పూర్తి స్థాయిలో వినియోగిస్తూ మంచి జీవితం గడపాలి" అని చెప్పారు.

మ‌నం చేసే ప‌నులు అత్యున్న‌తంగా ఉండేందుకు కృషి చేయాల‌ని.. 49 ఏళ్లుగా మ‌ర‌ణం త‌న‌కు అత్యంత స‌మీపంలోనే ఉంటోంద‌ని చెప్పారు. అయినా తాను మృత్యువుకు భ‌య‌ప‌డ‌టం లేద‌న్నారు. త్వ‌ర‌గా మ‌ర‌ణించాల‌ని తాను అనుకోవ‌టం లేద‌ని.. క‌న్నుమూసే లోపే తాను చేయాల్సిన ప‌నులెన్నో ఉన్నాయ‌ని చెప్పారు. చిన్న చిన్న విష‌యాల‌కు రాగ‌ద్వేషాల‌కు గురై.. ప్రేమ‌.. మార్కులు రాక‌పోవ‌టంతో జీవితం మీద విర‌క్తి.. ఒంట‌రిత‌నం లాంటి వాటిని బూచీలుగా చూసుకుంటూ చ‌నిపోవాల‌నుకునే వారు.. అంత‌కు మించి తాము చేయాల్సిన‌వి చాలానే ఉన్నాయ‌ని గుర్తిస్తే వారి కుటుంబాల‌కు..స‌మాజానికి చాలా మంచిద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.
Tags:    

Similar News