మమత మార్పింగ్ ఫొటో లొల్లి.. అసలు కథేంటి?

Update: 2019-05-15 09:47 GMT
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ, అధికార తృణమూల్ మధ్య పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా వాతావరణం ఉంది. మొండి మోడీ కేంద్ర అధికారాలకు, జగమొండి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దూకుడుకు మధ్య ప్రచ్చన్న యుద్ధమే జరుగుతోంది. తృణమూల్-బీజేపీ నేతలు అయితే కనపడితే కొట్టుకునేంత స్థాయిలో ఉద్రిక్తలు ఉన్నాయి. తాజాగా బెంగాల్ సీఎం మమత   మార్పింగ్ ఫొటోను షేర్ చేసిన బీజేపీ నేతను బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అయితే నిన్న సుప్రీం కోర్టు ఆదేశించినా పోలీసులు ఆమెను విడుదల చేయలేదు. తాజాగా బుధవారం విడుదల చేయకపోతే తీవ్ర పరిణామాలుంటాయని సుప్రీం స్పష్టం చేయడంతో ఆమెను బెయిల్ పై రిలీజ్ చేశారు. ఇంతకీ ఈ వివాదానికి కారణమేంటన్నది చూద్దాం..

*మమత మార్ఫింగ్ ఫొటో పోస్ట్.. అరెస్ట్
బెంగాల్ ఎన్నికల్లో హోరాహోరీ పోరుసాగుతుండడంతో బీజేపీ  యువ మోర్చా నాయకురాలు ప్రియాంక శర్మ సోషల్ మీడియా ప్రచారంలో భాగంగా తన ఫేస్ బుక్ ఖాతాలో మమతను ఎద్దేవా చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది.  బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా మెట్ గాలా ఫొటోను కాపీ చేసి దానికి మమత తలకాయను అంటించిన ఫొటోను ప్రియాంక సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీనిపై అభ్యంతరం తెలిపిన తృణమూల్ కాంగ్రెస్ పోలీసులకు ఫిర్యాదు చేయడం.. ఆమెను బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగిపోయింది.  

*సుప్రీం ను ఆశ్రయించిన ప్రియాంక
తన భావప్రకటన స్వేచ్ఛను హరించారని.. బెంగాల్ పోలీసులు తనను సీఎం ఫొటో పోస్టు చేసినందుకు అరెస్ట్ చేశారని ప్రియాంక శర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు ప్రియాంకను వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది.

*బేఖాతరు చేసిన మమత ప్రభుత్వం
మంగళవారమే ప్రియాంకను విడుదల చేయలని స్వయంగా సుప్రీం కోర్టు ఆదేశించినా మమత సర్కారు మాత్రం ఆ ఆదేశాలను బేఖాతరు చేసింది. దీంతో బుధవారం మరోసారి ప్రియాంక బంధువులు మమతా బెనర్జీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీం సీరియస్ అయ్యింది. మమతా బెనర్జీ సర్కారుకు వార్నింగ్ ఇచ్చింది. ప్రియాంకను తక్షణమే విడుదల చేయాలని.. లేదంటే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని.. తామే స్వయంగా చర్యలు తీసుకుంటామని మమత సర్కారును హెచ్చరించింది.  

*సుప్రీం వార్నింగ్ కు విడుదల చేసిన మమత సర్కార్
సుప్రీం వార్నింగ్ తో బెంగాల్ ప్రభుత్వం ఈ ఉదయం 9.40కి ప్రియాంకను విడుదల చేశామని సుప్రీంకు తెలిపింది. అయితే మమతా బెనర్జీపై వివాదాస్పద ఫొటోను ఫార్వర్డ్ చేసిన ప్రియాంశ శర్మ భేషరతుగా క్షమాపణలు చెప్పిన తర్వాతే ఆమెను విడుదల చేస్తామని బెంగాల్ అధికారులు మొండిపట్టు పట్టడంతోనే ఆమె విడుదల ఆలస్యమైంది. సుప్రీం ఆదేశాలతో ఇప్పుడు ప్రియాంక విడుదలైంది.

*మమతకు క్షమాపణ చెప్పను..
కోల్ కతా జైలు నుంచి సుప్రీం కోర్టు ఆదేశాలతో విడుదలైన బీజేపీ నేత ప్రియాంక శర్మ.. సంచలన కామెంట్స్ చేసింది. బెంగాల్ సీఎంపై ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టినందుకు తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. తనతో బలవంతంగా క్షమాపణ చెప్పించేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. జైలు అధికారులు తనతో అనుచితంగా ప్రవర్తించారని.. తనతో ఎవరినీ మాట్లాడకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. తనతో బలవంతంగా క్షమాపణ చెప్పించేందుకు ప్రయత్నించారని.. తాను మమతకు క్షమాపణ చెప్పను అంటూ ప్రియాంక స్పష్టం చేశారు.

    
    
    

Tags:    

Similar News