జకోవిచ్ కు ఊహించని దెబ్బ.. ఈసారి కష్టమేనా?

Update: 2022-02-25 11:32 GMT
సెర్బియా టెన్నిస్ క్రీడాకారుడు జకోవిచ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తూ... వివాదాస్పదం అవుతూ వస్తున్న జకోవిచ్ కు ఊహించని షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో ఈ సారి టాప్ ర్యాంక్ కష్టమేనని విశ్లేషకులు అంటున్నారు. 2020 నుంచి జకోవిచ్ నంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. అంతేకాకుండా 361 వారాల పాటు టాప్ లో ఉన్న ప్రపంచ టెన్నిస్ స్టార్ గా రికార్డు సృష్టించాడు. తాజాగా చవిచూసిన ఓటమితో ఆయన టాప్ ప్లేస్ కాస్త దిగజారే ప్రమాదముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆస్ట్రేలియన్ ఓపెన్ వ్యవహారం తర్వాత ఈ స్టార్ ప్లేయర్ మళ్లీ టెన్సిస్ మైదానంలోకి అడుగుపెట్టాడు. దుబాయ్ ఓపెన్ టోర్నీలో ఆయనకు ఊహించని షాక్ తగిలింది. అనూహ్యంగా క్వార్టర్ మ్యాచ్ లో జకోవిచ్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. గురువారం జరిగిన ఈ పోరులో చెక్ రిపబ్లిక్ క్రీడాకారుడు జరీ వెస్లీ చేతిలో పరాజయం పాలయ్యాడు. ఈ నేపథ్యంలో సోమవారం ప్రకటించనున్న వరల్డ్ ర్యాంకింగ్స్ లో జకోవిచ్ తన స్థానాన్ని కోల్పోనున్నాడు.

 ఈ స్థానాన్ని పదిలపరుచుకోవాలంటే జకోవిచ్ దుబాయ్ ఓపెన్ కనీసం సెమీ ఫైనల్ వరకు చేరాల్సి ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఈ పరాజయంతో ఆయన టాప్ ప్లేస్  పడిపోయిందని పేర్కొన్నారు.

ఆస్ట్రేలియన్ ఓపెన్-2022 రన్నరప్, 2021 యూఎస్ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ డానియల్ మెద్వెదేవ్ వరల్డ్ నంబర్ వన్ స్థానంలో నిలవనున్నాడు. ఇటీవల కాలంలో మంచి ప్రదర్శన కనబరుస్తున్న ఈయనకు తొలి స్థానం వస్తుందని అంటున్నారు. సోమవారం నాడు ఈ మేరకు ప్రకటన వస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు. జకోవిచ్, ఫెడరర్, నాదల్ కాకుండా వేరే వ్యక్తి టాప్ ప్లేస్ లో నిలవడం 2004 తర్వాత ఇదే తొలిసారి. నాదల్ 21 గ్రాండ్ స్లామ్ తో పురుషుల టెన్నిస్ లో టాప్ వన్ లో ఉండగా.., ఫెడరర్-జకోవిచ్ ఇద్దరూ 20 టైటిల్స్ తో రెండో స్థానంలో ఉన్నారు.

కరోనా కాలంలో వ్యాక్సినేషన్ విషయమై వివాదస్పదం అయిన జకోవిచ్ గతకొంత కాలంగా వార్తల్లో నిలుస్తున్నాడు. టీకా తీసుకోవడం, తీసుకోకపోవడం తన వ్యక్తిగతమని ఆయన గతంలో వ్యాఖ్యానించారు.

టీకా వేసుకోనందున ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్ కు కూడా ఆయన దూరంగా ఉన్నారు. ఈ విషయమై ఆస్ట్రేలియా ప్రభుత్వం- జకోవిచ్ నడుమ చాలా రచ్చ జరిగింది. జకోవిచ్ పై మూడేళ్ల నిషేధం విధించింది ఆస్ట్రేలియా ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఆయన అభిమానులకు మరో చేదు వార్త అందింది. జకోవిచ్ తన టాప్ ప్లేస్ ను కోల్పోతున్నాడని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Tags:    

Similar News