వైసీపీకే ఓటేస్తామ‌ని చెబుతున్నార‌ట‌!

Update: 2017-07-03 05:24 GMT
సాధారణంగా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయా పార్టీల త‌ర‌ఫున బ‌రిలో నిలిచిన అభ్య‌ర్థులు ఓట్లు అడిగేందుకు వ‌చ్చే సంద‌ర్భాల్లో జ‌నం నుంచి ఎలాంటి స్పంద‌న వ‌స్తుంది? స‌ద‌రు అభ్య‌ర్థికి ఓటు వేసే ఇష్ట‌మున్నా, లేకున్నా... కూడా స‌రేలే వేస్తాం అంటారు. రాజకీయాల్లో కాస్తంత పేరు ఉన్న కుటుంబాలు కూడా ప్ర‌త్య‌ర్థి పార్టీ అభ్య‌ర్థులు త‌మ ఇంటికి వ‌చ్చి ఓటు అడిగినా... కూడా దాదాపుగా ఇదే సమాధానం వ‌స్తుంది. ఎందుకంటే... ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన అభ్య‌ర్థి త‌న ప‌రిధిలో ప్ర‌తి ఒక్క‌రిని ఓటు అడిగే హ‌క్కు ఉంటుంది. అదే స‌మ‌యంలో *మా ఓటు మీకు వేయం* అనే హ‌క్కు కూడా ఓట‌రుకు ఉన్నా... ఎందుకు వ‌చ్చిన ఇబ్బందిలే అంటూ వేస్తాంలే అంటారు. ఎందుకంటే... ముఖం మీదే *మా ఓటు మీకు వేయం*అని చెప్ప‌డం అంత బాగోదు క‌దా.

అయితే కొన్ని సంద‌ర్భాల్లో మాత్రం ఓట‌ర్లు ఆయా పార్టీల అభ్య‌ర్థుల‌కు షాకుల మీద షాకులిచ్చేస్తారు. చాలా అరుదుగా క‌నిపించే ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌లు ఇప్పుడు అంద‌రి నోళ్ల‌లో నానుతున్న క‌ర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో చోటుచేసుకుంటున్నాయి. అది కూడా అధికార టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డికి ఈ త‌ర‌హా చేదు అనుభ‌వాలు నిత్య‌కృత్య‌మ‌య్యాయ‌ట‌. నంద్యాల బైపోల్స్‌ కు సంబంధించి ఇంకా ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రాకున్నా... ఇప్ప‌టి నుంచే ప‌రిస్థితిని త‌మ‌కు అనుకూలంగా మల‌చుకునేందుకు భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డితో పాటు ఆయ‌న సోద‌రి,  మంత్రి భూమా అఖిల‌ప్రియ కూడా ఆశీర్వాద యాత్ర పేరిట నంద్యాల నియోజ‌క‌వ‌ర్గాన్ని చుట్టేస్తున్నారు. ప్ర‌త్యేకించి నియోజ‌క‌వ‌ర్గంలో మెజారిటీ ఓట్లు ఉన్న నంద్యాల ప‌ట్ట‌ణంలో వారు ఏ ఒక్క వీధిని కూడా వ‌ద‌ల‌కుండా ప‌ర్య‌టిస్తున్నార‌ట‌.

పేరుకు ఆశీర్వాద యాత్రే అయినా... ఉప ఎన్నిక‌లో త‌మ‌కు ఓట్లు వేయాల‌ని కోరేందుకే వారు ఈ ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఓట్లడుగుతున్న బ్ర‌హ్మానంద‌రెడ్డికి ప‌లు చేదు అనుభ‌వాలు ఎదుర‌వుతున్నాయ‌ట‌. అయినా టీడీపీకే ఎందుకు ఓటు వేయాలి? ఏం చేశార‌ని మీకు ఓటు వేయాలి? అని ఓట‌ర్లు ఆయ‌న ముఖం మీదే అడిగేస్తున్నార‌ట‌. ప్ర‌త్యేకించి మ‌హిళ‌లు... టీడీపీకి ఓటు వేసే ప్ర‌సక్తే లేద‌ని తేల్చి చెబుత‌న్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. నిన్న నంద్యాల ప‌రిధిలోని నూనెప‌ల్లెకు వెళ్లిన బ్ర‌హ్మానంద‌రెడ్డి... ఓ మ‌హిళ‌ను ఓటు అడ‌గ‌గా... టీడీపీకే ఎందుకు ఓటు వేయాల‌ని ఆమె బ్ర‌హ్మానంద‌రెడ్డి ముఖం మీదే అడిగేసింద‌ట‌. అంతేకాకుండా తాను మాత్రం త‌న ఓటును వైసీపీకే వేస్తాన‌ని కూడా ఆయ‌న ముఖం మీదే కుండ‌బ‌ద్దలు కొట్టింద‌ట‌.

ఇదే త‌ర‌హాలో ఓ నాలుగు రోజుల క్రితం కూడా బ్ర‌హ్మానంద‌రెడ్డికి ఇదే ర‌క‌మైన అనుభవం ఎదురైంద‌ట‌. ప‌ట్ట‌ణంలో ప్ర‌చారం చేస్తున్న క్ర‌మంలో ఓ వృద్ధురాలిని ఓటు అడిగిన బ్ర‌హ్మానంద‌రెడ్డి ఆమె ఇచ్చిన స‌మాధానంతో షాక్ తిన్నార‌ట‌. త‌న‌కు 70 ఏళ్ల వ‌య‌సు వ‌చ్చింద‌ని, అయినా ఇప్ప‌టికీ త‌నకు పింఛ‌న్ రాలేద‌ని, పింఛ‌న్ ఇవ్వ‌ని టీడీపీకి తాను ఓటు ఎందుకు వేస్తాన‌ని కూడా ఆమె బ్ర‌హ్మానంద‌రెడ్డి ముఖం మీదే చెప్పింద‌ట‌. దీంతో అస‌లు ఆమెకు ఏం స‌మాధానం చెప్పాలో కూడా బ్ర‌హ్మానంద‌రెడ్డికి అర్థం కాలేద‌ట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News