టీడీపీ అభ్య‌ర్థుల ఎంపిక‌లో బాబు వ్యూహ‌మిదే!

Update: 2019-03-20 05:14 GMT
క‌స‌ర‌త్తుల మీద క‌స‌ర‌త్తులు చేసి.. నామినేష‌న్ల ప‌ర్వం మొద‌లైన త‌ర్వాత టీడీపీ అసెంబ్లీ అభ్య‌ర్థుల జాబితాను భారీగా విడుద‌ల చేశారు ఏపీ ముఖ్య‌మంత్రిచంద్ర‌బాబు.  అభ్య‌ర్థుల ఎంపిక‌లో స‌ర్వేలు.. ఇత‌ర‌త్రా మార్గాల నుంచి తెప్పించుకున్న స‌మాచారంతో పాటు.. మ‌రికొన్నికాంబినేష‌న్ల‌తో అభ్య‌ర్థుల ఎంపిక జ‌రిగిన‌ట్లుగా చెబుతున్నారు  అభ్య‌ర్థుల గెలుపే ధ్యేయంగా టికెట్ల ఎంపిక క‌స‌ర‌త్తు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఎప్పుడూ లేని రీతిలో అసాధార‌ణ స్థాయిలో 43 శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు బాబు టికెట్లు నిరాక‌రించారు. పెద్ద ఎత్తున కొత్త‌వారికి చోటు ద‌క్కేలా చేశారు.

ఇటీవ‌ల కాలంలో ఈ స్థాయిలో సిట్టింగ్ అభ్య‌ర్థుల్ని మారుస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌టం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో పార్టీ త‌ర‌ఫున పోటీ చేసిన వారిలో 102 మంది ఎమ్మెల్యేలు గెల‌వ‌గా.. ఇద్ద‌రు స్వ‌తంత్ర ఎమ్మెల్యేలు కాగా.. 23 మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు. అనంత‌రం వారు పార్టీలో చేరారు. వీరి మొత్తం 127 మంది కాగా.. ఈ సీట్ల‌లో 34 మంది సిట్టింగుల‌కు చేయిచ్చిన బాబు.. కొత్త వారికి అవ‌కాశం ఇవ్వ‌టం సంచ‌ల‌నంగా మారింది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే సిట్టింగు ఎమ్మెల్యేల్లో ఒక‌రిద్ద‌రు బ‌లంగా ఉన్నా.. ఇత‌ర స‌మీక‌ర‌ణాల దృష్ట్యా వారికి టికెట్లు ఇవ్వ‌కుండా కొత్త వారికి ఇచ్చారు. అలాంటి వారిలో తొలుత అట‌వీ శాఖామంత్రి శిద్దా రాఘ‌వ‌రావు పేరును చెప్పాలి. ద‌ర్శి అసెంబ్లీ టికెట్ ను ఆయ‌న‌కు ఇస్తే గెలుపు ప‌క్కా. కానీ ఆయ‌న్ను ఒంగోలు ఎంపీగా బ‌రిలోకి దింపాల‌ని డిసైడ్ చేయ‌టంతో మార్పు త‌ప్ప‌లేదు. అదే రీతిలో జ‌మ్మ‌ల‌మ‌డుగు ఎమ్మెల్యే క‌మ్ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డిని క‌డ‌ప ఎంపీగా దింప‌టంతోనూ ఆయ‌న ప్రాతినిధ్యం వ‌హిస్తున్న అసెంబ్లీ స్థానానికి వేరొక‌రికి కేటాయించాల్సి వ‌చ్చింది.

అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్థులను ఎంపిక చేయ‌టంలో బాబు లెక్క‌ల్ని చూస్తే..

+  ఇద్దరు మంత్రులు సహా నలుగురు సిటింగ్‌ ఎమ్మెల్యేల సీట్లు మార్చారు.

+  మంత్రి గంటా శ్రీనివాసరావు తన స్థానమైన భీమిలిని వదిలి ఈసారి విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేస్తున్నారు.

+  ఎక్సైజ్‌ మంత్రి కేఎస్‌ జవహర్‌ ను కొవ్వూరు నుంచి తిరువూరుకు - పాయకరావుపేట ఎమ్మెల్యే అనితను కొవ్వూరుకు - కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావును దర్శికి మార్చారు.

+  అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును నక్సల్స్‌ హత్య చేయడంతో.. ఆయన కుమారుడు - గిరిజన సంక్షేమ మంత్రి శ్రావణ్‌ కు ఆ టికెట్‌ ఇచ్చారు.

+  నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వివిధ కారణాలతో బయటకు వెళ్లిపోయారు. వారిలో.. రావెల కిశోర్‌ బాబు (ప్రత్తిపాడు) జనసేనలోకి - మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి (గుంటూరు పశ్చిమ) - మేడా మల్లికార్జున్‌ రెడ్డి (రాజంపేట) - ఆమంచి కృష్ణమోహన్‌ (చీరాల) జ‌గ‌న్‌ పార్టీలోకి వెళ్లారు. ఆ స్థానాల్లో టీడీపీ కొత్త అభ్య‌ర్థుల్ని దించింది.

+  ఈసారి టికెట్ రాని ఎమ్మెల్యేల్లో గౌతు శివాజీ (పలాస) - కిమిడి మృణాళిని (చీపురుపల్లి) - మీసాల గీత (విజయనగరం) - వరుపుల సుబ్బారావు (పత్తిపాడు) - పులవర్తి నారాయణరావు (పి.గన్నవరం) - పీతల సుజాత (చింతలపూడి) - ముడియం శ్రీనివాసరావు (పోలవరం) - జలీల్‌ ఖాన్‌ (విజయవాడ పశ్చిమ) - డేవిడ్‌ రాజు (ఎర్రగొండ పాలెం) - ఎస్‌ వీ మోహన్‌ రెడ్డి (కర్నూలు) - కేఈ కృష్ణమూర్తి (పత్తికొండ) - మణిగాంధీ (కోడుమూరు) - పరిటాల సునీత (రాప్తాడు) - యామినీ బాల (శింగనమల) - హనుమంతరాయ చౌదరి (కల్యాణదుర్గం) - చాంద్‌ బాషా (కదిరి) - బొజ్జల గోపాలకృష్ణారెడ్డి (శ్రీకాళహస్తి) - తలారి ఆదిత్య (సత్యవేడు) - కాగిత వెంకట్రావు (పెడన) - జేసీ ప్రభాకర్‌ రెడ్డి (తాడిపత్రి) ఉన్నారు.

+   పలాస - చీపురుపల్లి - విజయవాడ పశ్చిమ - పత్తికొండ - రాప్తాడు - శ్రీకాళహస్తి - పెడన - తాడిపత్రిల్లో సిట్టింగ్  ఎమ్మెల్యేల కుమారులు లేదంటే వారి కుమార్తెలకు అవకాశం దక్కింది.
 
+  చంద్రబాబు కేబినెట్‌ లోని ఐదుగురు మంత్రులు ఈసారి అసెంబ్లీ బరిలో లేరు.

+  ఎమ్మెల్సీగా ఉన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అసెంబ్లీకి పోటీ చేయడం లేదు.

+  ఎమ్మెల్యేలుగా ఉన్న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి - మహిళా శిశు సంక్షేమ మంత్రి పరిటాల సునీత స్వచ్ఛందంగా పోటీ నుంచి వైదొలగి తమ కుమారులకు అవకాశం కల్పించారు.

+  శిద్దా రాఘవరావు - ఆదినారాయణరెడ్డి లోక్‌ సభకు పోటీ చేస్తున్నారు.

+ జ‌గ‌న్ పార్టీలో నుంచి టీడీపీలోకి వచ్చిన వారిలో ఆరుగురికి.. వరుపుల సుబ్బారావు - జలీల్‌ ఖాన్‌ - డేవిడ్‌ రాజు - మణి గాంధీ - చాంద్‌ బాషా - ఎస్‌ వీ మోహన్‌ రెడ్డిలకు అవకాశమివ్వలేదు.

+  గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడినవారిలో 23 మందికి మళ్లీ చాన్సు దక్కింది.

+  24 స్థానాల్లో ఇన్‌ చార్జులను కాదని కొత్త ముఖాలకు చోటు కల్పించారు.

+  మాజీ ఎంపీ సబ్బం హరి మొదటిసారి టీడీపీ టికెట్‌ పై భీమిలి నుంచి పోటీ చేస్తున్నారు.

+  నరసరావుపేట అసెంబ్లీ స్థానంలో డాక్టర్‌ అరవింద్‌ ను బరిలోకి దించారు.

+  ఐఏఎస్‌ అధికారి రామాంజనేయులుకు కర్నూలు జిల్లా కోడుమూరు సీటు దక్కింది.

+  ఎంపీ టీజీ వెంకటేశ్‌ కుమారుడు టీజీ భరత్‌ కు కర్నూలు సీటిచ్చారు.

+  కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు కుమార్తె అదితికి విజయనగరం సీటు దక్కింది.
Tags:    

Similar News