మీమర్స్, ట్రోలర్స్ కు పోలీసుల గట్టి వార్నింగ్

Update: 2023-03-29 18:00 GMT
అతి సర్వత్రా వర్జయితే.. ఏదైనా ఒక లిమిట్ ప్రకారం చేస్తేనే అది అందం.. ఆనందం.. కానీ పరిధి దాటితే అనర్థమే. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ట్రోలింగ్,మీమ్స్ అంటేనే ప్రముఖులంతా భయపడిపోతున్నారు. మొన్నటికి మొన్న మంత్రి మల్లారెడ్డి 'కష్టపడ్డా' అన్న డైలాగుకు జరుగుతున్న ట్రోలింగ్ అంతా ఇంతాకాదు.. ఇదే కాదు రాజకీయ ప్రముఖులు , సినీ ప్రముఖులు మాట్లాడే మాటలపై భారీ ఎత్తున కొందరు ట్రోలింగ్ చేస్తుంటారు. వారి పరువు తీసేలా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. ఇక నుంచి వారి ఆట కట్టడం గ్యారెంటీ అని పోలీసులు తాజాగా అరెస్ట్ తో హెచ్చరికలు పంపారు.

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ట్రోలర్స్, మీమర్స్ రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియాలో ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖలపై  ఇష్టానుసారంగా మీమ్స్ చేస్తూ ట్రోలింగ్ చేస్తూ దీన్నో మాఫియాగా తీర్చిదిద్దుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులు, సినీ , ఇతర రంగాల ప్రముఖులు ఈ ట్రోలింగ్ బారిన పడుతున్నారు. దీన్ని నియంత్రించే మార్గమే లేకుండా పోయింది ఇన్నాళ్లు. కానీ ఇప్పుడు పోలీసులు పలు అరెస్ట్ లు చేసి మీమర్స్, ట్రోలర్స్ కు గట్టి హెచ్చరికలు పంపారు.

హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ స్నేహ మెహ్రా తాజాగా పలువురు ప్రజాప్రతినిధులపై ట్రోలింగ్ చేసిన 20 మందిపై కేసులు నమోదు చేసి 8 మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు., మరో 30 మంది ట్రోలర్లకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. చట్టాలు చేసే లీడర్లపై, అలానే మహిళలపై అసభ్యకర పోస్టులు పెడితే తాట తీస్తామంటూ పోలీసులు హెచ్చరించారు.

అసభ్యకరమైన పోస్టులు చేసినా.. మీమ్స్, ట్రోల్ చేసినా ఫొటో మార్పింగ్ చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇటీవల కాలంలో కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పెచ్చరిళ్లి ట్రోలింగ్ చేస్తున్నాయని డీసీపీ క్రైమ్ స్నేహా తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లోని యూట్యూబ్ చానెళ్లలో రాజకీయ నాయకులు, సెలబ్రెటీలపై అసభ్యకరమైన రీతిలో పదాలు వాడి ట్రోల్ చేశారు. దీనిపై సైబర్ క్రైమ్ నిఘా పెట్టి మరీ ఆధారాలు సేకరించింది.

తాజాగా ఛానల్ నిర్వాహకులను అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసింది. ఇకపై ట్రోలర్స్, మీమర్స్ ఎవరైనా సరే ఇష్టానుసారంగా అవమానించేలా వీడియోలు రూపొందించినా షేర్ చేసినా చర్యలు తీసుకుంటామని.. జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. రేటింగ్, డబ్బు కోసం అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై ఇక నిఘా పెంచుతున్నట్టు డీసీపీ హెచ్చరించారు.

ఇష్టానుసారంగా రెచ్చిపోయే ట్రోలర్స్, మీమర్స్ కు ఇలా పోలీసులు షాకిచ్చారు. ఎదుటివారిని కించపరిచేలా వీరు చేసే అతి వల్ల ఇప్పటికే చాలా మంది చాలా రకాలుగా మానసికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటుండడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ట్రోలర్స్ బుద్ది తెచ్చుకొని తీరు మార్చుకోకపోతే జైలు పాలు కావాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News