తెలంగాణ ప్రాంతంలో అన్నదాతల ఆర్థిక పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పే ఉదంతమిది. తెలంగాణ అసెంబ్లీలో రైతుల ఆత్మహత్యలు చేసుకోవద్దంటూ తెలంగాణ ముఖ్యమంత్రి ఒక ప్రకటన ఇవ్వటంతోనే సరిపోదని.. వారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఎంత భయానకంగా ఉందన్న విషయాన్ని తాజా ఉదంతం చెప్పకనే చెబుతుంది. పదో తరగతి విద్యార్థి స్కూలు ఫీజు చెల్లించలేక.. తల్లిదండ్రుల్ని అడగలేక.. అవమానాలకు తట్టుకోలేక.. ఆత్మాభిమానం పోయిందన్న బాధతో ఆత్మహత్య చేసుకున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది.
కరీంనగర్ జిల్లా పెద్దపల్లికి చెందిన సంతోష్ రెడ్డి అనే 15 ఏళ్ల విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. స్కూలు ఫీజు కింద రూ.5వేల మొత్తం చెల్లించారు. అయితే టర్మ్ ఫీజు చెల్లించాల్సి ఉంది. సంతోష్ తండ్రి వ్యవసాయం చేస్తుంటాడు. పంట లేకపోవటంతో ఇబ్బందికరంగా మారి.. సకాలంలో ఫీజు చెల్లించలేకపోయాడు. దీంతో ఆగ్రహించిన స్కూలు యాజమాన్యం పాఠశాల బయట నిలబెట్టింది. ఫీజు చెల్లించలేకపోవటం.. గడువు అడిగితే ఇవ్వని స్కూలు యాజమాన్యం.. ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల్ని చూసి తల్లడిల్లిపోయాడు.
ఫీజు కట్టలేదన్న కారణంగా స్కూలు బయట నిలుచోబెట్టిన ఉదంతంలో.. తనకు ఎదురైన అవబమానాన్ని తట్టుకోలేకపోయాడు సంతోష్ రెడ్డి. తన కజిన్ సెల్ ఫోన్ లో ఒక సెల్ఫీ వీడియో తీసుకున్న అతగాడు.. తన ఆవేదనను వెల్లడించి.. రైలు పట్టాల మీద ఆత్మహత్య చేసుకున్నాడు. దానిని తన స్నేహితుడికి పంపి తన ఆవేదనను చెప్పుకున్నాడు.