నారాయ‌ణ కాలేజీలో విద్యార్థిని కొట్టిచంపేశారా?

Update: 2017-09-19 05:57 GMT
విజయవాడ స‌మీపంలో గూడవల్లి నారాయణ క్యాంపస్ లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఇంటర్ విద్యార్థి ఈశ్వర్ రెడ్డి ఉదంతం తీవ్ర క‌ల‌క‌లం రేపింది. ఈశ్వర్‌ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని కాలేజీ యాజమాన్యం చెబుతుండగా తమ బిడ్డను కర్రలతో కొట్టి చంపేశారని విద్యార్థి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈశ్వర్‌ రెడ్డి అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన ఘటనపై 24 గంటలు గడిచినా హత్యా...ఆత్మహత్యా అనేది తేలకపోవటంపై సందేహాలు ముసురుకుంటున్నాయి. మ‌రోవైపు ఈశ్వర్ రెడ్డి మృతదేహంకు పోస్టుమార్టం సంద‌ర్భంగా మార్చురి వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. విద్యార్థుల ఆందోళ‌న నేప‌థ్యంలో స్పెషల్ పార్టీ పోలీసులు భారీగా మోహరించారు.

గూడవల్లి నారాయణ క్యాంపస్ లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఇంటర్ విద్యార్థి ఈశ్వర్ రెడ్డి పోస్టుమార్టం వద్దకు వచ్చిన విద్యార్థి సంఘాలను పోలీసులు అడ్డుకున్నారు. నారాయణ కాలేజీకి చెందిన సిబ్బందిని పెద్ద సంఖ్యలో మార్చురీ వద్దకు అనుమతించి, తమను మాత్రం అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఏపీ మంత్రులు నారాయణ - విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థి మృతదేహంను ఉంచిన అంబులెన్స్ ఎదుట ధర్నాకు దిగారు. విద్యార్థి మరణానికి కారకులైన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటికే భారీగా మోహరించిన పోలీసులు విద్యార్థి సంఘం ప్రతినిధులను బలవంతంగా ఈడ్చుకుంటూ బయటకు తీసుకువెళ్ళారు. పలువురిని అరెస్ట్ చేసి - పోలీస్ వాహనాల్లోకి ఎక్కించడంతో ఉద్రిక్తత ఏర్పడింది. మ‌రోవైపు నారాయణ కాలేజీలో మృతి చెందిన విద్యార్థి విష‌యంలో ప‌లు సందేహాలు నెల‌కొంటున్నాయి. విద్యార్థులు అంతా తరగతి గదిలో ఉంటే ఈశ్వర్‌ రెడ్డి ఒక్కడే హాస్టల్‌ కు ఎందుకు వెళ్లాడనే విష‌యంలో స‌మాధానం దొర‌క‌డం లేదు. హాస్టల్‌ గదిలో ఉరివేసుకుంటుంటే సహ విద్యార్థులు గమనించరా అనే ప్ర‌శ్న‌లు అనుమానాస్ప‌దంగా మిగిలాయి.

కాగా తల్లిదండ్రులు పింగళి మల్లారెడ్డి - మంగమ్మ మార్చురీ వద్ద కన్నీరుమున్నీరు అయ్యారు. త‌మ కొడుకు చ‌నిపోతే కనీసం నారాయణ కాలేజీ యాజమాన్యం సమాచారం కూడా ఇవ్వలేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అదే కాలేజీలో చదివే మంచికల్లు గ్రామానికి చెందిన విద్యార్థులు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారని తెలిపారు. `` కొడుకును విపరీతంగా కొట్టి చంపారు. కాళ్ళపై కర్రలతో కొట్టిన వాతలు కనిపిస్తున్నాయి.చదువు విషయంలో ఎన్నడూ వెనకాడే స్వభావం కాదు. చదువుపై తపనతోనే నారాయణ కాలేజీలో చేరాడు. మంచికల్లుకు చెందిన విద్యార్థులతో మాట్లాడ నివ్వడం లేదు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు నా కొడుకు`` అని మృతుడి తండ్రి మల్లారెడ్డి మీడియాతో వాపోయారు.

కాగా, ఈ ప‌రిణామంపై విప‌క్ష వైసీపీ ఘాటుగా స్పందించింది. నారాయణ కాలేజీలో జరుగుతున్నవి ఆత్మహత్యలు కావు, అవి యాజమాన్యం ర్యాంకుల కోసం చేస్తున్న హత్యలని మాజీ విద్యాశాఖ మంత్రి, వైసీపీ అధికార ప్ర‌తినిధి పార్థసార‌ధి ఆరోపించారు. తమ సంస్థ పేరు కోసం విద్యార్థులను వేధించి, హింసించి.. ఆత్మహత్య చేసుకునే స్థితికి తెస్తున్నారని  మండిప‌డ్డారు. విద్యార్థులు బలవన్మరణాలకు గురవుతుంటే ప్రభుత్వం కళ్ళప్ప‌గించి చూస్తోందని ఆరోపించారు. కార్పోరేట్ దోపిడీకి ఊతం ఇస్తోందని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని డిమాండ్ చేశారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు కౌన్సెలింగ్ చేపట్టాలని మాజీ మంత్రి పార్థసారథి డిమాండ్ చేశారు.
Tags:    

Similar News