కరోనా ఎఫెక్ట్.. చదవడం.. రాయడం మర్చిపోతున్న విద్యార్థులు..!

Update: 2022-12-20 00:30 GMT
కరోనా ప్రభావంతో అన్ని రంగాలు కుదేలైన సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా విద్యారంగం.. సినీ పరిశ్రమ కరోనా ధాటికి కోలుకోలేని విధంగా మారాయి. రెండేళ్లు స్తబ్దుగా ఉన్న ఈ రంగాలు క్రమంగా పుంజు కుంటున్నాయి. సినిమా పరిశ్రమ ఏదోలా గట్టెక్కుతున్నట్లు కన్పిస్తోంది. అయితే విద్యా వ్యవస్థ మాత్రం ఇంకా గాడిన పడటం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

కరోనా సమయంలో విద్యా సంస్థలన్నీ మూతపడ్డాయి. దీంతో సుమారు రెండేళ్లపాటు ఆన్ లైన్లోనే బోధనలు నడిచాయి. అయితే వీటి వల్ల గ్రామీణ విద్యార్థులకు ఏమాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. తాజాగా జ్ఞాన్ విజ్ఞాన్ సమితి ఝార్ఖండ్ అనే సామాజిక సంస్థ విద్యార్థుల చదువులపై ఓ సర్వే నిర్వహించగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఝార్ఖండ్ రాష్ట్రంలోని 138 ప్రాథమిక.. ప్రాథకోన్నత పాఠశాలల్లో జ్ఞాన్ విజ్ఞాన్ సమితి అనే సామాజిక సంస్థ సర్వే నిర్వహించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులు చదవడం.. రాయడం మర్చిపోయారని నివేదికలో వెల్లడించారు. ఈ పిల్లలకు సహాయం అంతంత మాత్రంగా ఉందని పేర్కొన్నారు.

ఎస్సీ.. ఎస్టీ కుటుంబాల నుంచి వచ్చిన కనీసం 50 శాతం మంది చేరిన ప్రభుత్వ ప్రాథమిక.. ప్రాథమికోన్నత పాఠశాలలపై సర్వే ప్రధానంగా కొనసాగింది. విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయులు.. విద్యార్థుల నిష్పత్తి 30లోపు 53 శాతం ప్రాథమిక పాఠశాలలు.. 19 శాతం ప్రాథమికోన్నత పాఠశాలల్లోనే ఉందని సర్వేలో తేలింది.

సర్వే జరిగిన 138 పాఠశాలల్లో 20 శాతం వరకు ఒకే ఉపాధ్యాయుడితో నడుస్తున్నాయని.. వీరిలోనూ ఎక్కువ మంది పారా టీచర్లే ఉన్నారని వెల్లడైంది. ఒకే ఉపాధ్యాయుడు ఉన్న పాఠశాలల్లో 90 శాతం మంది విద్యార్థులు దళితులు.. ఆదివాసీలే ఉన్నారని పేర్కొంది. అలాగే 40 శాతం ప్రాథమిక పాఠశాలలు పారా టీచర్లతోనే పూర్తి నడుస్తున్నట్లు నివేదించారు.

విద్యార్థుల హాజరు శాతం సెప్టెంబర్.. అక్టోబరు నెలల్లో ప్రాథమిక పాఠశాలల్లో 68 శాతం.. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 58 శాతంగా నమోదైంది. ఒక్క పాఠశాలలో కూడా టాయ్‌లెట్, విద్యుత్, నీటి సౌకర్యం లేదని.. మూడింట రెండొంతుల స్కూళ్లకు ప్రహరీలు.. 64 శాతం పాఠశాలలకు ఆట స్థలాలు.. 37 శాతం పాఠశాలల్లో లైబ్రరీల్లో పుస్తకాలు లేవని తేల్చింది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News