గోదారమ్మ ఎంతలా బోసి పోయిందంటే..?

Update: 2016-03-28 04:03 GMT
దేశంలో కరవు తీవ్రత ఏ స్థాయిలో ఉందో చెప్పే ఘటన ఇది. జీవనదిగా చెప్పుకునే గోదారి.. ఎపుడూ లేనంత వర్షాభావంతో జలకళ తగ్గి బోసిపోతోంది. నీటి ప్రవాహం తగ్గటంతో నదిలోపల ఎన్నో దశాబ్దాలుగా మునిగిపోయి కనపడకుండా పోయిన ​​కొన్ని దేవాలయాలు మహారాష్ట్రలో బయటకు వచ్చాయి. అవి పురాతన కాలం నాటి శివ.. విష్ణు దేవాలయాలు.  వేసవి కాలంలో గోదారి ఉధృతి తగ్గినప్పుడు ఆలయ గోపురాలు కనిపించటం మామూలే అయినా.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా గుడి మొత్తం బయటపడింది. ఇది మహారాష్ట్రలోని నాసిక్ సమీపంలోని చందోరిలో కనిపిస్తున్న దృశ్యం.

ఇలాంటి పరిస్థితి చాలా అరుదుగా ఏర్పడుతుందని.. గడిచిన మూడు దశాబబ్దాలలో ఈ పరిస్థితి చోటు చేసుకోలేదని.. దీన్ని బట్టి గత వర్షాకాలంలో వర్షాభావం ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుందని అన్నారు. తాజాగా బయటపడిన దేవాలయాలు పదమూడో శతాబ్దంలో నిర్మించినవని.. నాసిక్ ను పాలించిన పేష్వాల కాలంలో వీటిని నిర్మించి ఉంటారని అంచనా వేస్తున్నారు. కరవు పుణ్యమా అని అరుదైన దేవాలయాల్ని చూసే అవకాశం అక్కడి చుట్టుపక్కల వారికి లభిస్తోంది. కరవు మీద పడి.. తమ బతుకుల్ని తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నందుకు బాధ పడాలో.. ఏళ్లకు ఏళ్లుగా చూడని దేవాలయాలు బయటకు వస్తున్నందుకు సంతోషపడాలో తెలీని దుస్థితి నెలకొని ఉందని చెప్పొచ్చు.
Tags:    

Similar News