జగన్..బీజేపీ ఫైర్ బ్రాండ్ భేటీ వెనుక అసలు లెక్క అదేనా?

Update: 2021-09-16 05:18 GMT
ఊరకే రారు మహానుభావులు అన్నట్లుగా కొన్ని భేటీల్ని చూసినంతనే అనిపిస్తుంది. బీజేపీ ఫైర్ బ్రాండ్ కమ్ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామి తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని.. తాడేపల్లిలోని సీఎం కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. ఓవైపు ఏపీ బీజేపీ నేతలంతా జగన్ పై ఒంటికాలి మీద లేవటం.. ఆయనపై విమర్శలు కురిపిస్తున్న వేళ.. అందుకు భిన్నంగా మేధావి వర్గంగా చెప్పుకునే సుబ్రమణ్య స్వామి మాత్రం జగన్ ను కలవటం.. కులాశాగా కబుర్లు చెప్పటం ఆసక్తికరంగా మారింది.

ఈ భేటీ వెనుక ఏం జరిగింది?ముఖ్యమంత్రి జగన్ ను సుబ్రమణ్య స్వామి ఎందుకు కలిశారు? అన్నది ప్రశ్నగా మారింది. వారి భేటీ పార్టీలకు అతీతంగా.. వ్యక్తిగత స్థాయిలో జరిగినట్లుగా చెబుతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవటానికి ముందు.. సుబ్రమణ్య స్వామి టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డిని కలవటం.. ఆ తర్వాత జగన్ తో భేటీ కావటం గమనార్హం.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తాజాగా టీటీడీ బోర్డును సీఎం జగన్ డిసైడ్ చేయటం తెలిసిందే. బోర్డులో సభ్యుడిగా.. తన సిఫార్సు మేరకు ఒకరికి సభ్యత్వాన్ని జగన్ ఇచ్చారని.. అందుకు థ్యాంక్స్ చెప్పే ఉద్దేశంతోనే కలిసినట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. టీటీడీ విధానాలపై కొన్ని మీడియా సంస్థలు అసత్య ప్రచారం చేస్తున్నారంటూ సుబ్రమణ్య స్వామి కేసులు వేసిన సంగతి తెలిసిందే. తాను చెప్పిన వ్యక్తికి టీటీడీ బోర్డులో చోటు కల్పించినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపేందుకే స్వామి తాడేపల్లికి వచ్చినట్లు చెబుతారు.

ఆసక్తికరమైన అంశం ఏమంటే.. టీటీడీ బోర్డు సభ్యుల జాబితాను ఫైనల్ చేసే సమయంలోనే స్వామి రావటం.. తొలుత సుబ్బారెడ్డిని.. అనంతరం సీఎం జగన్ ను కలవటం.. ఆ తర్వాత టీటీడీ బోర్డు సభ్యుల జాబితాను విడుదల చేయటం జరిగిపోయాయి. ఇంతకీ జగన్ సర్కారు తాజాగా విడుదల చేసిన జాబితాలో స్వామి సూచించిన ప్రముఖుడు ఎవరన్న దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.




Tags:    

Similar News