రాహుల్ పాదయాత్రలో ఇలాంటి సీన్ అస్సలు ఊహించలేరు

Update: 2022-09-09 05:31 GMT
దేశంలో ఇప్పటివరకు మరే జాతీయ నేత కూడా చేయని పనికి పూనుకున్నారు కాంగ్రెస్ అగ్ర నాయకత్వానికి చెందిన నేత రాహుల్ గాంధీ. అమూల్ బేబీగా.. యువరాజుగా విమర్శలకు నుంచి పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్న ఆయన.. తన జీవితంలో తాజాగా చేస్తున్న పాదయాత్రతో అయినా.. అతగాడి మీద ఉన్న ఎన్నో సందేహాలు.. ఆయన సమర్థత మీద ఉన్న అనుమానాలు తీరే అవకాశం ఉందని చెప్పక తప్పదు.

పరాజయానికి వ్యతిరేకంగా పోరాడితే పోయేదేమీ లేదు ఓటమి తప్ప అంటూ కొత్త తరహాలో చెప్పిన రాహుల్ మాట రాబోయే రోజుల్లో ఆయనను విజేతగా మారుస్తుందేమో చూడాలి. తనకు సరిగ్గా సూటయ్యే మాటను తానే చెప్పటం విశేషంగా చెప్పక తప్పదు. కన్యాకుమారిలో ప్రారంభించిన పాదయాత్ర రెండో రోజున ఉదయం 7.15 గంటలకు మొదలు పెట్టిన రాహుల్.. సుశీంద్రంకు 9.50కు చేరుకున్నారు. అక్కడ ఉన్న మహిళా స్వయం సహాయక టీంలను ఉద్దేశించి ప్రసంగించారు. పెద్ద ఎత్తున చేరుకున్న విద్యార్థులతో ఆయన ముచ్చటించారు.

ఇక్కడే ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నిజానికి ఇలాంటివి రాజకీయాల్లో మాత్రమే కనిపిస్తాయి. గతంలో తమిళనాడు పీసీసీకి అధ్యక్షుడిగా వ్యవహరించిన అనంతన్  రాహుల్ ను కలిశారు. ఇంతకీ ఈ అనంతన్ ఎవరు? ఆయనకు అంత బిల్డప్ ఎందుకు ఇస్తున్నట్లు? అన్న అసహనంతో కూడి సందేహాలు రావొచ్చు. విషయం మొత్తం తెలిస్తే ఆ మాట వచ్చే అవకాశమే లేదు.

ఎందుకంటే.. అనంతన్ ఎవరో కాదు.. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గా వ్యవహరిస్తున్న తమిళ సై తండ్రి. కుమార్తె బీజేపీలో కీలక భూమిక పోషించి.. ఇవాల్టి రోజున ఒక రాష్ట్రానికి గవర్నర్ గా వ్యవహరిస్తున్న వేళ.. తన మూలాల్ని మిస్ కాకుండా తనకు కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని మర్చిపోకుండా రాహుల్ పాదయాత్రకు ఆయన రావటం అంటే.. యాత్రకు ఉన్న ప్రాధాన్యతను చెప్పకనే చెప్పినట్లైందని చెప్పాలి.

అనంతన్ ను చూసినంతనే రాహుల్ అప్యాయంగా ఆయన్ను పలుకరించారు. ఈ సందర్భంగా పాదయాత్రపై రాహుల్ పట్టుదల చూస్తుంటే తనకు రాజీవ్.. ఇందిరాగాంధీలు గుర్తుకు వస్తున్నారంటూ పాత గురుతుల్ని గుర్తు చేసుకోవటం గమనార్హం. తెలుపు టీ షర్టు.. బ్లాక్ ప్యాంట్ వేసుకున్న రాహుల్.. అందరితో సరదాగా మాట్లాడుతూ..

వారి సమస్యల్ని తెలుసుకుంటూ ముందుకు సాగారు. పలు సందర్భాల్లో సెక్యూరిటీ అభ్యంతరాల్ని పక్కకు పెట్టేసి మరీ తన కోసం వచ్చిన ప్రజల వద్దకు వెళ్లి మాట్లాడారు. గురువారం రాత్రి సమయానికి రాహుల్ నాగర్ కోయిల్ కు చేరుకున్నారు అక్కడి స్కాట్ క్రైస్తవ కాలేజీలో బస చేశారు. పాదయాత్ర మొదటి రోజున రాహుల్ గంటకు 3.5 కిలోమీటర్ల చొప్పున నడిచారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News