నారా లోకేష్ కు సమాధానం ఇచ్చిన హోంమంత్రి!

Update: 2019-06-18 04:13 GMT
ఏపీలో రాజకీయ కక్ష సాధింపు దాడులు జరుగుతూ ఉన్నాయని ఆరోపించిన నారా లోకేష్ కు బదులిచ్చారు ఏపీ హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతూ ఉన్నాయని లోకేష్ ఆరోపించారు. ఆ ఆరోపణను కూడా హెచ్చరికలా చేశారు లోకేష్. 'అలాంటి దాడులను ఉపేక్షించేది లేదు.. మా సహనానికి పరీక్ష పెట్టొద్దు..' అంటూ పవర్ ఫుల్ డైలాగులు వేశారు లోకేష్!

దీంతో ఈ అంశంపై అధికార పార్టీ స్పందించింది. ప్రభుత్వం తరఫు నుంచి కూడా స్పందన వ్యక్తం అయ్యింది. ఆ బాధ్యత హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత తీసుకున్నట్టుగా ఉన్నారు. ఏపీలో ఫలితాలు వచ్చిన రోజు నుంచి చోటు చేసుకున్న రాజకీయ దాడుల వివరాలను హోం మంత్రి ప్రస్తావించారు. దాదాపు గత నెల రోజుల్లో రాజకీయ దాడులు, ప్రతి దాడుల్లో నూటా ఒక్క మంది గాయపడ్డారని హోం మంత్రి ప్రకటించారు.

వారిలో పార్టీల వారీగా కూడా ఆమె నంబర్లు చెప్పారు. గాయపడిన వారిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నలభై నాలుగు మంది కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు  యాభై ఏడు మంది అని ఆమె చెప్పారు. ఈ లెక్కన చేస్తూ దాడులు చేస్తున్నది ఎవరో అర్థం చేసుకోవచ్చని సుచరిత పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ వాళ్లు రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నారని, దీంతోనే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతూ ఉందని హోం మంత్రి అభిప్రాయపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఆ ధోరణిని మార్చుకోవాలని ఆమె హితబోధ చేశారు.
Tags:    

Similar News