రాజ‌ధానిని కుదిపేస్తున్న పున‌రావాస రాజ‌కీయం..!

Update: 2019-09-10 09:05 GMT
ఏపీ రాజ‌ధాని గుంటూరు జిల్లాను పున‌రావాస రాజ‌కీయాలు కుదిపేస్తున్నాయి. తమ పార్టీకి చెందిన నాయ‌కుల‌ను వైసీపీ నాయ‌కులు ఊళ్ల నుంచి త‌రిమి వేశార‌ని ఆరోపిస్తూ.. కొన్నాళ్లుగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు పెద్ద ఎత్తున విమ‌ర్శిస్తున్న విష‌యం తెలిసిందే. అధికారంలోకి వ‌చ్చి 100 రోజులైనా కాక‌ముందుగానే జ‌గ‌న్ కుట్ర పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తూ.. పార్టీ నేత‌ల‌ను - కార్య‌క‌ర్త‌ల‌ను ఊళ్ల నుంచి త‌రికొడుతున్నార‌ని ఆరోపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే గుంటూరులోని ద‌ళిత వాడ‌లు - ప‌ల్లెల్లో ఉన్న టీడీపీ కార్య‌క‌ర్త‌లు - బాధితుల‌ను ఒక చోటకు చేర్చి.. ప‌ల్నాడులో పున‌రావాస కేంద్రాల‌ను చంద్ర‌బాబు ఏర్పాటు చేయించారు.

అయితే, ఇదంతా కేవ‌లం రాజ‌కీయంగా ప‌బ్బం గ‌డుపుకొనేందుకు మాత్ర‌మే టీడీపీ ఆడిస్తున్న డ్రామాగా వైసీపీ చెబుతోంది. బాధితులు అంటూ ఎవ‌రైనా ఉంటే అది వైసీపీ కార్య‌క‌ర్త‌లేన‌ని సాక్షాత్తూ హోం మంత్రి ఎం.సుచ‌రిత ప్ర‌తి విమ‌ర్శ‌లు - ప్ర‌తి కౌంట‌ర్లు ఇచ్చారు. ఈ క్ర‌మంలోనే ఆమె మొత్తం కేసులు 79 న‌మోదయ్యాయ‌ని  వీటిలో టీడీపీ నేత‌లు పెట్టిన కేసులే 43 ఉన్నాయ‌ని ఇంత‌క‌న్నా పార‌ద‌ర్శ‌క పాల‌న ఎక్క‌డ ఉంటుంద‌ని ఆమె ప్ర‌శ్నించారు. పెయిడ్‌ ఆర్టిస్టులతో పునరావాస కేంద్రాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. పల్నాడు ప్రాంతంలో దాడుల భారిన పడిన బాధితుల గుర్తింపు సహా... వారు ప్రశాంతంగా జీవించేలా చేసేందుకు నిజనిర్ధారణ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. 

పోలీసు ఉన్నతాధికారులను సదరు పునరావాస కేంద్రాలకు పంపుతామని చెప్పారు.. నిజమైన బాధితులు - పెయిడ్‌ ఆర్టిస్టులు ఎవరనేది వారు తేలుస్తారని చెప్పారు. ‘కేంద్రాల్లో ఉన్న వారంతా నిజంగా బాధితులైతే పోలీసు బందోబస్తుతో సొంత గ్రామాలకు తీసుకెళ్లి ప్రశాంత వాతావరణంలో బతికేలా చర్యలు తీసు కుంటాం. అని వివ‌రించారు. మ‌రోప‌క్క, వైసీపీ బాధితుల శిబిరం వద్దకు పోలీసు బృందం వెళ్లింది. వైసీపీ బాధితులను... వారి వారి స్వగ్రామాలకు చేర్చేందుకు వాహనాలతో సహా పోలీసులు వెళ్లారు. ఒక‌ప‌క్క టీడీపీ - వైసీపీలు ప‌ర‌స్ప‌ర వాదులాట చేసుకుంటుంటే.. టీడీపీ వర్గీయుల ఇళ్లపై వైసీపీ వర్గీయులు దాడి చేశారని స‌మాచారం.

దీంతో గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం గ్రంధశిరిలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వర్గీయులకు చెందిన ట్రాక్టర్ - ద్విచక్ర వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇరువర్గాలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. ఇక‌, ఈ విష‌యం మ‌రింత‌గా రాజ‌కీయ రంగు పులుముకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


Tags:    

Similar News