ఆ మంత్రికి కుల బహిష్కరణ

Update: 2016-02-07 08:44 GMT
దేశంలో కులపట్టింపులు - కులం పేరుతో విధించే కట్టుబాట్లు... తీసుకునే నిర్ణయాలు రోజురోజుకూ అధికమవుతున్నాయి. సామాన్య ప్రజానీకమే కాదు చివరికి మంత్రుల స్థాయి వ్యక్తులకు కూడా ఈ కుల బహిష్కరణ తప్పడం లేదంటే ఆశ్చర్యమేయక మానదు. అయితే... గతంలో ఇలాంటి కుల బహిష్కరణలను ప్రోత్సహించి, పట్టుపట్టిన మంత్రికే ఇప్పుడు ఆ శిక్ష పడడం గమనార్హం.

భారత దేశం లో కులం పట్టింపులు ఎంత తీవ్రంగా ఉంటాయో చెప్పడానికి ఒడిశాలో రీసెంటుగా జరిగిన సంఘటనే ఉదాహరణ. ఒడిశాలో ఎస్సీ - ఎస్టీ - గిరిజన సంక్షేమం - యువజన సర్వీసులు - క్రీడాశాఖల మంత్రిగా ఉన్న సుధామ్ మరాండీ సంతాల్ తెగకు చెందినవారు. దేశంలో అతిపెద్ద గిరిజన తెగల్లో మూడోదిగా గుర్తింపు ఉన్న సంతాల్ తెగలో ఆచారాలు - కట్టుబాట్లు చాలా ఎక్కువ. జార్ఖండ్ - బెంగాల్ - బీహార్ - ఒడిశా - ఛత్తీస్ గఢ్ లలో ఉన్న ఈ తెగ నుంచి రాజకీయ నాయకులూ చెప్పుకోదగ్గ సంఖ్యలో  ఉన్నారు. ముఖ్యంగా జార్ఖండ్ - ఒడిశా - బీహార్లలో సంతాల్ తెగ నుంచి కీలక నేతలు ఉన్నారు. అలాంటి గిరిజన వర్గానికి చెందిన సుధామ్ మరాండీ తన కుమార్తె, వైద్యురాలు సంజీవనిని బీజేడీలో స్టూడెంట్ యూనియన్ నేత అయిన సునీల్ సరంగి అనే బ్రాహ్మణ యువకుడికి ఇచ్చి జనవరి 31న పెళ్లి చేశారు.

అసలు కధ మొదలైంది. గిరిజనుడైన సుధామ్ మరాండీ కులం కట్టుబాట్లు దాటారంటూ ఆయన స్వస్థలం బంగ్రిపోసిలో సంతాల్ తెగకు చెందిన కుల పెద్దలంతా సమావేశమయ్యారు. కులాంతర వివాహం జరిపి మంత్రి కట్టుబాట్లు మీరారని తేల్చి మంత్రిని కులం నుంచి, ఊరి నుంచి వెలివేస్తున్నట్టు ప్రకటించారు. అంతటితో ఆగకుండా మంత్రికి మద్దతు ఇచ్చారనే కారణంతో మయూర్ భంజ్ జిల్లాకు చెందిన ముగ్గురికి అదే శిక్ష విధించారు.

అయితే... సుధామ్ మరాండీకి కులం వేసిన శిక్షపై సంతాలీ నేతలు సంతోషిస్తున్నారట. గతంలో మాజీ మంత్రి చైతన్య ప్రసాద్ మాంఝీ ఇద్దరు కుమార్తెలు కులాంతర వివాహం చేసుకున్నపుడు మరాండీ నానా యాగీ చేశారు. మాంఝీని కులం నుంచి, ఊరి నుంచి బహిష్కరించే వరకు వదల్లేదు. కులాంతర వివాహలను సంతాల్ తెగ అంగీకరించదని వేదికలెక్కి ఆయన ప్రసంగాలు చేశారు. ఇప్పుడు ఆయన కూడా అదే శిక్షను ఎదుర్కొన్నారు. అందుకేనేమో చెరపకురా చెడేవు అంటారు.
Tags:    

Similar News