ఈడీ త‌న‌కు అన్నం కూడా పెట్ట‌లేదంటూ సుజ‌నా ఆవేద‌న

Update: 2018-12-20 07:47 GMT
టీడీపీ ఎంపీ - కేంద్ర మాజీ మంత్రి సుజ‌నా చౌద‌రి నేతృత్వంలోని సుజ‌నా గ్రూపు సంస్థ‌ల్లో ఈడీ సోదాలు ఇటీవ‌ల క‌ల‌క‌లం సృష్టించాయి. డొల్ల కంపెనీల‌తో మాయ చేసి దాదాపు రూ.5,700 కోట్ల బ్యాంకు రుణాల‌ను సుజ‌నా సంస్థ‌లు ద‌క్కించుకున్న‌ట్లు అభియోగాలు న‌మోద‌య్యాయి. ప‌లు కీల‌క ప‌త్రాల‌ను స్వాధీనం చేసుకున్న ఈడీ.. ఇటీవ‌ల‌ సుజ‌నాను పిలిపించుకొని ప్ర‌శ్నించింది కూడా.

తాజాగా మ‌రోసారి సుజ‌నాను ప్ర‌శ్నించేందుకు ఈడీ సిద్ధ‌మైంది. ఆయ‌న‌కు స‌మ‌న్లు జారీ చేసింది. ఈ స‌మ‌న్ల‌పై సుజ‌నా దిల్లీ హైకోర్టును ఆశ్ర‌యించారు. తాను విచార‌ణ‌కు హాజ‌రు కావొద్ద‌నుకుంటున్న‌ట్లు చెప్పారు. గ‌తంలో ఈడీ త‌న‌ను విచారించిన‌ప్పుడు చోటుచేసుకున్న ప‌రిణామాల‌ను కోర్టుకు నివేదించారు. రోజంతా త‌న‌ను విచారించిన ఈడీ క‌నీసం త‌న‌కు ఆహారం కూడా ఇవ్వ‌లేద‌ని వాపోయారు.

క్రితంసారి విచార‌ణ స‌మ‌యంలో ఈడీ అధికారులు త‌న‌ను ఉదయం పదకొండున్నర గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు విచారించిన‌ట్లు సుజ‌నా కోర్టుకు చెప్పారు. అప్పుడు విచార‌ణ విరామ స‌మ‌యంలో భోజ‌నం ఇవ్వ‌టానికి కూడా అధికారులు ముందుకు రాలేద‌ని ఆరోపించారు. వ‌రుస‌గా రెండు రోజుల‌పాటు ఇదే తీరు కొన‌సాగింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆయ‌న వాద‌న‌పై న్యాయ‌మూర్తి స్పందిస్తూ.. అధికారులు ఆహారం ఇవ్వ‌నిది నిజమే అయితే అది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందని వ్యాఖ్యానించారు.

సుజ‌నా వాద‌న‌ను ఈడీ త‌ర‌ఫు న్యాయ‌వాది తోసిపుచ్చారు. ఈడీ సిబ్బంది ఆహారం అంద‌జేయ‌బోతుంటే సుజ‌నా తిర‌స్క‌రించార‌ని చెప్పారు. ఆయ‌న అర‌టిపండు మాత్రం స్వీక‌రించార‌ని కోర్టుకు వివ‌రించారు. అయితే - సుజ‌నా త‌ర‌పు న్యాయ‌వాది తాము చేసిన ఆరోప‌ణ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. వాటిపై అఫిడ‌విట్ సైతం దాఖ‌లు చేస్తామ‌న్నారు. అందుకు న్యాయ‌మూర్తి అంగీక‌రించారు. సుజ‌నా అఫిడ‌విట్ పై స్పంద‌న తెలియ‌జేయాల‌ని ఈడీ త‌ర‌పు న్యాయ‌వాదికి సూచించారు. అనంత‌రం విచార‌ణ‌ను వాయిదా వేశారు.

Tags:    

Similar News