ఏపీలో సినిమా టికెట్ల వివాదం.. బీజేపీ ఎంపీ సుజ‌నా హాట్ రియాక్ష‌న్‌

Update: 2021-12-25 16:30 GMT
ఏపీలో సినిమా టికెట్ల ధ‌ర‌ల త‌గ్గింపు నిర్ణ‌యంపై స‌ర్వ‌త్రా వివాదాలు కొన‌సాగుతూనే ఉన్నాయి. టికెట్ ధ‌ర‌లు త‌గ్గించ‌డంతో తాము తీవ్రంగా న‌ష్ట‌పోతామ‌ని భావిస్తున్న ధియట‌ర్ల య‌జ‌మానులు.. వాటిని మూసేస్తున్నారు. మ‌రోవైపు.. ప్ర‌భుత్వం థియేటర్ల‌లో త‌నిఖీలు ముమ్మ‌రం చేసింది. దీంతో మ‌రిన్ని మూత‌బ‌డుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో 5 స్ర్కీన్‌లు, భీమవరంలో 7 స్ర్కీన్‌లు, బుట్టాయగూడెం ఒకటి, నల్లజర్లలో ఒక థియేటర్‌లో సినిమాలు ప్రదర్శించకుండా మూసివేశారు. ఫాం-బి రెన్యువల్‌ లేని థియేటర్లలో ప్రదర్శనలు నిలుపుదల చేశారు.

ప్రకాశం జిల్లావ్యాప్తంగా బీ-ఫాం తో పాటు లైసెన్సు రెన్యువల్‌ లేని 28 థియేటర్ల యజమానులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. చిత్తూరు జిల్లా పీలేరులో 4 థియేటర్లుండగా.. మూడింటిని తనిఖీ చేసి రూ.36వేల చొప్పున జరిమానా విధించారు. కాణిపాకంలో 30ఏళ్లుగా నడుస్తున్న వినాయక టాకీస్‌ ఆలయ భూముల్లో ఉందని, రెన్యువల్‌ చేయడం కుదరదని అధికారులు తేల్చడంతో ఆ థియేటర్‌ మూతపడింది. గురువారం మదనపల్లెలోని 7థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. ఫ‌లితంగా ఆయా ధియేట‌ర్ల‌లో సినిమాలు ఆగిపోయాయి.

అదేవిధంగా విశాఖపట్నం జిల్లా దేవరాపల్లిలో మహేశ్వరీ థియేటర్‌ను.. ప్రభుత్వం చెప్పిన రేట్లకే టికెట్లు అమ్మాలని లేకుంటే హాలు సీజ్‌ చేస్తామనడంతో యాజమాన్యం థియేటర్‌ను మూసివేసింది. అలాగే ఎస్‌.రాయవరంలో బాలత్రిపుర సుందరి థియేటర్‌ను కూడా మూసివేశారు. ‘ప్రభుత్వం ఇచ్చిన రేట్ల ప్రకారం థియేటర్‌ను నడపడం మా వల్ల కాదు... కావున తాత్కాలికంగా థియేటర్‌ను మూసివేస్తున్నాం’ అంటూ హాలు ముందు బోర్డు పెట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో 134 థియేటర్లు ఉండగా, 37 గ్రామ పంచాయతీల పరిధిలోని 57 థియేటర్లను మూసివేశారు. దీంతో ఆయా ధియేట‌ర్ల‌లో ప‌నిచేస్తున్న అన్ని ర‌కాల సిబ్బంది రోడ్డున ప‌డిన‌ట్టు అయింది.

ఈ ప‌రిణామాల‌పై బీజేపీ కీల‌క నాయ‌కుడు, రాజ్య‌స‌భ‌స‌భ్యుడు సుజ‌నా చౌద‌రి స్పందించారు. థియేటర్ల విషయంలో ఏపీ ప్రభు త్వం వ్యవహరిస్తున్న తీరు కరెక్ట్ కాదన్నారు. థియేటర్లు మూసివేయడం వల్ల దాని మీద ఆధారపడ్డవారు ఉపాధి కోల్పోతారని అన్నారు. థియేటర్ల యజమానులంతా ఒక్కటై న్యాయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు సుజనా చౌదరి. విశాఖపట్నంలో ప‌ర్య‌టించిన సుజ‌నా చౌద‌రి.. ఏపీ ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తలాతోక లేని పాలన జరుగుతోందని, వచ్చే 30నెలల్లో బీజేపీ సమర్ధత ఏంటో చూపిస్తామ‌ని అన్నారు. మ‌రి ఏ విధంగా ముందుకు సాగుతారో చూడాలి. ఏదేమైనా.. రాజ‌కీయ వివాదాలు ప‌క్క‌న పెట్టినా.. పండ‌గ‌ల సీజ‌న్‌లో థియేట‌ర్లు మూత‌బ‌డ‌డంతో.. నిజంగానే సిబ్బంది ఉపాధి కోల్పోయి.. జీతాలు అంద‌క‌.. కుటుంబాల‌కు కుటుంబాలే రోడ్డున పడే ప్ర‌మాదం ఉంద‌న‌డంలో సందేహం లేదు.


Tags:    

Similar News