ప్యాకేజీపై సుజ‌నా మాట విన్నారా?

Update: 2016-12-20 06:06 GMT
కొద్దికాలం క్రితం వ‌ర‌కు ఏపీకి ప్ర‌త్యేక హోదాపై డెడ్ లైన్లు విధిస్తూ స‌మ‌యంతో స‌హా చెప్పిన  కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఇపుడు త‌న కామెంట్ల‌ను ప్ర‌త్యేక ప్యాకేజీ మీదికి మ‌ల్లించిన‌ట్లున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి చట్టబద్ధతపై కేంద్ర‌ క్యాబినెట్ నోట్‌ ఫైల్ సిద్ధమైందని తెలిపారు. విజయవాడలోని ముఖ్యమంత్రి నివాసంలో సోమవారం ఆయన చంద్రబాబును కలిసి వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ప్యాకేజీకి చట్టబద్ధత త్వరలోనే వస్తుందని సుజనా చౌదరి చెప్పారు. రానున్న క్యాబినెట్ సమావేశంలో ఇందుకు ఆమోదం లభిస్తుందని స్పష్టం చేశారు.

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధుల విడుదలపై ఈ నెల 26న స్పష్టత వస్తుందని సుజ‌నా చౌద‌రి తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన మిగ‌తా హామీల‌ను నెర‌వేర్చే దిశ‌గా త్వ‌ర‌లోనే కేంద్ర మంత్రులు - ప్ర‌ధాన‌మంత్రితో స‌మావేశం కానున్న‌ట్లు సుజ‌నా వివ‌రించారు.  జనవరిలో తిరుపతిలో జరిగే ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ - విశాఖలో నిర్వహించనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సులపై కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించినట్లు కేంద్ర మంత్రి వివరించారు.

ఇదిలాఉండగా...పోలవరం కాంక్రీటు పనులు ఈ నెలాఖరుకు ప్రారంభమవుతాయని రాష్ట్ర జలనవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. పనుల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు - కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి - కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్య నాయుడు - సుజనాచౌదరితో పాటు పదమూడు జిల్లాల రైతులను ఆహ్వానిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చొరవతో పోలవరం పనులు మరింత వేగవంతమయ్యాయని,  డయాఫ్రమ్ వాల్ పనులు జనవరిలో జరగనున్నాయని దేవినేని ఉమా అన్నారు. 48 గేట్ల నిర్మాణ పనులు ప్రాజెక్టు ప్రాంతంలోనే మొదలుకానున్నాయని, వీటి నిర్మాణానికి భిలాయ్ - విశాఖ స్టీలు ప్లాంట్లకు చెందిన 18 వేల టన్నుల స్టీలు వినియోగిస్తున్నామన్నారు. 530 రోజుల్లో 5 కోట్ల 62 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపనులు పూర్తిచేయాలని లక్ష్యంగా నిర్దేశించామన్నారు. ముంపు మండలాల ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటామని, నిర్వాసితులకు పునరావాసం అందిస్తామని  మంత్రి దేవినేని ఉమా అన్నారు. విదేశీ యంత్రాలను వినియోగించి పనులను మరింత వేగవంతం చేసి 2018 నాటకి పోలవరాన్ని పూర్తి చేస్తామన్నారు. పగలూ - రాత్రీ తేడా లేకుండా పోలవరం పనులు జరుగుతున్నాయని మంత్రి దేవినేని వివరించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News