హోదా గ్రాం ఫోన్.. ప్యాకేజీ సెల్ ఫోన్!!

Update: 2016-09-19 07:01 GMT
ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని ఏపీ ప్రజలంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై కారాలూ మిరియాలూ నూరుతుంటే.. తమ భవిష్యత్తు ప్రశ్నార్ధకం అవుతుందని యువత భయపడుతుంటే.. ఏపీ టీడీపీ నేతలు మాత్రం ప్యాకేజీ చాలా గొప్పదని, అప్ డేటెడ్ వెర్షన్ అని.. ప్యాకేజీ అనే పదం చాలా పాతదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్యాకేజీ వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలపై ఇప్పటికీ క్లారిటీ ఇవ్వని నేతలంగా కూడబలుక్కుని మరీ హోదా కంటే ప్యాకేజీ అద్భుతహ అని ప్రసంగిస్తున్నారు. తాజాగా ఈ విషయాలపై సుజనా చౌదరి స్పందించారు.

ఈ సందర్భంగా హోదాను - ప్యాకేజీని పోల్చుతూ సుజన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో గ్రాం ఫోన్లు ఉండేవని - ఆ స్థానంలో ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయని.. గతంలో ఇండియన్ ఎయిర్ లైన్స్ ఉండేదని, ఇప్పుడు ఎయిర్ ఇండియా ఉందని, గతంలో ఉన్న టెలిగ్రాం పోయి ఇప్పుడు ఈ మెయిల్స్ వచ్చాయని చెప్పారు. అంటే.. హోదా పాత చింతకాయ పచ్చడని - ప్యాకేజీ ప్యాకెట్ అప్ డేటెడ్ వెర్షన్ అని చెప్పే ప్రయత్నం చేశారు! ఎన్నికల సమయంలో సంజీవని - కుర్చీలెక్కిన తర్వాత మాత్రం పాతచింతకాయపచ్చడి అయిపోవడం - పాత విషయం అయిపోవడం దారుణమని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ప్రత్యేక హోదా వల్ల ఏపీకి రావాల్సిన వాటి కంటే ఓ రూపాయి ఎక్కువే తెచ్చేలా ప్యాకేజీని తయారు చేసుకున్నామని చెప్పిన సుజన.. ప్యాకేజీ ఫిగర్స్ గురించి తాను ఇప్పుడు చెప్పదల్చుకోలేదని అనడం గమనార్హం. విపక్షాలు వృథాగా మాట్లాడుతున్నాయని, ఏపీ ప్రజలు మాత్రం ప్యాకేజీని పూర్తిగా స్వాగతించారని చెప్పారు. 14వ ఆర్థిక సంఘం సూచనల కారణంగా ప్రత్యేక హోదా రాలేదని అదే అసత్యాన్ని మరోసారి చెప్పే ప్రయత్నం చేశారు సుజనా చౌదరి!
Tags:    

Similar News