సుజ‌నా... ఓట‌మిని ఒప్పేసుకున్నారుగా!

Update: 2017-08-20 05:15 GMT
నంద్యాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌లు ఇప్పుడు విశ్వ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌తి తెలుగోడిలోనూ ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. ప్ర‌స్తుతం హోరాహోరీగా సాగుతున్న ప్ర‌చారంలో అటు అధికార టీడీపీ నేత‌లు - ఇటు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేస్తున్న ప్ర‌చారంపై తెలుగు ప్ర‌జ‌లు అమితాస‌క్తి ప్ర‌ద‌ర్శిస్తున్నారు. అస‌లు నంద్యాల బైపోల్స్‌ లో గెలుపు ఎవరిద‌న్న అంశం ఏ ఇద్ద‌రు క‌లిసినా త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌స్తావ‌న‌కు వ‌స్తోంది. 2019లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సెమీ ఫైన‌ల్స్‌ గా ప‌రిగ‌ణిస్తున్న ఈ ఎన్నిక‌లో గెలుపు ద‌క్కిన వారికి ఇక తిరుగుండ‌ద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదేదో ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న భావ‌న ఎంత‌మాత్రం కాదు... అటు అధికార టీడీపీలోనూ, ఇటు విప‌క్ష వైసీపీలోనే నెల‌కొన్న భావ‌న‌గా రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఇప్ప‌టికే లెక్క‌లేన‌న్ని స‌ర్వేలు వెలువ‌డ‌గా... కొన్ని టీడీపీ గెలుస్తుంద‌ని చెప్ప‌గా, మ‌రికొన్ని వైసీపీదే విజ‌య‌మ‌ని చెప్పేశాయి. తాజాగా నేష‌న‌ల్ మీడియాకు చెందిన ఓ స‌ర్వే సంస్థ జ‌రిపిన స‌ర్వేలో టీడీపీ ఓట‌మి ఖాయ‌మైపోగా.. జ‌గ‌న్ పార్టీ విజ‌య‌ఢంకా మోగిస్తుంద‌ని తేలిపోయింద‌ట‌. ఆయా అంశాల వారీగా సాగిన ఈ స‌ర్వేలో అస‌లు టీడీపీ ఓట‌మికి కార‌ణాలు ఏమిటి?  వైసీపీని విజ‌య‌తీరాల‌కు చేరుస్తున్న అంశాలేమిటి? అన్న విష‌యాల‌ను కూలంక‌షంగా స‌ద‌రు సంస్థ టీడీపీ అధినేత‌గా ఉన్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడి ముందే పెట్టేసింద‌ట‌. దీంతో చంద్ర‌బాబు షాక్ తిన‌డంతో పాటు ఈ స‌ర్వే విష‌యం తెలుసుకున్నతెలుగు త‌మ్ముళ్ల‌లో కూడా నీర‌సం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంద‌ట‌. ఈ మాట నిజ‌మేనంటూ నిన్న టీడీపీ సీనియ‌ర్ నేత‌ - కేంద్ర మంత్రి సుజ‌నా చౌద‌రి చేసిన వ్యాఖ్య‌లు చెప్పేశాయ‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. నిన్న విశాఖ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన సంద‌ర్భంగా అక్క‌డే మీడియాతో మాట్లాడిన సుజ‌నా... అస‌లు నంద్యాల తీర్పు త‌మ పాల‌న‌కు రెఫ‌రెండ‌మే కాద‌ని తేల్చి పారేశారు. నంద్యాల అసెంబ్లీకి జ‌రుగుతున్న ఉప ఎన్నిక చాలా చిన్న‌ద‌ని, అక్క‌డి ప్ర‌జ‌ల తీర్పు త‌మ పాల‌న‌కు రెఫ‌రెండం కాద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

అయితే మ‌రి అంత మంది మంత్రులు, ఎమ్మెల్యేల చేత ఎందుకు ప్ర‌చారం చేయిస్తున్నార‌న్న ప్రశ్న మీడియా నుంచి ఎదుర‌వుతుందేమోన‌న్న భావ‌న‌తో తానే ముందుగా స్పందించిన సుజ‌నా... నంద్యాల ఉప ఎన్నిక చిన్న‌దైనా, పెద్ద‌దైనా గెలుపు కోసం తాము గ‌ట్టిగా పోటీ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. త‌మ పార్టీ గ‌తంలో విప‌క్షంలో ఉన్న స‌మ‌యంలో ఉప ఎన్నిక‌లు జ‌రిగాయ‌ని, వాటిలో కొన్నింటిలో ఓడిపోతే, మ‌రికొన్నింటిలో గెలిచామ‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. అయితే నంద్యాల‌లో అభివృద్ధి అవ‌స‌ర‌మ‌ని భావించిన మీద‌టే అక్క‌డ అభివృద్ధి ప‌నులు ఊపందుకున్నాయ‌ని కూడా ఆయ‌న చెప్పుకొచ్చారు. ఈ సంద‌ర్భంగా ఉప ఎన్నిక‌ల వ‌చ్చినందుకే అక్క‌డ అభివృద్ధి జ‌రుగుతోందా? అన్న మీడియా ప్ర‌శ్న‌కు మాత్రం స‌మాధానం దాట‌వేసిన సుజ‌నా... స‌ద‌రు ప్ర‌శ్న సంధించిన మీడియా ప్ర‌తినిధి వైపు కొర‌కొర‌గా చూశార‌ట‌. వెర‌సి నంద్యాల‌లో త‌మ పార్టీ అభ్య‌ర్థి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి ఓడిపోవ‌డం ఖాయ‌మేన‌ని తెలుసుకున్న మీద‌టే సుజ‌నా ఈ వ్యాఖ్య‌లు చేశార‌న్న వాద‌న వినిపిస్తోంది. 
Tags:    

Similar News