మమతకు మరో మిత్రుడు దొరికినట్లే.. మోడీ బ్యాచ్ పై నిప్పులు

Update: 2021-07-26 04:41 GMT
మిత్రులను చేజార్చుకోవటంలో మోడీ పరివారానికి తెలిసినంత బాగా మరెవరికీ తెలీదేమో. బీజేపీకి మొదట్నించి స్నేహపూర్వకంగా ఉండే రాజకీయ పార్టీల్ని దూరం చేసుకుంటున్న మోడీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో అధికారాన్ని సొంతం చేసుకున్నప్పటికీ.. ప్రభుత్వం నిలవటానికి అవసరమైన రెండు సీట్ల మద్దతు ఇచ్చేందుకుఏ రాజకీయ ముందుకు రాకపోవటాన్ని చాలామంది తప్పుపట్టారు. బీజేపీని ఇంత అంటరానితన పార్టీగా చూస్తారని ఫైర్ అయ్యారు. అలాంటి కష్ట సమయంలోనూ పార్టీకి అండగా నిలిచిన మిత్రుల్ని మోడీ సర్కారు వదులుకోవటం గమనార్హం.

సైద్ధాంతికంగా బీజేపీకి ఏ మాత్రం తీసిపోని శివసేనను చూస్తే.. బీజేపీకి అంతకు మించిన నమ్మకస్తుడైన రాజకీయ పార్టీ మరకొటి కనిపించదు. ఏళ్లకు ఏళ్లుగా బీజేపీతో ఉన్న బంధాన్ని తెగ తెంపులు చేసుకుంది. కారణం.. మిత్రుడితో అధికారం పంచుకోవటానికి కమలనాథులు నో అంటే నో చెప్పటమే కారణం. అధికారాన్ని వదులుకుంటామే తప్పించి.. మిత్రుడి చేతికి పగ్గాలు ఇచ్చేందుకు ససేమిరా అన్న మోడీ బ్యాచ్ మొండితనం మహారాష్ట్రలో అధికారపక్షంగా అవతరించే అవకాశాన్ని మిస్ చేసుకున్నారని చెప్పాలి.

శివసేన దారిన శివసేన చూసుకుంటే.. పంజాబ్ లో శిరోమణి అకాలీదళ్ మొదట్నించి బీజేపీ మిత్రపక్షంగా వ్యవహరిస్తోంది. తాజాగా ఆ పార్టీ కూడా బీజేపీకి దూరం కావటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా ఆ పార్టీ అధినేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ బీజేపీకి వ్యతిరేకంగా పిలుపునిచ్చారు. కమలనాథులకు వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలన్ని ఏకం కావాలన్న అభిలాషను ఆయన వ్యక్తం చేశారు.

ఇప్పటికే.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గెలిచే అవకాశం ఇవ్వకూడదన్న ప్రతిన బూని మరీ ప్రయత్నిస్తున్నారు. ఆట కొనసాగుతుందంటూ ఆమె చేసిన నినాదం మోడీ బ్యాచ్ కు ఇప్పుడు కొత్త టెన్షన్ పుట్టిస్తోంది. ఇలా.. మోడీ వ్యతిరేకులంతా ఇప్పుడు ఒక్కొక్కరు బయటకు వచ్చి.. తమ వాదనను వినిపిస్తున్నారు. రానున్నరోజుల్లో వీరంతా ఒక జట్టు కట్టే వీలుందన్న మాట వినిపిస్తోంది.

ఈ వాదనకు బలం చేకూరేలా తాజాగా శిరోమణి అకాలీదళ్ అధినేత మాటలు ఉండటం గమనార్హం. బీజేపీతో తమ పొత్తు ముగిసిన అధ్యాయంగా పేర్కొన్న ఆయన.. సాగుచట్టాల రద్దు విషయంలో తాము రాజీ పడే అవకాశమే లేదని తేల్చేశారు. సిద్ధాంతపరంగా కూడా పార్టీ వైఖరిలో మార్పు ఉండదని కుండబద్ధలు కొట్టేశారు. శిరోమణి అకాలీదళ్ రైతుల పార్టీ అని స్పష్టం చేసిన ఆయన.. వారి సమస్యల పరిష్కారమే తమ ఎజెండాగా పేర్కొన్నారు.

మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పంజాబ్ లోనూ అమలు కానివ్వమని చెప్పారు. బీఎస్పీతో పొత్తు విషయంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీలో పొత్తు శాశ్వితమైనదని.. బీజేపీతో పొత్తు ముగిసిన అధ్యాయమని తేల్చారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందే అన్ని ప్రాంతీయ పార్టీలు కలిపి కొత్త ఫ్రంట్ ఏర్పాటు అవుతుందన్న ఆశాభావానని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇకపై జాతీయ పార్టీ కాదని.. బీజేపీని ఎదుర్కోవటమే కొత్త ఫ్రంట్ లక్ష్యమని చెప్పేసిన ఆయన.. తన రాజకీయ ప్రత్యర్థి ఎవరన్న విషయాన్ని చెప్పేశారని చెప్పాలి. ఒక్కొక్కరుగా వెళ్లిపోతున్న మిత్రులతో మోడీ బ్యాచ్ అంతకంతకూ బలహీనమవుతుందన్న మాట వినిపిస్తోంది. మరీ.. విషయాన్ని మోడీ గుర్తిస్తున్నారా?
Tags:    

Similar News