నటీమణి..బీజేపీ తరఫునా? ఇండిపెండెంట్ గానా?

Update: 2019-03-15 10:49 GMT
ఏదేమైనా తను మండ్య నుంచి ఎంపీగా పోటీ చేయడం మాత్రం ఖాయమని అంటున్నారట సీనియర్ నటీమణి సుమలత. ఇటీవలే దివంగతుడు అయిన తన భర్తకు రాజకీయ ప్రాబల్యం ఉన్న ప్రాంతంలో ఆమె పోటీ చేయాలని భావిస్తున్నారు. ముందుగా కాంగ్రెస్ పార్టీకే ఆమె తన అభిప్రాయాన్ని తెలియజేసినట్టుగా ఉన్నారు. అయితే సుమలతను ఎంకరేజ్ చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి కనిపించలేదు.

అందుకే ఈ సీటును తాము జేడీఎస్ కు ఇచ్చేసినట్టుగా ప్రకటించేసుకుని కాంగ్రెస్ వాళ్లు చేతులు దులిపేసుకున్నారు. ఇక జేడీఎస్ వాళ్లేమో ఇక్కడ నుంచి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడను పోటీ చేయించాలని డిసైడ్ చేశారు. కాబట్టి సుమలత కోసం త్యాగం చేసే అవకాశం లేదని తేలిపోయింది.

దీంతో సుమలత ఇండిపెండెంట్ గా రంగంలోకి దిగాలని అనుకున్నారు. ఆమెపై ఒక్కసారిగా జేడీఎస్ కు తీవ్రమైన కోపం వచ్చింది. తమ వాడి పోటీకి ఆమె అడ్డంకి అవతుందనే లెక్కతో జేడీఎస్ ఆమెపై విరుచుకుపడింది. ఆ పార్టీ నేతలు సుమలతను ఉద్దేశించి ఇష్టానుసారం మాట్లాడారు. దీంతో జేడీఎస్ విమర్శల పాలైంది.

ఇక ఇదే అదునుగా బీజేపీ కూడా రంగంలోకి దిగింది. మండ్య ప్రాంతంలో బీజేపీకి అంత బలం లేదు. దీంతో ఇప్పుడు సుమలతను తమ పార్టీ ద్వారా పోటీ చేయించాలని కమలనాథులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అంబరీష్ భార్య తమ పార్టీ తరఫున పోటీ చేస్తే.. తమకు పట్టులేని ఆ ప్రాంతంలో పట్టు సంపాదించవచ్చు అనేది కమలనాథుల లెక్క. అందుకే.. ఆమెకు బేషరతుగా మద్దతు ప్రకటించడానికి బీజేపీ రెడీగా ఉంది.

ఈ మేరకు బీజేపీ సీనియర్లు సుమలతతో చర్చల కోసం వెళ్లారు. ఆమె బీజేపీ తరఫున పోటీ చేసినా సరే - స్వతంత్రంగా పోటీ చేసినా సరే.. తాము మద్దతును ఇస్తామని కమలనాథులు ప్రకటిస్తూ ఉన్నారు. అయితే సుమలత ఈ విషయం గురించి ఇంకా ఏమీ తేల్చడం లేదు.

ఈ నెల పద్దెనిమిదో తేదీన ఏ విషయాన్నీ ప్రకటించేది ఉంటుందని సుమలత అంటున్నారట. ఇండిపెండెంట్ గా పోటీ చేయడమా - బీజేపీ టికెట్  మీద బరిలోకి దిగడమా.. అనే అంశాన్ని ఆ రోజున డిసైడ్ చేయబోతోందట సుమలత!
Tags:    

Similar News