వాన కోసం ఆ ఇద్ద‌ర‌మ్మాయిలు ఏం చేశారంటే?

Update: 2017-07-17 06:55 GMT
ప్ర‌కృతి క‌రుణించాల‌ని.. త‌మ క‌ష్టాల్ని తీర్చాలంటూ చిత్ర‌మైన ప‌నులు చేస్తుండ‌టం తెలిసిందే. మిగిలిన రుతువుల్ని ప‌క్క‌న పెడితే వ‌ర్షాకాలంలో మాత్రం వ‌ర్షాలు ప‌డ‌కుండా.. వాన‌ల కోసం జ‌నాలు చేసే ప్ర‌య‌త్నాలు అన్నిఇన్ని కావు. ప్ర‌కృతిని ప్ర‌స‌న్నం చేసుకునేందుకు క‌ప్ప‌ల‌కు పెళ్లిళ్లు చేయ‌టం.. వ‌రుణ యాగాలు చేయ‌టం లాంటి చాలానే చేస్తుంటారు.

తాజాగా శ్రీకృష్ణుడి జ‌న్మ‌స్థాన‌మైన మధుర న‌గ‌రానికి చెందిన ఇద్ద‌రు అమ్మాయిలు(రుక్మిణి.. సుమ‌న్‌) మాత్రం కాస్త భిన్న‌మైన విధానాన్ని ఎంచుకున్నారు. యూపీలో ఈ ఏడాది అనుకున్నంత బాగా వ‌ర్షం కుర‌వ‌లేదు. సాధార‌ణం కంటే త‌క్కువ వ‌ర్ష‌పాతం న‌మోదైంది. దీంతో.. మంచినీటి కొర‌త‌ను కూడా ఎదుర్కొనే దుస్థితి. ఇలాంటి వేళ‌లో మ‌ధుర న‌గ‌రానికి చెందిన ఇద్ద‌రు అమ్మాయిలు గ‌త రెండు రోజులుగా ఉప‌వాసం చేప‌ట్టారు.

వాన కుర‌వాల‌నే త‌మ మొర‌ను వాన‌దేవుడు విని క‌రుణించే వ‌ర‌కూ తాము త‌మ ఉప‌వాసాన్ని కొన‌సాగిస్తామ‌ని చెబుతున్నారు. ఉప‌వాసం చేస్తున్న ఈ ఇద్ద‌రు అమ్మాయిల ఉప‌వాసంతో వ‌రుణ‌దేవుడు క‌రుణిస్తాడ‌న్న ఆశాభావాన్ని అక్క‌డి రైతులు వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం.

గ‌తంలోనూ ఇదే తీరులో ఆ అమ్మాయిలు ఉప‌వాసం చేయ‌టం.. త‌ర్వాత వ‌ర్షం ప‌డింద‌ని చెబుతున్న వారు.. ఈసారి కూడా అలాంటిదే చోటు చేసుకుంటుందంటూ వాన కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు అక్క‌డి రైతులు. అమ్మాయిల ఉప‌వాసం కోసం కాకున్నా.. అక్క‌డి వారి న‌మ్మ‌కం కోస‌మైనా వ‌రుణ‌దేవుడు వాన కురిపించాల్సిందే.
Tags:    

Similar News