వారి వార్నింగ్ తో సీఎం జగన్ కు సమ్మిట్ సంతోషం ఆవిరైనట్లేనా?

Update: 2023-03-06 09:35 GMT
నిజమా.. అబద్ధమా అన్నది పక్కన పెడితే.. విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సక్సెస్ అయ్యిందన్న భావన ప్రజలకు కలిగించే విషయంలో జగన్ ప్రభుత్వం విజయం సాధించిందనే చెప్పాలి. ఆ మాటకు వస్తే.. మొత్తం నాలుగేళ్ల జగన్ పాలనలో పాజిటివ్ గా మారిన ఏకైక అంశంగా సమ్మిట్ మారింది. దీంతో.. వైసీపీ వర్గాలు ఫుల్ జోష్ లో ఉన్నాయి. ఇలాంటి వేళ.. అనూహ్య పరిణామం చోటు చేసుకుంది.

విశాఖ సమ్మిట్ సంతోషం ఆవిరి అయ్యే ప్రకటన ఒకటి ఏపీ ఉద్యోగ సంఘాల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ షాకింగ్ ప్రకటన చేశారు. తమ సమస్యల పరిష్కారంపై తగ్గమని.. రాబోయే రోజుల్లో చావో రేవో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ఏప్రిల్ నుంచి దశల వారీగా ఆందోళన చేస్తామంటూ కీలక ప్రకటన చేశారు.  మరోవైపు ఉద్యోగులను మాఫియా.. స్మగ్లర్లు అని అంటున్నారని..  అయితే వాటికి కమిషనర్లు.. అధికారులు అధినేతలా? అంటూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి అస్కారరావు మండిపడ్డారు. తాజాగా విజయవాడలో నిర్వహించిన సమావేశంలో కీలక నిర్ణయాల్ని వెల్లడించటమే కాదు.. ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పు పట్టారు.

తమలో ఎంతమందిని సస్పెండ్ చేసినా.. ఎన్ని క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా తమను వేరు చేయలేరని.. సంఘటితంగానే ఉంటామన్నారు. ''వాణిజ్య పన్నుల శాఖలో పని చేసే 1500 మందిలో 1300 మంది మాతోనే ఉన్నారు. సమావేశానికి రాని వారిలోనూ 80 శాతం వాటా మాదే. ఇతర సంఘం పట్టుకొని ఏదో అనుకుంటే గొర్రె తోక పట్టుకొని గోదారి ఈదినట్లే'' అంటూ స్పష్టం చేశారు.

విశాఖపట్నం.. విజయవాడ -1 డివిజన్ కార్యాలయాల్లో పని చేసే ఉద్యోగులను క్రమశిక్షణ పేరుతో ఇటీవల సస్పెండ్ చేసిన వైనాన్ని తప్పు పట్టారు. అసోసియేషన్ లో కీలకంగా పని చేసే వారిపై ఇలాంటి చర్యలు తీసుకున్నారని.. ఇందులో భాగమైన నలుగురు అధికారుల విషయంలో మాత్రంపక్షపాతంతో వ్యవహరిస్తున్నారని.. వారిని మాత్రం సస్పెండ్ చేయలేదన్నారు. ఏసీబీ కేసుల్లో పట్టుబడిన వారిని విచారణాధికారిగా నియమించి.. కిందిస్థాయి ఉద్యోగులను సస్పెండ్ చేయటం ఏమిటి? రెగ్యులర్ ఉద్యోగులను సస్పెండ్ చేయాలంటూ కాంట్రాక్టు ఉద్యోగి నివేదిక ఇవ్వటం ఏమిటి? అని ప్రశ్నించారు.

రాష్ట్రపతి ఉత్తర్వులను భిన్నంగా వాణిజ్య పన్నుల శాఖలో గత ఏడాది జరిగినబదిలీలపై చర్యలు తీసుకోవాలని.. అలాంటిది జరగకుంటే ఏకంగా రాష్ట్రపతి.. కేంద్ర హోంశాఖ అధికారులను కలిసి తమ వేదనను పంచుకుంటామన్నారు. నిధుల కేటాయింపులేకుండానే విశాఖలోని వాణిజ్య పన్నుల శాఖ ప్రాంతీయ కార్యాలయ భవనాన్ని కార్పొరేట్ ఆఫీసు లెక్కన రూపొందించారని.. దీనికి మంత్రులు.. ఉన్నతాధికారులు హాజరు కావటం విస్మయానికి గురి చేసే అంశమన్నారు.

ఉద్యోగుల వేతనాల చెల్లింపునకు చట్టబద్ధత కల్పించాలని గవర్నర్ కు వినతిపత్రం అందజేస్తే.. దాన్ని ఫిర్యాదుగా భావించి సంఘం గుర్తింపునకు ఎందుకు రద్దు చేయకూడదని ప్రభుత్వం నోటీసులు ఇవ్వటాన్ని తప్పు పట్టింది. ఉద్యోగ సంఘాల నుంచి వస్తున్న ఘాటు వ్యాఖ్యలు.. విశాఖలో సమ్మిట్ సక్సెస్ ఆనందాన్ని ఎంజాయ్ చేయలేని పరిస్థితిలోకి సీఎం జగన్ ఉన్నారన్న మాట వినిపిస్తోంది. మరేం జరుగుతుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News