టీడీపీకి ముహూర్తం ఫిక్స్‌... అది కూడా పాయే

Update: 2019-07-07 13:37 GMT
సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చి నెల రోజులు కూడా కాకుండానే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు మాంచి రసవత్తరంగా మారుతున్నాయి. నవ్యాంధ్రకు తొలి సీఎంగా ఉన్న చంద్రబాబు ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. ఆయ‌నే కుప్పంలో ఎమ్మెల్యేగా గెలిచేందుకు అష్ట‌క‌ష్టాలు ప‌డ్డారు. టిడిపికి భవిష్యత్తు నాయకుడు ఎవరన్న ప్ర‌శ్నకు ఆ పార్టీ వీరాభిమానుల నుంచే సరైన క్లారిటీ లేదు. దీంతో ఎలాగైనా టిడిపిని పూర్తిగా నేలమట్టం చేసి ఆ ప్లేస్ లోకి వచ్చేందుకు బిజెపి అప్పుడే ఆపరేషన్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆ పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను తమ పార్టీలో చేర్చుకుంది. అదే టైంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ సైతం దూకుడుగా ముందుకు వెళుతుండడంతో... ఇప్పుడు బీజేపి ఈ రెండు పార్టీల‌కు చెక్ పెట్టేలా మరో కొత్త గేమ్ కు తెర లేపుతున్నట్టు తాజా రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. తాజా ఎన్నికల్లో టిడిపి ఆ పార్టీ చరిత్రలోనే అత్యంత హీనంగా 23 సీట్లతో సరిపెట్టుకుంది. అసెంబ్లీలో టిడిపికి ప్రతిపక్ష పాత్ర ఉండాలంటే కనీసం 18 ఇది సీట్లు ఉండాలి.

ఇప్పుడు బిజెపి కొత్త ఆపరేషన్లో భాగంగా టీడీపీ ప్రతిపక్ష హోదాను లాక్కునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే ఆ పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌ చార్జ్ సునీల్ ధేవ‌ద‌ర్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఓ వైపు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఐదేళ్ల పాలనలో జరిగిన పనులపై విచారణకు ఆదేశించారు. ఇందుకోసం టిడిపి ప్రభుత్వంలో జరిగిన కోట్లాది రూపాయల అవినీతి బండారం బట్టబయలు అవుతుందని... అది బయటకు వచ్చిన వెంటనే టిడిపి నేతల్లో చాలామంది జైలుకు వెళ్లక తప్పదని వైసిపి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు.

పార్టీ అధినేత చంద్రబాబు చేసిన అక్రమాలు... అవినీతి బయటకు వస్తే ఆయన సైతం జైలుకు వెళ్లక తప్పదని వైసిపి వాళ్ళు చెబుతున్నారు. చంద్రబాబు స్వయంగా అ జైలుకు వెళితే ఇక టిడిపి పరిస్థితి ఏంట‌న్నది ? ఎవరికీ అంతుపట్టడం లేదు. అందుకే ఆ పార్టీ నేతల్లో చాలామంది ఇది తమ రాజకీయ భవిష్యత్తు కోసం... తమ దారి తాము చూసుకునే పనుల్లో బిజీ అయిపోయార‌ని తెలుస్తుంది. ఈ క్రమంలోనే సునీల్ ధేవ‌ద‌ర్ ఇప్పటికే 18 మంది టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని చేసిన వ్యాఖ్యలు టిడిపి వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.

సునీల్ ధేవ‌ద‌ర్ మాట్లాడుతూ చంద్ర‌బాబు పాల‌న‌లో జ‌రిగిన అక్ర‌మాల‌ను బ‌య‌ట‌కు తీయాల‌ని డిమాండ్ చేశారు. అటు ఏపీ సీఎం జ‌గ‌న్ కూడా మ‌రో ప‌ది రోజుల్లో ఎవ్వ‌రూ ఊహించ‌ని సంచ‌ల‌న నిర్ణ‌యాల‌కు రెడీ అవుతున్నార‌ని... ఇందులో టీడీపీకి షాక్ ఇచ్చే నిర్ణ‌యం కూడా ఉంటుంద‌ని అంటున్నారు. ఏదేమైనా సునీల్ చేసిన వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి 18 ఎమ్మెల్యేలు పార్టీ మారితే చంద్ర‌బాబుకు అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష హోదా కూడా పాయే అవుతుంది.






Tags:    

Similar News