జగన్ పై సునీల్ దేవధర్ సంచలన వ్యాఖ్యలు

Update: 2020-08-29 17:00 GMT
బజ్జీలు...సమోసాలు...గారెలు....ఇలా కొన్ని ఆహార పదార్ధాలు వేడివేడిగా తింటేనే వాటిని తిన్నట్లు ఉంటుంది. అలాగే రాజకీయ నేతలు కూడా వైరి పార్టీలపై విమర్శలకు హాట్ హాట్ గా వెంటవెంటనే కౌంటర్లు ఇస్తేనే బాగుంటుంది. ప్రస్తుతం ఉన్న మీడియా, సోషల్ మీడియా జమానాలో ప్రముఖ రాజకీయ నేతల వ్యాఖ్యలు, కామెంట్లు....ఆయా టాపిక్ లను బట్టి వైరల్ అవుతుంటాయి. కాబట్టి, దాదాపుగా రాజకీయాల్లో ఉన్న వారికి వైరి పార్టీల వారి వ్యాఖ్యలపై ఫోకస్ తప్పకుండా ఉంటుంది. అందులోనూ, ఏపీ రాజకీయాలపై ఇటు సోషల్ మీడియాలోను అటు మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే బీజేపీ నేత సునీల్ దేవధర్ కు ఏపీలోని ప్రముఖ నేతల కామెంట్లు, వైరల్ టాపిక్ లపై తప్పక ఫోకస్ ఉంటుంది. అయితే, వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేత సునీల్ దేవధర్ 40 రోజుల తర్వాత స్పందించడం ఇపుడు ఏపీలో చర్చనీయాంశమైంది. విరసం నేత వరవరరావును విడుదల చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కరుణాకర్ రెడ్డి రాసిన లేఖపై సునీల్ దేవధర్ తాజాగా స్పందించడం ఏపీలోని పలువురు నేతలకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ లేఖ రాసిన కరుణాకర్ రెడ్డిని సీఎం జగన్ ఎందుకు సస్పెండ్ చేయలేదని, సస్పెండ్ చేయలేదు కాబట్టి ఆ లేఖ సీఎం జగన్ అనుమతితో వెళ్లిందనుకోవాలా అంటూ సునీల్ దేవధర్ సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది.

విరసం నేత వరవరరావును విడుదల చేయాలని కోరుతూ వెంకయ్యనాయుడుకు కరుణాకర్‌ రెడ్డి 40 రోజుల క్రితం లేఖ రాశారు. వరవరరావు వయసు రీత్యా, అనారోగ్య కారణాల రీత్యా ఆయనను విడుదల చేయాలని వెంకయ్యను కోరారు. ఆ లేఖపై అప్పుడే కొన్ని విమర్శలు వచ్చి సద్దుమణిగాయి. అయితే, ఆ లేఖపై సునీల్ దేవధర్ తాజాగా 40 రోజుల తర్వాత స్పందించారు. ప్రధానిని హతమార్చాలని కుట్ర పన్ని అరెస్ట్ అయిన వరవరరావును విడుదల చేయమన్న ఎమ్మెల్యేపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ట్విట్టర్ లో సీఎం జగన్ ను సునీల్ దేవధర్ ప్రశ్నించారు. భూమన కరుణాకర్ రెడ్డిని ఇంకా ఎందుకు సస్పెండ్ చేయలేదని, ఈ లేఖ మీ అనుమతితోనే వెళ్ళిందనుకోవాలా? అని వ్యాఖ్యానించారు. తక్షణమే కరుణాకర్ రెడ్డిపై చర్యలు తీసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని సునీల్ ట్వీట్ చేశారు.అయితే, దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మొరిగినట్లు....కరుణాకర్ రెడ్డి లేఖ రాసిన 40 రోజుల తర్వాత సునీల్ దేవధర్ సర్ ప్రైజింగ్ రియాక్షన్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ పై సునీల్ దేవధర్ సంచలన ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. ఎవరైనా ఈ వ్యవహారంపై కేంద్రానికి కంప్లయింట్ ఇవ్వడంతో సునీల్ దేవధర్ ఇలా రియాక్టయ్యారా...అన్న చర్చ ఏపీ రాజకీయ నేతల్లో జరుగుతోంది.సునీల్ దేవధర్ కామెంట్...40 డేస్ లేట్ అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి.
Tags:    

Similar News