250 కోట్లు కాదు...రూపాయి విడుదల కాలేదట

Update: 2016-10-07 07:05 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శించటానికి విపక్ష నేతలు సైతం ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. మిగిలిన ఏ రాజకీయ అధినేతనైనా.. చెడుగుడు ఆడుకునేలా వ్యవహరించే మూడో కన్ను సైతం కాస్త ఒద్దికగా.. పద్ధతిగా వ్యవహ‌రిస్తున్న వేళ.. ప్రైవేటు ఆసుపత్రుల అసోసియేషన్ చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఈ మధ్యన ఆరోగ్యశ్రీ సేవల్ని బంద్ చేస్తూ నిర్ణయం తీసుకోవటం.. ఈ వ్యవహారం మీడియాలో ప్రముఖంగా వచ్చిన నేపథ్యంలో.. ప్రభుత్వ ఉన్నతాధికారులు రంగంలోకి దిగి నష్టనివారణ చర్యలు చేపడుతున్నట్లుగా వ్యాఖ్యలు చేయటం తెలిసిందే. అయితే.. ఎవరెన్ని చెప్పినా.. తాము మాత్రం సేవలు అందించే ప్రసక్తే లేదని చెప్పటమే కాదు.. రూ.250 కోట్లు విడుదల చేసిన మాటలో నిజం లేదని తేల్చటమే కాదు.. గత నెల 30 నుంచి ఈ నెల ఆరో తేదీ వరకూ ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి విడుదల కాలేదంటూ తేల్చిచెబుతున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అంతేకాదు.. ఆరోగ్య శ్రీ సేవలు పునరుద్దరించకపోతే కొరడా ఝుళిపిస్తామంటూ జిల్లాల్లోని కో-ఆర్డినేటర్ తమ ఆసుపత్రుల్లోని సిబ్బందిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని.. భయపెడితే భయపడటానికి తాము ప్రభుత్వ ఉద్యోగులు.. వైద్యులం కాదన్న మాటను చెప్పిన ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు.. ఆరోగ్య శ్రీ ట్రస్టు, ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్య మంత్రిని తప్పు దారి పట్టిస్తున్నారని మండిపడ్డారు.

అప్పుడెప్పుడో 2009లో నిర్ణయించిన ప్యాకేజీ ధరలకే ఇప్పటికీ తాము సేవలు అందిస్తున్నామని.. ఆపరేషన్లు చేస్తున్నామని.. ఇప్పటికైనా ప్యాకేజీని రివైజ్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల ఒకటిన తమను పిలిపించి రూ.100 కోట్లు వేశామని చెప్పారని.. రెండో తేదీన మరో రూ.150 కోట్లు జమ చేస్తామని చెప్పారని కానీ ఇప్పటివరకూ ఒక్క రూపాయి కూడా జమ చేయలేదని చెప్పిన వారు.. ముఖ్యమంత్రి తమతో సమావేశమైతే.. చాలా విషయాలు ఆయన దృష్టికి తీసుకువెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. సీఎంకు తెలీని ఎన్నో విషయాలు తమకు తెలుసని.. ఆయన కానీ తమతో చర్చలు జరిపితే చాలా విషయాలు ఆయనకు చెబుతామని అంటున్నారు. ఘాటుగా మాట్లాడుతూనే.. ముఖ్యమంత్రిపై విమర్శలు చేయకుండా.. ఆరోగ్య శ్రీ ట్రస్టుపై ఫైర్ అవుతున్న ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాల మాటలకు ముఖ్యమంత్రి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News