సీఎంతో సూపర్‌స్టార్ భేటీ... కరోనా నిధికి భారీ విరాళం !

Update: 2021-05-17 11:47 GMT
కరోనా వైరస్ మహమ్మారి తో దేశమంతా అతలాకుతలం అవుతోంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఎంతో మంది జీవితాలు రోడ్డున పడుతున్నాయి.  దేశవ్యాప్తంగా ఎంతోమంది పేదలు నిరాశ్రయులయ్యారు. వారిని ఆదుకునేందుకు ప్రముఖుల నుంచి సెలబ్రిటీల వరకు ముందుకొస్తున్నారు. రాష్ట్రంలో కరోనా బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో విరివిగా విరాళాలు ఇవ్వాలని సీఎం స్టాలిన్ ఇటీవలే బహిరంగ ప్రకటన చేశారు. ఆయన ప్రకటనకు మంచి స్పందనే వస్తోంది. ప్రభుత్వ సహాయ నిధికి విరాళాలు భారీగా పెరుగుతున్నాయి. ఇక తాజాగా తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ తమిళనాడు సీఎం స్టాలిన్‌ ను కలిసి రూ.50 లక్షల విరాళం అందజేశారు.

కాగా, రజనీ కాంత్‌ 35 రోజుల పాటు హైదరాబాద్‌ లో అన్నాతై షూటింగ్‌ ఉండగా , ఇటీవల ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌ నుంచి చెన్నైకి వెళ్లారు.  ఆయన సోమవారం సీఎంని కలిసి ఈ విరాళాన్ని అందజేశారు. కాగా, ఇప్పటికే సూర్య, కార్తీ సోదరులు కోటి రూపాయల విరాళం అందించగా, మురుగదాస్‌ రూ.25 లక్షలు, అజిత్‌ రూ.25 లక్షలు, సౌందర్య రాజనీకాంత్‌ కోటి రూపాయలు, దర్శకుడు వెట్రిమారన్‌ రూ.10 లక్షలు, ఎడిటర్‌ మోహన్‌, ఆయన తనయుడు మోహన్‌రాజా, జయం రవిలు రూ. 10 లక్షలు, తమిళ నటుడు శివ కార్తికేయన్‌ విరాళం కింద పాతిక లక్షలు, శంకర్‌ రూ.10 లక్షల రూపాయలు విరాళంగా అందజేశారు. ప్రముఖ నటుడు విక్రమ్ కూడా తనవంతు విరాళం ప్రకటించారు. ఆన్ లైన్ ద్వారా 30 లక్షల రూపాయలను తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి బదిలీ చేశారు.అంతకుముందు, రజనీకాంత్ అల్లుడు విశాఖన్ వనంగ్ ముడి రూ.1 కోటి విరాళం అందించిన సంగతి తెలిసిందే.

విరాళం అందించిన తర్వాత సూపర్ స్టార్ మాట్లాడుతూ ... రాష్ట్రంలో కరోనా వైరస్ మహమ్మారి పరిస్థితులు విషాదకరంగా, విచారకరంగా ఉన్నాయని, కరోనా వైరస్ కట్టడి, కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులను, విధించిన ఆంక్షలను ప్రజలు సహృదయంతో అర్థం చేసుకోవాలని, కరోనా వైరస్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ ప్రజలంతా ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుతున్నట్లు రజనీ చెప్పారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే పూర్తిగా బీజేపీకి దగ్గరైపోయింది.  

దేశ ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా లాంటి నేతలు ఎవరొచ్చినా తమిళ సినీ పెద్దలంతా వెళ్లి కలవడం, ఎన్నికలకు ముందు శశికళ జైలు నుంచి విడుదలైన సందర్భంలోనూ సినీ ప్రముఖులు కలవడం జరిగింది. అయితే , అదంతా గతం .. తాజా అసెంబ్లీ ఫలితాల్లో డీఎంకే బంపర్ విక్టరీలో అధికారంలోకి రాగా, సినీ రంగంపై స్టాలిన్ మళ్లీ పట్టు సాధించారు.  అయితే , దీనిపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. ఇది కరోనా మహమ్మారి సంక్షోభం కాబట్టి .. రాష్ట్ర ప్రజలని ఆదుకోవడానికి ఇచ్చే విరాళాల సమయంలో వచ్చి సీఎంను కలవడం రాజకీయంగా చూడకూడదు అని కొందరు అంటున్నారు. 
Tags:    

Similar News