ఫేక్ వార్తలపై అత్యుత్తమ న్యాయస్థానం ధర్మాగ్రహం.. అన్ని మత కోణంలో చూస్తారా?

Update: 2021-09-02 13:30 GMT
ఒకప్పుడు వార్త అన్నంతనే దానికో మర్యాద..గౌరవం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. వార్త కంటే కూడా వ్యాఖ్యానంతో వార్తలు ఇవ్వటం ఈ మధ్యన ఎక్కువైంది. ఇది కూడా ఓకే అనుకోవచ్చు. ఎందుకంటే.. వార్తలో విషయం మాత్రమే ఉంటే.. వ్యాఖ్యానంతో తన అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పేస్తుంటారు. ఈ రెండు ప్రయోగాల వరకు ఓకే. కానీ.. గడిచిన కొద్దికాలంలో డిజిటల్ మీడియంలో వస్తున్న వార్తల విషయంలో పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అందునా.. సోషల్ మీడియా.. వెబ్ పోర్టల్స్.. సోషల్ మీడియాకు అవకాశాలు ఎక్కువగా రావటంతో.. ఫేక్ వార్తల హడావుడి అంతకంతకూ ఎక్కువ అవుతోంది.

ఇలాంటి వార్తలపై తాజాగా దేశ అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. నకిలీ వార్తలపై ఆగ్రహాన్ని.. అసహనాన్ని వ్యక్తం చేసింది. కొన్ని మాథ్యమాల్లో ప్రతి విషయాన్ని మతం కోణంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారని.. దీని వల్ల దేశానికి చెడ్డపేరు వస్తుందన్నఆవేదనను వ్యక్తం చేశారు. తబ్లీగి జమాత్ ఎపిసోడ్ పై సుప్రీంలో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

ప్రతి విషయాన్ని మతం కోణంలోనే చూస్తున్నారని.. ఇది దేశానికి చెడ్డపేరు తీసుకురావటంతో పాటు.. వీరిలో ఎలాంటి జవాబుదారీతనం కనిపించటం లేదన్నారు. దేశం మీద దుష్ప్రభావాన్ని చూపిస్తుందని.. ఇలాంటి వాటిపై నియంత్రణ లేదన్నారు. సామాజిక మాథ్యమాలు దేనినైనా ప్రచురించగలవని.. ఎవరైనా యూట్యూబ్ చానల్ ప్రారంభించే వీలుందన్నారు.

ఇలాంటి వాటిపై నియంత్రణ వ్యవస్థ లేకపోవటంతో వ్యక్తుల పరువుకు నష్టం వాటిల్లుతోందన్నారు. వ్యవస్థలు.. న్యాయ మూర్తులను కూడా చెడుగా చూపిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికలు సామాన్యులకే కాదు.. న్యాయమూర్తులకు కూడా స్పందించటం లేదన్న ఆయన.. ఈ పరిణామాల్ని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు. ఐటీ నిబంధనలపై హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేస్తున్నట్లుగా ధర్మాసనం పేర్కొంది. వీటిపై ఆరు వారాల్లో విచారణ చేపట్టనున్నట్లుగా పేర్కొన్నారు. సుప్రీం ధర్మాసనం చేసిన తాజా వ్యాఖ్యల్ని చూస్తే.. దేశ అత్యున్నత న్యాయస్థానం ఫేక్ వార్తల విషయంలో సీరియస్ గా ఉందన్న విషయం తాజాగా చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. ఇట్టే అర్థమైపోతుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News