'పెగ‌స‌స్ స్పైవేర్‌' నిజ‌మే.. కానీ.. సుప్రీం వ్యాఖ్య‌లు

Update: 2022-08-25 11:30 GMT
పెగసస్ స్పైవేర్ గత ఏడాది దేశ రాజకీయాలను కుదిపేసింది. దీనిపై వాస్తవాలను వెలికితీసేందుకు సుప్రీంకోర్టు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ కమిటీ రిపోర్టు ఇచ్చింది. దీనిని నేరుగా సుప్రీం కోర్టుకే అంద‌జేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఇప్పటివరకు 29 ఫోన్లను పరిశీలించగా.. ఐదింటిలో ఒక మాల్‌వేర్‌ ఉందని గుర్తించినట్లు చెప్పారు. కానీ, అది పెగసస్ స్పైవేర్ అనే కచ్చితమైన రుజువు లభించలేదని ప్రధాన న్యాయమూర్తి వెల్లడించారు.

అయితే..  ఈ కేసు విచార‌ణ‌కు సంబంధించి నియ‌మించిన క‌మిటీకి కేంద్ర ప్రభుత్వం సహకరించడం లేదని కమిటీ తెలిపినట్లు న్యాయ‌మూర్తి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇలా అయితే.. ఎలా? అని ప్ర‌శ్నించారు.

కీల‌క విష‌యాల్లో.. న్యాయ‌స్థానానికి స‌హ‌క‌రించాల‌న్న రాజ్యాంగ‌స్ఫూర్తిని మ‌రిచిపోతున్నారా? అని ప్ర‌శ్నించారు. ఇది ఒక దురదృష్ట‌క‌ర ప‌రిణామం.. అని సీజేఐ వ్యాఖ్యానించారు. ఇలా అయితే.. ప్ర‌జ‌ల‌కు వాస్త‌వాలు తెలిసేది ఎలా..? అని అన్నారు.

కేసు ఏంటంటే..

ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్‌ రూపొందించిన ఈ స్పైవేర్‌ను కొన్ని దేశాలు వినియోగించుకొని.. రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు, మానవ హక్కుల కార్యకర్తలపై నిఘా పెట్టినట్లు గతేడాది జులైలో అంతర్జాతీయ మీడియాలో కథనాలు రావడం తీవ్ర దుమారానికి దారితీసింది.

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ సహా పలువురు రాజకీయ నాయకులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సహా దేశంలోని దాదాపు 300 మంది ఫోన్లను పెగసస్‌తో హ్యాక్‌ చేసినట్లు అప్పట్లో 'ది వైర్‌' కథనం వెల్లడించింది.

ఇది తీవ్ర వివాదం రేపడంతో పాటు పార్లమెంట్‌ను కూడా కుదిపేసిన విషయం తెలిసిందే. దీనిపై సమాధానం ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. అయితే, ఈ ఆరోపణలను కేంద్రం ఎప్పటికప్పుడు తోసిపుచ్చింది. ఆ వార్తలు నిజం కాదని తెలిపింది. ఈ వివాదం సుప్రీంకోర్టుకు చేరగా.. పెగాసస్‌ను వినియోగించారా? లేదా? అన్నదానిపై విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో ఒక స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసింది.  ఈ క‌మిటీ నివేదిక తాజాగా సుప్రీం కోర్టుకు చేరింది.
Tags:    

Similar News