స్వ‌లింగ సంప‌ర్కంపై సుప్రీంలో ఆస‌క్తిక‌ర వాద‌న‌!

Update: 2018-07-18 04:11 GMT
స్వ‌లింగ సంప‌ర్కంపై గ‌తంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రివ్యూ చేసే ప‌నిని దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం చేప‌ట్టిన సంగ‌తి తెలిసిందే. స్వ‌లింగ సంప‌ర్కాన్ని నేరంగా ప‌రిగ‌ణించే ఐపీసీ సెక్ష‌న్ 377 రాజ్యాంగబ‌ద్ధ‌త‌ను స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ల‌పై తీర్పును సుప్రీం వాయిదా వేసింది.

సెక్ష‌న్ 377ప్ర‌కారం అస‌హ‌జ‌మైన శృంగారం అది పురుషుడు పురుషుడితో కానీ.. స్త్రీ మ‌రో స్త్రీతో కానీ.. జంతువుల‌తో కానీ ప్ర‌కృతి విరుద్ధంగా జ‌రిగే లైంగిక సంప‌ర్కంలో పాల్గొన‌టం నేరం. దీనికి పాల్ప‌డిన వారికి యావ‌జ్జీవ కారాగార శిక్ష‌తో పాటు జ‌రిమానాను విధించొచ్చు. స్వ‌లింగ సంప‌ర్కంపై గ‌తంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టి వేసింది.

ఈ నేప‌థ్యంలో ఈ అంశంపై మ‌రోసారి విచారించాలంటూ కొంద‌రు దాఖ‌లు చేసిన పిటిష‌న్ పై సానుకూలంగా స్పందించిన సుప్రీం.. ఐదుగురు న్యాయ‌మూర్తుల‌తో కూడిన ధ‌ర్మాస‌నాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి దీప‌క్ మిశ్రాతో పాటు.. మ‌రో న‌లుగురు జ‌డ్జిలు (జ‌స్టిస్ చంద్ర‌చూడ్‌.. నారిమ‌న్.. ఖ‌న్విల్క‌ర్.. ఇందు మ‌ల్హోత్రాలు) ఉన్నారు.

గ‌డిచిన నాలుగు రోజులుగా ఈ అంశంపై రెండు వ‌ర్గాల వాద‌న‌లు విన్న సుప్రీంకోర్టు తాజాగా కొన్ని వ్యాఖ్య‌లు చేసింది. విచార‌ణ స‌మ‌యంలో సుప్రీం న్యాయ‌మూర్తులు చేసిన వాద‌న‌లు ఆస‌క్తిక‌రంగా మారాయి. వారు చేసిన వాద‌న‌ల్నిచూస్తే...

+  స్వ‌లింగ సంప‌ర్క సంబంధాల‌ను బ‌హిరంగంగా ఆమోదించ‌టం ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌టానికి స‌హ‌క‌రిస్తుంది. హెచ్ ఐవీ విస్త‌ర‌ణ‌ను నియంత్రించొచ్చు. ఆ సంబంధాల్ని నిరాక‌రిస్తే.. వారికి వైద్య చికిత్స అందుబాటులో ఉండ‌దు. అప్పుడు లైంగికంగా సోకే వ్యాధులు విస్త‌రించే వీలుంది. అన్నింటిని అణిచివేయ‌టం స‌రికాదు.

+ నిషేధం ద్వారా సామాజిక స‌మ‌స్య‌లు ఎన్న‌టికి ప‌రిష్కారం కావు.

+ స్వ‌లింగ సంప‌ర్కంతో హెచ్ ఐవీ సోకుతుంద‌న్న వాద‌న‌కు ప్ర‌తిగా జ‌స్టిస్ ఇందు మ‌ల్హోత్రా స్పందిస్తూ.. స్త్రీ పురుషులు సంభోగిస్తే హెచ్ ఐవీ సోక‌దా? అని ప్ర‌శ్నించారు.  అర‌క్షిత సంభోగం ఒక గ్రామీణ యువ‌తికి వ‌ల‌స కూలీగా ప‌ని చేసే త‌న భ‌ర్త ద్వారా వ్యాధులు సోక‌వ‌చ్చు. ఇలా జ‌రిగింది క‌దా అని.. సంభోగాన్నే నేరంగా ప‌రిగ‌ణించాల‌ని మీరు అంటున్నారా?

+  సెక్ష‌న్ 377 ప్ర‌కారం.. స‌మ్మ‌తితో కానీ.. లేకుండా కానీ భౌతిక వాంఛ నేరం. ఇది ప్ర‌కృతి విరుద్ధ‌మ‌ని చ‌ర్చిల త‌ర‌ఫున వాదిస్తున్న న్యాయ‌వాది వ్యాఖ్య‌ల‌పై స్పందించిన జ‌స్టిస్ చంద్ర‌చూడ్‌.. మీ ఉద్దేశంలో ప్రాకృతిక స్వ‌భావం ఏమిటి?  సెక్స్ అంటే మీ దృష్టిలో కేవ‌లం పిల్ల‌ల్ని క‌న‌డానికేనా?


Tags:    

Similar News