రోజా సస్పెన్షన్ పై సాగదీత వద్దన్న సుప్రీం

Update: 2016-04-22 10:02 GMT
వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ పై సుప్రీం కోర్టు రెండు వర్గాలకూ చురకలు వేసింది. అసెంబ్లీ నిర్ణయమే ఫైనల్ అని చెబుతూనే రెండు వర్గాలు కూడా తగ్గాలన్నట్లుగా సూచనలు చేసింది. రోజా ఇచ్చిన వివరణ లేఖను అసెంబ్లీ కార్యదర్శికి ఇవ్వాలని సూచిస్తూ, పిటిషన్ ఉపసంహరించుకోవాలని రోజాకు సూచించింది. అదే సమయంలో వివరణ ఇచ్చేందుకు రోజాను అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించాలని ఆదేశించింది.

రోజాను అసెంబ్లీలోని వైకాపా కార్యాలయానికి అనుమతించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతకుముందు తమ క్లయింట్ రోజా, స్పీకర్ ను ఉద్దేశించి క్షమాపణ లేఖ రాశారని చెబుతూ, న్యాయవాది ఇందిరా జైసింగ్ లేఖ ప్రతిని న్యాయమూర్తికి అందించారు. ఇదే లేఖను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని స్పీకరుకు సూచించిన న్యాయస్థానం, ఈ సమస్యను మరింతగా లాగవద్దని కోరింది. కేసు తదుపరి విచారణను ఆగస్టు మొదటి వారానికి వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది.

కాగా తాను ఉద్దేశ పూర్వకంగా ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదని వైకాపా ఎమ్మెల్యే రోజా స్పీకర్ కోడెల శివప్రసాద్ కు రాసిన లేఖలో వ్యాఖ్యానించారు. లేఖ కాపీని సుప్రీంకోర్టుకు అందజేశారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకుంటున్నానని ఆ లేఖలో రోజా పేర్కొన్నారు. అంతకుముందు జరిగిన వాద ప్రతివాదనల్లో తనను రెచ్చగొట్టారని, వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు చేశారని తెలిపారు. అందువల్లే తాను బాధ, కోపంతో మాట్లాడానని తెలిపారు. కావాలని తాను ఏ ప్రజా ప్రతినిధినీ ఉద్దేశించి వ్యాఖ్యానించలేదని చెప్పుకొచ్చారు. ఇదే లేఖను స్పీకర్ కార్యాలయానికి పంపించినట్టు వెల్లడించారు.
Tags:    

Similar News