చిద్దూ భాయ్‌ కి అంతా బ్యాడ్ టైమే!

Update: 2017-08-18 11:27 GMT
కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మాజీ మంత్రి చిదంబ‌రం కుమారుడు కార్తీ చిదంబ‌రానికి క‌ష్టాలు త‌ప్పేల లేవా?  ఎన్ని సార్లు త‌ప్పించుకోవాల‌ని చూసినా.. సీబీఐ ఎదుట హాజ‌రు  నుంచి త‌ప్పించుకోలేక పోతున్నారా? అవినీతి - ఫెరా ఉల్లంఘ‌న‌ల విష‌యంలో ప్ర‌భుత్వం వేధిస్తోంద‌ని చెబుతున్న వీరి మాట‌ల‌ను ఎవ‌రూ న‌మ్మ‌డం లేదా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది.. తాజా సుప్రీం కోర్టు తీర్పుతో! విష‌యం ఏంటో చూద్దాం.. చిదంబ‌రం కుమారుడు కార్తి.. ప‌లు అవినీతి - మ‌నీ లాండ‌రింగ్‌ - ఫెరా ఉల్లంఘ‌న‌లు వంటి కేసుల్లో చిక్కుకున్నారు.

దీంతో సీబీఐ కేసు న‌మోదు చేసి.. ప‌లు మార్లు ఆయ‌న‌ను స్వ‌యంగా విచారించాని ప్ర‌య‌త్నించింది. అయితే, దీనికి రాజ‌కీయ రంగు పూశారు కార్తి. తన తండ్రి - కాంగ్రెస్‌ నేత చిదంబరంను టార్గెట్‌ చేసిన ప్రభుత్వం కేసుల పేరుతో తనను వేధింపులకు గురిచేస్తున్నార‌ని,తాము ఎంతో నిజాయితీ ప‌రుల‌మ‌ని ఆయ‌న మీడియాకు కూడా వెల్ల‌డించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఏదో ఒక వంక చూపుతూ.. విచార‌ణ‌కు డుమ్మా కొడుతూ వ‌స్తున్నారు. అయితే, దీనిపై సీబీఐ సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసింది. ఈ సంద‌ర్భంగా కార్తి త‌ర‌ఫున వాదించిన సీనియ‌ర్ లాయ‌ర్‌.. సుప్రీం కోర్టులో మాట్లాడుతూ..  ప్రముఖ రాజకీయ నేతలను టార్గెట్‌ చేయడం ఫ్యాషన్‌గా మారిందని కార్తీ న్యాయవాది గోపాల్‌ సుబ్రమణియన్‌ వాదించారు.  

ఈ క్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేఎస్‌ ఖేహార్‌ - జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ లతో​ కూడిన సుప్రీం బెంచ్‌ జోక్యం చేసుకుని.. ‘మీరు చాలా మంచివారు కాబట్టి మీరు సీబీఐ ఎదుట హాజరుకానని చెప్పదలుచుకున్నారా’ అని కార్తీ చిదంబరాన్ని ప్రశ్నించింది. సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు తాను భయపడటం లేదని..అయితే తనకు భద్రత కావాలని కార్తీ చిదంబరం ఈ సందర్భంగా కోర్టును కోరారు. న్యాయవాదితో కలిసి సీబీఐ ఎదుట హాజరయ్యేందుకు కోర్టు అనుమతించింది. అయితే విచారణ సమయంలో న్యాయవాది దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. ఈనెల 23న సీబీఐ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో కార్తికి క‌ష్టాలు త‌ప్పేలా లేవ‌ని అంటున్నారు ఆయ‌న స‌న్నిహితులు.
Tags:    

Similar News