ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రసారం కావాలంతే

Update: 2015-11-04 04:08 GMT
తెలంగాణ సర్కారుకు మరో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. దాదాపుగా 500రోజులకు పైనే తెలంగాణ వ్యాప్తంగా అప్రకటిత నిషేధం అమలు అవుతున్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రసారాలు వెనువెంటనే ప్రసారం కావాలంటూ సుప్రీంకోర్టు బెంచ్ తీర్పునిచ్చింది. ఈ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ సర్కారుపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వెనువెంటనే ప్రసారాలు పునరుద్దరించాలని.. ఈ తీర్పుపై ఎలాంటి అప్పీలు లేవని స్పష్టం చేస్తూ త్రిసభ్య ధర్మాసనం విస్పష్ట తీర్పు ఇవ్వటంతో పాటు.. కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తూ తీర్పునిచ్చారు.

ఈ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ న్యాయవాదికి జస్టిస్ మదన్ బీ లోకూర్ ప్రశ్నిస్తూ.. ‘‘ఛానల్ ప్రసారాలను నిలిపివేయాలని స్వయంగా మీ ముఖ్యమంత్రే అసెంబ్లీ వేదికగా చెప్పారు. మీ ప్రభుత్వం ఎంఎస్ వో లపై ఒత్తిడి తెస్తోంది. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి’’ అంటూ ప్రశ్నించటం గమనార్హం. దీనికి బదులిచ్చిన తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది ఉదయ్ కుమార్ తన వాదనలు వినిపిస్తూ.. ఎంఎస్ వోలకు.. ఏబీఎన్ లకు మధ్య గొడవగా తాము చూస్తున్నామని.. ఏబీఎన్ ప్రసారాల పునరుద్దరణపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదని కోర్టుకు చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఏబీఎన్ న్యాయవాది గంగూలీ కల్పించుకొని.. నాటి కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ రాసిన లేఖపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరం లేనప్పుడు ఏబీఎన్ ప్రసారాలు పునరుద్దరించేందుకు చర్యలు తీసుకోవాలంటూ నాటి కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ రాసిన లేఖపై ఎందుకు చర్యలు తీసుకోలేదన్న విషయాన్ని ధర్మాసనం ముందుకు తీసుకెళ్లారు.

హోరాహోరీగా సాగిన వాద ప్రతివాదనలు విన్న త్రిసభ్య ధర్మాసనం.. చివరకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రసారాలు తెలంగాణ రాష్ట్రంలో వెనువెంటనే పునరుద్దరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇక.. ఈ తీర్పుపై ఎలాంటి అప్పీలు ఉండకుండా తన తీర్పులో పేర్కొన్నట్లుగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి న్యాయవాది జి ప్రభాకర్ వెల్లడించారు.  తాజా తీర్పు.. తెలంగాణ సర్కారుకు ఇబ్బందిగా మారుతుందనటంలో సందేహం లేదన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపించటం గమనార్హం.
Tags:    

Similar News