‘అమ్మ’కు సుప్రీం నుంచి మరో షాక్ తగిలినట్లేనా?

Update: 2016-08-27 04:29 GMT
తనకు నచ్చని వారి అంతు చూసే వరకూ నిద్రపోని తత్వం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితలో కనిపిస్తుందని చెబుతుంటారు. ఆమె కానీ ఒక్కసారి డిసైడ్ అయితే.. వారికిక హర్రర్ సినిమా షురూ అయినట్లేనన్న మాట వినిపిస్తుంటుంది. అమ్మ అభిమానం పొందే వరకే ఓకే కానీ.. ఆమె ఆగ్రహం అన్నది మొదలైతే తట్టుకోవటం చాలా కష్టం. అదెలా ఉంటుందన్న విషయాన్ని చూస్తే.. అమ్మ అభిమానంతో చోటా నాయకురాలి స్థాయి నుంచి రాజ్యసభ సభ్యురాలి స్థాయికి ఎదిగిన అమ్మ మాజీ భక్తురాలు శశికళ పుష్పా ఉదంతాన్ని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. డీఎంకే రాజ్యసభ సభ్యుడితో ఆమె స్నేహంగా ఉండటం.. వారి మధ్య చోటు చేసుకున్న వ్యక్తిగత రచ్చపై అమ్మ ఆగ్రహం కట్టలు తెంచుకోవటం.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని అమ్మ ఆదేశించటం తెలిసిందే.

అమ్మ ఆగ్రహం షురూ అయితే ఒక పట్టాన తగ్గదని.. ఉన్న రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకుంటే కష్టమని భావించారేమో కానీ శశికళ పుష్ప అమ్మతో పేచీ పడటానికి సిద్ధమయ్యారు. నిజానికి అలాంటి నిర్ణయం తీసుకోవటానికే చాలా ధైర్యం కావాలి. కొమ్ములు తిరిగిన మగాళ్లు సైతం అమ్మంటే వణికిపోయే వేళ.. శశికళ లాంటి వారు తల ఎగరేయటం చిన్న విషయం కాదు. అందుకే కాబోలు.. ఆమెపైన రకరకాల కేసులు తమిళనాడులో ఇప్పుడు నమోదవుతున్నాయి.  వీటిని ధైర్యంగా ఎదుర్కోవాలన్న మొండి ధైర్యంతో ఉన్న శశికళ.. ఢిల్లీని వదిలి వెళ్లని పరిస్థితి.

ఇదిలా ఉంటే.. ఆమెపై మదురై హైకోర్టులో ఒక కేసు నమోదైంది. ఆమె భర్త.. కొడుకు ఇద్దరు తమిళనాడులోని తమ ఇంట్లో పని చేసే యువతుల్ని అత్యాచార యత్నానికి పాల్పడ్డారన్న ఫిర్యాదు పోలీసులకు అందింది. అంతే.. యమా స్పీడ్ గా రియాక్ట్ అయిన పోలీసులు ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లటం.. శశికళ ఆమె కుటుంబీకుల్ని మధురై కోర్టుకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

తాను కానీ తన కుటుంబ సభ్యులు కానీ తమిళనాడులో అడుగు పెడితే జరిగేదేమిటో తెలిసిన శశికళ పుష్ప.. ఈ వ్యవహారాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ ఉదంతంపై విచారణ జరిపిన సుప్రీం కోర్టులో శశికళ తరఫు న్యాయవాదులు వాదిస్తూ.. మధురై వెళితే శశికళ కుటుంబీకుల్ని అరెస్ట్ చేసే ప్రమాదం ఉందని.. ఇదంతా రాజకీయ దురుద్దేశంతో అక్కడి పోలీసులు నమోదు చేసిన కేసుగా అభివర్ణించారు. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు స్పందిస్తూ.. రాజ్యసభ సభ్యురాలిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న శశికళ పుష్పపై నమోదైన కేసు దర్యాప్తు కోసం తమిళనాడు పోలీసులు ఎందుకంత తొందరపడుతున్నారో అర్థం కావటం లేదని వ్యాఖ్యానించింది.

శశికళను అరెస్ట్ చేయకుండా ఆరు వారాలు స్టే విధిస్తున్నట్లు చెప్పిన కోర్టు.. పనిలో పనిగా శశికళను మధురై హైకోర్టు డివిజన్ బెంచ్ ఎదుట హాజరు కావాలని.. ముందస్తు బెయిల్ అక్కడ నుంచి పొందాలంటూ సూచించింది. తాజాపరిణామాల నేపథ్యంలో అమ్మకు ఒకప్పటి విధేయురాలు మధురైకి వెళ్లాల్సి ఉంటుందన్నమాట. సుప్రీం తాజాగా చేసిన వ్యాఖ్య తమిళనాడు ముఖ్యమంత్రికి తగలాల్సిన చోట తగులుతుందని.. అమ్మ దాసులుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వాధికారుల దూకుడుకు సుప్రీం తన వ్యాఖ్యలతో కళ్లెం వేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News