ధర్మసందేహం?; కశ్మీరులో మైనార్టీలు ఎవరు?

Update: 2016-07-13 04:37 GMT
కశ్మీర్ గురించి పాఠాలు చదువుకునే చిన్న పిల్లాడి నుంచి.. దేశ నైసర్గిక స్వరూపం.. జనాభా.. రాజకీయాల గురించి ఒక మోస్తరు అవగాహన ఉన్న వారు ఎవరైనా ఇట్టే సమాధానం చెప్పేసే అంశానికి సంబంధించి దేశ అత్యున్నత న్యాయస్థానం అధికారికంగా అడిగిన వివరాలు ఆసక్తికరంగా మారాయి. సుప్రీంకోర్టు దృష్టికి తాజాగా ఒక పిటీషన్ వచ్చింది. మైనార్టీలకు అందాల్సిన పథకాలు మెజార్టీలు అయిన ముస్లింలు అక్రమంగా వినియోగించుకుంటున్నారంటూ పిటీషన్ పెట్టారు.

ఈ పిటీషన్ మీద విచారణను చేపట్టిన సుప్రీం కోర్టు తాజాగా కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని ప్రశ్నల్ని సంధించింది. కశ్మీరులో మెజార్టీలు ఎవరు? మైనార్టీలు ఎవరు? అన్న ప్రశ్నలతో పాటు.. రాష్ట్రంలో మైనార్టీలు ఎవరన్న విషయాన్ని తేల్చేందుకు రాష్ట్ర మైనార్టీ కమిషన్ ను ఏర్పాటు చేయాలని కోరింది. ఇందుకోసం నాలుగు వారాల గడువును ఇచ్చింది. అదే సమయంలో.. మైనార్టీలు ఎవరన్న విషయాలు తేలేంత వరకూ వారి పేరిట అమలు చేస్తున్న పథకాల్ని నిలిపివేయాలంటూ కోరిన వినతిని త్రోసిపుచ్చింది. ముస్లింలు అత్యధికంగా ఉండే కశ్మీరులో మెజార్టీలు.. మైనార్టీలు ఎవరన్నది తేల్చేందుకు సైతం నాలుగు వారాల సమయం అవసరం అవుతుందా? అయినా.. దేశ జనాభా గణన లెక్కలు సరిపోవా..? అన్న సందేహాలు ఈ ఉదంతం గురించి విన్న వారికి కలిగే పరిస్థితి.
Tags:    

Similar News