ఆధార్ లింకేజీపై సుప్రీం స్వీట్ న్యూస్!

Update: 2018-03-14 05:33 GMT
మార్చి 31 ముంచుకొచ్చేస్తోంది. మ‌రి.. ఆధార్ ను లింక్ చేసుకున్నావా?   లేదా? అన్న మాట ఇప్పుడు అంద‌రి నోటా వినిపిస్తోంది. ఆధార్ లింక్ పై సామాన్యుడికి ఉన్న బోలెడ‌న్ని సందేహాలు తీర‌ని వేళ‌.. ఆధార్ తో లింకు చేసుకోవ‌ట‌మా?  వ‌ద్దా? అన్న సందిగ్థంలో ఉన్న వారికి సుప్రీంకోర్టు తాజాగా సాంత్వ‌న క‌లిగే ఆదేశాలు జారీ చేసింది.

బ్యాంక్.. మొబైల్‌.. ఇలా ఆధార్ తో లింక్ చేసుకునే వేటికీ మార్చి 31 గ‌డువు కానే కాద‌ని తేల్చింది. అంతేనా.. మ‌ళ్లీ తాము గ‌డువు చెప్పే వ‌ర‌కూ నిర‌వ‌ధింకంగా గ‌డువును పొడిగించిన‌ట్లుగా పేర్కొంది. అంటే.. ఆధార్ ను వాటితో.. వీటితో లింక్ చేసేందుకు హ‌డావుడి ప‌డాల్సిన అవ‌స‌ర‌మే లేద‌ని స్ప‌ష్టం చేసింది.

సుప్రీం ఆదేశాల నేప‌థ్యంలో మార్చి 31 నాటికి ఆధార్  తో లింకు చేసుకోవాల‌న్న డెడ్ లైన్ ఇక లేన‌ట్లే. ఆధార్ తో లింకు చేసుకోవాల‌న్న అంశంపై రాజ్యాంగ బ‌ద్ధ‌త‌ను స‌వాల్ చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ల‌పై తీర్పు చెప్పే వ‌ర‌కూ ఎలాంటి గ‌డువు ఉండ‌ద‌ని.. తాము తీర్పు చెప్పిన త‌ర్వాతే లింకు పెట్టుకోవ‌టానికి గ‌డువు నిర్దేశించాలంటూ సుప్రీంకోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది.

అయితే.. ఇందుకు మ‌రో కండీష‌న్ ను పెట్టింది. ఒక‌వేళ స‌బ్సిడీలు.. ఆధార్ చ‌ట్టంలోని సెక్ష‌న్ 7 కింద అందే ప్ర‌యోజ‌నాల్ని పొందాల‌నుకుంటే మాత్రం మార్చి 31 లోపు ఆధార్ ను లింకు చేసుకోవాల‌ని పేర్కొంది. సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధ‌ర్మాస‌నం ఆధార్ పై కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

అంతేకాదు.. త‌త్కాల్ పాస్ పోర్టు జారీ చేయ‌టానికి  ఆధార్ త‌ప్ప‌నిస‌రి అని ప్ర‌భుత్వం ఒత్తిడి చేయ‌లేద‌ని సుప్రీం స్ప‌ష్టం చేసింది. చివ‌రి నిమిషంలో గ‌డువు పొడిగించ‌టం వ‌ల్ల బ్యాంకులు త‌దిత‌రాల‌పై ప్ర‌భావం ప‌డి గంద‌ర‌గోళానికి గుర‌య్యే ప్ర‌మాదం త‌ప్పిన‌ట్లు అవుతుంది.

సుప్రీం తాజా ఆదేశాల నేప‌థ్యంలో మార్చి 31 లోపు మీ ఆధార్ ను లింక్ చేసుకోక‌పోతే.. బ్యాంకింగ్‌.. మొబైల్‌.. క్రెడిట్ కార్డు సేవ‌లు నిలిచిపోతాయంటూ నిత్యం వ‌చ్చే మెసేజ్ ల గురించి భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేన‌ట్లే. గుర్తుంచుకోవాల్సిన కీలక అంశం ఏమిటంటే.. ఆధార్ తో లింకు చేసుకోవ‌టానికి మార్చి 31 తుది గ‌డువు ఎంత‌మాత్రం కాదు. అంతేనా.. గ‌డువు అన్న‌ది ఏమీ లేద‌న్న విష‌యాన్ని సుప్రీం స్ప‌ష్టం చేసింది. అయితే.. ఇదంతా ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి రాయితీలు.. సంక్షేమ ప‌థ‌కాల ల‌బ్ధి పొంద‌ని వారికి మాత్ర‌మే. ప్ర‌భుత్వం నుంచి రాయితీలు.. ప్ర‌యోజ‌నాలు పొందాల‌నుకునే వారు మాత్రం మార్చి 31లోపు ఆధార్ తో లింకు చేసుకోవాల్సిందే.
Tags:    

Similar News