నారా లోకేశ్ ఎంట్రీ ముహూర్తం బాబుకు దెబ్బేసిందే!

Update: 2017-03-06 09:10 GMT
నిజ‌మే... టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్ నేటి ఉద‌యం చ‌ట్ట‌స‌భ‌లోకి అడుగుపెట్టే ఘ‌ట్టానికి సంబంధించి కీల‌కంగా ప‌రిగ‌ణిస్తున్న ఎమ్మెల్సీ నామినేష‌న్ దాఖలు చేశారు. స‌రిగ్గా 11 గంట‌ల స‌మ‌యంలో కృష్ణా క‌ర‌క‌ట్ట‌ల‌పై ఉన్న త‌న నివాసం నుంచి భారీ అనుచ‌ర గ‌ణంతో వెల‌గ‌పూడిలోని తాత్కాలిక అసెంబ్లీకి వ‌చ్చిన లోకేశ్.. త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను అసెంబ్లీ కార్య‌ద‌ర్శికి అప్ప‌గించారు. ఇక్క‌డ నారా లోకేశ్ నామినేష‌న్ వేసిన స‌మ‌యంలోనే...  అక్క‌డ ఢిల్లీలోని స‌ర్వోన్న‌త న్యాయస్థానం సుప్రీంకోర్టులో నారా లోకేశ్ తండ్రి - టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడికి దిమ్మ‌తిరిగే ఘ‌ట‌న జ‌రిగింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల సంద‌ర్బంగా నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌ స‌న్ ఓటును కొనుగోలు చేయిస్తూ అడ్డంగా బుక్కైన కేసులో చంద్ర‌బాబు ముద్దాయిగా ఉన్నారు. ఇక్క‌డ నారా లోకేశ్ నామినేష‌న్ వేసే స‌మ‌యంలో అక్క‌డ సుప్రీంకోర్టు ఈ కేసు విచార‌ణ‌ను స్వీక‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

కాక‌తాళీయ‌మో, ఏమో... తెలియ‌దు కానీ ఈ రెండు ఘ‌ట‌న‌లు ఇకే స‌మ‌యంలో జ‌రిగిపోయాయి. ఇక్క‌డ నారా లోకేశ్ నామినేష‌న్‌, అక్క‌డ ఓటుకు నోటు కేసు విచార‌ణ‌ను స్వీక‌రిస్తున్న‌ట్లు సుప్రీంకోర్టు ప్ర‌క‌ట‌న రెండూ ఒకే స‌మ‌యంలో జ‌రిగాయి. ఈ రెండు ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి తెలుగు టీవీ ఛానెళ్ల‌లో ఒక‌దాని వెంట మ‌రొక‌టి స్క్రోలింగ్స్ వ‌చ్చాయి. ఆ స‌మ‌యంలో కొత్త‌గా ముచ్చ‌ట‌ప‌డి క‌ట్టుకున్న తాత్కాలిక అసెంబ్లీ భ‌వ‌నంలో గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎస్ న‌ర‌సింహ‌న్ ప్ర‌సంగాన్ని చంద్ర‌బాబు ఆస‌క్తిగా వింటున్నారు. స‌భ‌లో శాస‌న మండ‌లి చైర్మ‌న్ చ‌క్ర‌పాణి, అసెంబ్లీ స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌, విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, శాస‌న‌మండలిలో ప్ర‌తిప‌క్ష నేత సి.రామ‌చంద్ర‌య్య సహా అన్ని పార్టీల స‌భ్యులంతా ఉన్నారు. ఈ స‌మ‌యంలో టీవీల స్క్రోలింగ్ పై క‌నిపించిన ఓటుకు నోటు కేసు పెను క‌ల‌క‌ల‌మే రేపింద‌ని చెప్పాలి.

ఓటుకు నోటు కేసు న‌మోదు ద‌రిమిలా ప‌దేళ్ల పాటు ఉమ్మ‌డి రాజ‌ధానిగా ఉన్న హైద‌రాబాదులో ఉండే అవ‌కాశ‌మున్నా... చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. హైద‌రాబాదులో ఉంటే తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంకెన్ని ఇబ్బందులు పెడ‌తారోన‌న్న భ‌యంతో చంద్ర‌బాబు త‌న మ‌కాంను విజ‌య‌వాడ‌కు షిఫ్ట్ చేశార‌ని నాడు గుస‌గుస‌లు వినిపించాయి. ఇవేవీ ప‌ట్టించుకోని చంద్ర‌బాబు త‌న నివాసాన్ని విజ‌య‌వాడ‌లోనే ప‌దిలం చేసుకున్నారు. ఆ త‌ర్వాత తాత్కాలిక స‌చివాలయం, తాజాగా తాత్కాలిక అసెంబ్లీ అన్నింటినీ ఒక‌దాని త‌ర్వాత ఒక‌టిగా నిర్మించుకుంటున్నారు. ఈ క్ర‌మంలో త‌న కుమారుడు నారా లోకేశ్ చ‌ట్ట‌స‌భ‌ల ఎంట్రీకి నేడు ముహూర్తం నిర్ణ‌యించుకోగా... స‌రిగ్గా అదే స‌మ‌యానికి చంద్ర‌బాబును తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేస్తున్న ఓటుకు నోటు కేసు విచార‌ణ‌ను స్వీక‌రిస్తున్న సుప్రీంకోర్టు ప్ర‌క‌టించింది. వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిష‌న్‌ను విచారించిన సంద‌ర్భంగా కోర్టు ఈ ప్ర‌క‌ట‌న చేసింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News