ఆ మూడు బెజవాడలోనే పుట్టాయంట

Update: 2016-03-22 06:05 GMT
తెలుగురాష్ట్రాల్లో మరే జిల్లాలకు లేని ప్రత్యేకత తమ రెండు జిల్లాలకే ఉందని గొప్పలు చెప్పుకునే వారుగా కృష్ణ.. గుంటూరు జిల్లాల గురించి తరచూ చెబుతుంటారు. వీరి గురించి విమర్శలు కూడా కాస్త ఎక్కువే. అదే సమయంలో.. తాము ఆ జిల్లాల నుంచి వచ్చిన వాళ్లమని గర్వంగా చెప్పుకుంటూ.. మిగిలిన వారికి వారి జిల్లాల గురించి ప్రచారం చేసుకోవటం చేతకాక.. తమ మీద పడుతుంటారని ఈ రెండు జిల్లాల వాళ్లు రివర్స్ పంచ్ లు వేస్తుంటారు.

ఏది ఏమైనా ఈ రెండు జిల్లాల ప్రత్యేకతను అందరూ ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే.. ఈ రెండు జిల్లాలకు చెందిన వారు ప్రపంచంలో ఎక్కడున్నా.. తమ ప్రాంతం గురించి తరచూ గొప్పలు చెప్పుకుంటారన్న పేరుంది. ఇంకా చెప్పాలంటే.. కనీసం రోజు.. రెండు రోజులకు ఒకసారైనా తమ ప్రాంతం గొప్పతనం మాటలు వీరి నోటి నుంచి వస్తుంటాయన్న విమర్శ ఉంది.

అలా అని మిగిలిన జిల్లాలు తక్కువేం కాదు సుమా. కాకుంటే ప్రకృతి సహకారం మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఈ రెండు జిల్లాలకు ఉండటం ఒక లాభంగా చెప్పాలి. అందుకే.. ఈ రెండు జిల్లాలు మిగిలిన జిల్లాలకు కాస్త భిన్నంగా నిలుస్తాయనటంలో సందేహం లేదు. ఇలా తమ ప్రాంతాల గురించి నిత్యం గొప్పలు చెప్పుకునే ఈ రెండు జిల్లాల వారికి మరింత ఆనందం కలిగించే మాట ఒకటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రమణ నోటి నుంచి వచ్చింది. బెజవాడ బార్ అసోసియేషన్ 110 వార్షికోత్సవంలో భాగంగా పాల్గొన్న ఆయన.. బెజవాడ గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు.

ప్రపంచ ఖ్యాతి చెందిన రాజధానిగా ఏపీ సర్కారు నిర్మించనున్న అమరావతి చరిత్రలో నిలిచిపోతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన ఆయన.. సామ్యవాదం.. నాస్తికత్వం.. అభ్యుదయవాదం బెజవాడలోనే పుట్టాయంటూ పొగడ్తల వర్షం కురిపించేవారు. అయితే.. జస్టిస్ రమణ సైతం ఈ జిల్లాలకు చెందిన వారు కావటం గమనార్హం. ఇలా తమ ప్రాంతం గురించి ప్రమోట్ చేసుకోవటాన్ని మిగిలిన వారు షురూ చేస్తే బాగుంటుందేమో..?
Tags:    

Similar News