అమ‌రావ‌తి భూ పందేరంపై సుప్రీం నోటీసులు

Update: 2017-08-11 07:32 GMT
త‌ను చేసే ప‌నుల‌కు ఎదురు లేద‌ని,  అంతా ఏపీ ప్ర‌జ‌ల మంచి కోస‌మే చేస్తున్నాన‌ని చెబుతున్న చంద్ర‌బాబుకు గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. ముఖ్యంగా అంత‌ర్జాతీయ స్థాయిలో నిర్మించాల‌ని భావిస్తున్న ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో ఆయ‌న అనేక సంస్థ‌ల‌కు ఇబ్బ‌డి ముబ్బ‌డిగా కోరిన వారికి కోరినంత అన్న‌ట్టుగా భూముల‌ను కేటాయించారు. ఆ సంస్థ‌లు ఎందుకు అడుగుతున్నాయి?  నిజంగానే ప్ర‌జాప్ర‌యోజనం ఉందా? అన్న‌దేమీ ప‌ట్టించుకోకుండా.. అటు సంస్థ‌ల‌కు, ఇటు వ్య‌క్తిగ‌తంగా కొంద‌రికి ల‌బ్ధి చేకూరేలా చంద్ర‌బాబు వంద‌లాది ఎక‌రాల‌ను అది కూడా రాజ‌ధాని ప్రాంతంలో క‌ట్ట‌బెట్టారు. ఇది అన్యాయ‌ని - ప్ర‌జాప్ర‌యోజ‌నం ఏమీ లేద‌ని అంటూ దీనిపై ఎవ‌రైనా ప్ర‌శ్నిస్తే.. మాత్రం వాళ్ల‌పై అభివృద్ధి నిరోధ‌కులు - నాపై కుట్ర ప‌న్నారు. అంటూ చంద్ర‌బాబు ప్ర‌క‌ట‌న‌లు గుప్పించారు.

అయితే, ఇప్పుడు తాజాగా ఆయ‌న‌కు దేశ అత్యున్న‌త ధ‌ర్మాస‌నం సుప్రీం కోర్టు రూపంలో పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. ఈ భూముల పందేరంపై స‌మ‌గ్రంగా త‌మ‌కు వివ‌ర‌ణ ఇవ్వాల‌ని, ఎవ‌రికి ఎందుకు ఎంతెంత కేటాయించారో త‌మ‌కు నివేదిక అంద‌జేయాల‌ని సుప్రీం కోర్టు.. రాష్ట్ర ప్ర‌భుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇది నిజంగా చంద్ర‌బాబుకు ఊహించ‌ని ఎదురు దెబ్బ‌!! విష‌యంలోకి వెళ్తే.. న్యాయమూర్తులు - ఎమ్మెల్యేలు - సివిల్ సర్వీసెస్ అధికారులు - జర్నలిస్టులు తదితర ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. మాజీ ఎమ్మెల్యే అడుసుమల్లి జయప్రకాశ్ - రిటైర్డ్ లెక్చరర్ లక్ష్మణ రెడ్డి వల్లం రెడ్డి లు సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

దీనిని జ‌స్టిస్ జాస్తి చ‌ల‌మేశ్వ‌ర్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం విచార‌ణకు స్వీక‌రించింది. ఈ సంద‌ర్భంగా పిటిష‌న‌ర్ల త‌ర‌ఫున న్యాయ‌వాదులు  సత్యప్రసాద్ - మహేష్ బాబు వాదిస్తూ..  ఏపీ ప్రభుత్వం ఎలాంటి విధానం లేకుండా వందలాది ఎకరాలను వివిధ సంస్థలకు ధారాదత్తం చేస్తోందని పేర్కొన్నారు. అమృత వర్సిటీకి 200 ఎకరాలు - బీఆర్ ఎస్ మెడిసిటీ హెల్త్‌ కేర్ సంస్థకు 100 ఎకరాలు - ఇండో యూకే ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సంస్థకు 150 ఎకరాలు - ఇలా అనేక సంస్థలకు వందలాది ఎకరాలు కట్టబెట్టిందని చెప్పిన వారు.. ఆ జీవోలను జత పరిచారు. అదేవిధంగా కొంద‌రు టీడీపీ నేత‌ల‌కు కూడా భూములు ఇచ్చార‌ని చెప్పారు.

ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్ర - ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ కుటుంబసభ్యులు - పల్లె రఘునాథ రెడ్డి కుమారుడు పల్లె వెంకటకృష్ణ కిశోర్ రెడ్డి - స్పీకర్ కోడెల శివప్రసాదరావు సంబంధీకులు - మంత్రి నారాయణ సంబంధీకులు - వినుకొండ ఎమ్మెల్యే జీవీఎస్ ఆంజనేయులు కూతురు లక్ష్మీసౌజన్య తదితరులకు ఈ కేటాయింపులు జరిగాయని విన్నవించారు. వీట‌న్నింటినీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న ధ‌ర్మాసనం వివ‌ర‌ణ‌తో త‌మ‌కు నివేదిక అంద‌జేయాల‌ని, అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని బాబు ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. ఇదిలావుంటే, గ‌తంలో విప‌క్షం వైసీపీ అధినేత జ‌గ‌న్ స‌హా పార్టీ నేత‌లు రాజ‌ధాని భూముల‌ను బాబు ఇష్టానుసారం క‌ట్ట‌బెడుతున్నార‌ని ఆరోపించిన విష‌యం తెలిసిందే.
Tags:    

Similar News