సీఎం జ‌గ‌న్ కు సుప్రీంకోర్టు నోటీసులు

Update: 2023-07-05 23:56 GMT
ఏపీ సీఎం జ‌గ‌న్ స‌హా ఆయ‌న‌ కు చెందిన సంస్థ‌ల‌ పై న‌మోదైన అక్ర‌మాస్తుల కేసుల్లో ఈడీ, సీబీఐ అధికారులు న‌మోదు చేసిన వేర్వేరు కేసుల‌ కు సంబంధించి కోర్టు విచార‌ణ‌ ను ఒకేసారి చేప‌ట్ట‌మంటారా? అనే విష‌యం పై స‌మాధానం చెప్పాల‌ని కోరుతూ.. జ‌గ‌న్ స‌హా ఆయ‌న సంస్థ‌ల అధిప‌తిగా ఉన్న ఆయ‌న స‌తీమ‌ణి భార‌తి రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ మేర‌కు ఈడీ అధికారులు దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ ను తాజాగా విచారించిన సుప్రీంకోర్టు సెప్టెంబ‌రు 5లోపు త‌మ‌కు స‌మాధానం చెప్పాల‌ని ఆదేశించింది.

అంతేకాదు..  ఈ కేసు పూర్తి స్థాయి విచారణ సుప్రీంకోర్టు లో ద్విసభ్య ధర్మాసనం చేపట్టాలా.. లేక త్రిసభ్య ధర్మాసనం చేపట్టాల న్నది ఆరోజు నిర్ణయిస్తామని ధర్మాసనం పేర్కొంది. సెప్టెంబర్ 5వ తేదీకి తదుపరి విచారణ వాయిదా వేసింది. ఈడీ దాఖలు చేసిన పిటిషన్ల పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు జస్టిస్‌ అభయ్‌ ఎస్‌ ఓఖా, జస్టిస్‌ సంజయ్‌ కరోలలతో కూడిన ధర్మాసనం సెప్టెంబర్ 5వ తేదీ లోపు సమాధానం చెప్పాల ని ప్రతివాదులుగా ఉన్న విజయసాయిరెడ్డి, భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్‌‌ల కు నోటీసులు జారీ చేసింది.

ఏం జ‌రిగింది?

అక్రమాస్తుల కేసు లో జ‌గ‌న్ స‌హా ఆయ‌న సంస్థ‌ల‌ పై సీబీఐ, ఈడీలు కేసులు న‌మోదు చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. ముందుగా సీబీఐ కేసులు విచారించాల ని, అప్పటి వరకు ఈడీ రిజిస్టర్ చేసిన కేసుల విచారణ ఆపాల ని ట్రయల్ కోర్టును  తెలంగాణ హైకోర్టు 2021లో ఆదేశించింది. సీబీఐ ఛార్జిషీట్లపై తీర్పు వెలువడిన తర్వాతే ఈడీ కేసుల విచారణ చేపట్టాలని పేర్కొంది.

అంతేకాదు.. ఒకవేళ సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల విచారణ ఒకేసారి జరిపితే.. సీబీఐ కేసుల పై తీర్పు తర్వాతే.. ఈడీ కేసులపై తీర్పు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఇదేస‌మ‌యం లో సీబీఐ నమోదు చేసిన కేసులు, ఈడీ నమోదు చేసిన కేసులు సమాంతరంగా విచారణ కొనసాగించవచ్చునని సీబీఐ ప్రత్యేక కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. దీంతో హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును ఈడీ సుప్రీంకోర్టు లో సవాలు చేసింది. దీని పై తాజాగా జ‌రిగిన విచార‌ణ అనంత‌రం.. ధ‌ర్మాస‌నం..జ‌గ‌న్ కు ఆయ‌న సంస్థ‌ల‌ కు, సాయిరెడ్డి కి నోటీసులు జారీ చేయ‌డం గ‌మ‌నార్హం.

Similar News