హ‌క్కుల నేత అరెస్ట్ పై సుప్రీం కీల‌క వ్యాఖ్య‌లు

Update: 2018-08-30 04:43 GMT
ప్ర‌ధాని మోడీ హ‌త్య‌కు కుట్ర చేశార‌న్న ఆరోప‌ణ‌తో విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘం వ్య‌వ‌స్థాప‌కుడు వ‌ర‌వ‌ర‌రావుతో స‌హా ఐదుగురు మాన‌వ‌హ‌క్కుల నేత‌ల అరెస్ట్‌పై సుప్రీంకోర్టు నుంచి ఊర‌ట ల‌భించింది. వారి అరెస్ట్ పై అత్యున్న‌త న్యాయ‌స్థానం తీవ్ర అసంతృప్తిని వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు..కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. వారిని జైలుకు పంపొద్ద‌ని.. సెప్టెంబ‌రు 6 వ‌ర‌కు గృహ‌నిర్బందంలో ఉంచాల‌ని పేర్కొంది. అంతేకాదు.. అప్ప‌టివ‌ర‌కూ విచార‌ణ (ఇంట‌రాగేట్‌) చేయొద్ద‌ని కూడా వ్యాఖ్యానించింది.
ఈ సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి. ప్ర‌జాస్వామ్యంలో విప‌క్షం చాలా అవ‌స‌ర‌మ‌ని.. ప్ర‌భుత్వ విధానాల్ని నిర‌సించినందుకు వారిని నిర్బందంలో పెట్టార‌ని.. ఇది వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌ను అణ‌గ‌దొక్క‌ట‌మేన‌ని ఆరోపిస్తూ సుప్ర‌సిద్ధ చ‌రిత్ర‌కారిణి రోమిలా థాప‌ర్ తో స‌మా దేవ‌కీ జైన్.. ప్ర‌భాత్ ప‌ట్నాయ‌క్.. స‌తీశ్ దేశ్ పాండే.. మాజా దారూవాలా త‌దిత‌రులు సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసి.. వెనువెంట‌నే దీనిపై విచార‌ణ జ‌ర‌పాల‌న్నారు.

సుప్రీంకోర్టు సీనియ‌ర్ లాయ‌ర్లు ప‌లువురు అనేక మంది ఈ పిటిష‌న్ల‌పై వాద‌న‌లు వినిపించ‌టానికి సిద్ధ‌ప‌డ‌టంతో బెంచ్ అత్య‌వ‌స‌ర విచార‌ణ‌కు స్వీక‌రించింది. మ‌హారాష్ట్రలోని బీమా కోరెంగాంలో హింసాత్మ‌క ఘ‌ట‌న జ‌రిగిన తొమ్మిది నెల‌ల త‌ర్వాత ఏక‌ప‌క్షంగా.. ఎలాంటి ముంద‌స్తు నోటీసులు ఇవ్వ‌కుండా అరెస్ట్ చేయ‌టం వెనుక మ‌ర్మ‌మేంటి? అంటూ మ‌హారాష్ట్ర పోలీసుల‌ను.. కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీస్తూ లాయ‌ర్లు వాద‌న‌లు వినిపించ‌గా.. సుప్రీం వారి వాద‌న‌పై సానుకూలంగా స్పందించింది.

సుప్రీం చీఫ్ జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా.. జ‌స్టిస్ డీవై చంద్రచూడ్‌.. జ‌స్టిస్ ఎఎం ఖాన్విల్క‌ర్ ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ అత్య‌వ‌స‌ర పిటిష‌న్ పై విచార‌ణ‌ను జ‌రిపింది. అరెస్ట్ కు త‌గిన కార‌ణాలు చూపాలని పేర్కొంటూ కేంద్రానికి.. మ‌హారాష్ట్ర పోలీసుల‌కు సుప్రీం నోటీసులిచ్చింది.

హ‌క్కుల నేత‌ల అరెస్ట్ పై  ప‌లువురు సీనియ‌ర్ లాయ‌ర్లు త‌మ వాద‌న‌ల్ని వినిపించారు. తొలుత త‌న వాద‌న‌ను అభిషేక్ మ‌నుసింఘ్వి వినిపిస్తూ.. అరెస్టులు.. దాడుల‌కు ఏ ఆధారాలు లేవ‌ని.. పౌరుల ప్రాథ‌మిక హ‌క్కుల‌ను.. వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌ను హ‌రిస్తున్న వైనం తాజా ఉదంతంలో క‌నిపిస్తుంద‌న్నారు. దీనిపై అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తుషార్ మెహ‌తా స్పందిస్తూ.. సంబంధం లేని వ్య‌క్తులు ఈ పిటిష‌న్ దాఖ‌లు చేసిన‌ట్లుగా పేర్కొన్నారు.

దీనిపై స్పందించిన సీనియ‌ర్ లాయ‌ర్లు రాజీవ్ ధ‌వ‌న్.. ప్ర‌శాంత్ భూష‌ణ్‌.. ఇందిరా జైసింగ్‌.. రాజూ రామ‌చంద్ర‌న్.. దుష్యంత్ ద‌వేలు త‌మ వాద‌న‌లు వినిపిస్తూ.. ఈ కేసులో సాంకేతిక అంశాలు చూడ‌మ‌ని.. అరెస్ట్ అయిన హ‌క్కుల నేత‌లంతా స‌మాజంలో బ‌డుగు.. బ‌ల‌హీన వ‌ర్గాల హ‌క్కుల కోసం అహ‌ర‌హం పాటుప‌డేవార‌ని.. వారిపై చ‌ట్ట‌వ్య‌తిరేక కార్య‌క‌లాపాల నిరోధ‌క చ‌ట్టాన్ని.. ఐపీసీ సెక్ష‌న్ 153(ఏ)ని ప్ర‌యోగించ‌టం దారుణ‌మ‌న్నారు.

న్యాయ‌వాదుల వాద‌న‌ల‌పై జ‌స్టిస్ చంద్ర‌చూడ్ స్పందిస్తూ.. అవును..అస‌మ్మ‌తి అనేది ప్ర‌జాస్వామ్యంలో ఓ స్వేఫ్టీ వాల్వ్ లాంటిది.. అస‌మ్మ‌తిని అనుమ‌తించ‌క‌పోతే.. ప్ర‌జాస్వామ్య‌పు ప్రెష‌ర్ వాల్వ్ పేలిపోతుంద‌న్నారు. అరెస్ట్ చేసిన నేత‌లెవ్వ‌రిని జైల్లో పెట్టకుండా చూడాల‌న్న అభిషేక్ సింఘ్వి వాద‌న‌ల్ని మ‌న్నించిన అత్యుత్త‌మ న్యాయ‌స్థానం వారిని గృహ నిర్బందంలో ఉంచాల‌ని పేర్కొన్నారు. సుప్రీం ఆదేశాల‌తో పోలీసుల అదుపులో ఉన్న వ‌ర‌వ‌ర‌రావు అండ్ కోల‌ను వారి స్వ‌గృహాల‌కు పంపారు. ఇదిలా ఉంటే.. ఐదుగురు హ‌క్కుల నేత‌ల అరెస్ట్ ను మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం స‌మ‌ర్థించుకుంది. త‌మ దగ్గ‌ర త‌గిన ఆధారాల‌తోనే వారిని అరెస్ట్ చేసిన‌ట్లు పేర్కొంది. రానున్న రోజుల్లో ఈ కేసుపై జ‌రిగే విచార‌ణ ఎలాంటి మ‌లుపుల‌కు కార‌ణ‌మ‌వుతుందో చూడాలి.
Tags:    

Similar News