నీ ప్రేయసిని కాసేపు ఇవ్వు? అన్న పోలీసుపై సుప్రీం ఏమంది?

Update: 2022-12-19 10:30 GMT
పోలీసులు పోలీసింగ్ మాత్రమే చేయాలి. మోరల్ పోలీసింగ్ తో వారికి పని లేదన్న విషయాన్ని తాజాగా దేశ అత్యున్న న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాజాగా ఒక సంచలన కేసు విషయంలో పోలీసులు ఏం చేయాలి? అదుపు తప్పిన వారి విషయంలో వారిపై తీసుకోవాల్సిన చర్యల గురించి తన తీర్పుతో చెప్పేసింది. నైతిక ప్రవర్తన పేరుతో ఒక జంటను బెదిరించి.. దారుణ రీతిలో వ్యాఖ్యలు చేసిన ఒక పోలీస్ కానిస్టేబుల్ పై అధికారులు తీసుకున్న చర్యలపై సదరు పోలీసు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఇంతకూ అసలేం జరిగిందంటే.. 2001లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా వ్యవహరిస్తున్న సంతోష్ కుమార్ అర్థరాత్రి ఒంటి గంట సమయంలో మహేశ్ అనే వ్యక్తి తనకు కాబోయే భార్యను బైక్ మీద ఎక్కించుకొని వెళుతున్నాడు.

అతడ్ని ఆపిన సంతోష్.. సంబంధం లేని ప్రశ్నల్ని వేశాడు. అంతేకాదు.. అర్థరాత్రి వేళ రావటాన్ని తప్పు పట్టటమే కాదు.. దారుణ రీతిలో.. నీ ప్రేయసితో కాసేపు గడపాలని అనుకుంటున్నా? అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేశారు.

దీనిపై స్పందించిన సదరు కాబోయే భర్త మహేశ్ పోలీసు ఉన్నతాధికారుల్ని కలిసి సంతోష్ ప్రవర్తనపై ఫిర్యాదు చేశారు. దీంతో.. విచారణ జరిపిన అధికారులు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. దీనిపై న్యాయ పోరాటం చేసిన సంతోష్ కు అనుకూలంగా గుజరాత్ హైకోర్టు ఆదేశాల్ని ఇచ్చింది. దీంతో.. ఈ కేసు సుప్రీంకోర్టుకు విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా మోరల్ పోలీసింగ్ పేరుతో తాను చేసిన పనిని సమర్థించుకున్నారు సంతోష్.

ఈ వాదనపై స్పందించిన సుప్రీంకోర్టు.. నైతికప్రవర్తన పేరుతో ఒక జంటను బెదిరించటం.. అసభ్యంగా ప్రవర్తించటం ఏ మాత్రం సహించాల్సిన అవసరం లేదని.. అతడ్ని ఉద్యోగం నుంచి తొలగించటం సబబేనని స్పష్టం చేసింది. గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేస్తూ తాజా ఆదేశాల్ని ఇచ్చింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News