రిజర్వేషన్లపై టీ సర్కారుకు తలంటు

Update: 2015-09-15 05:16 GMT
నిర్ణయాలు తీసుకునే విషయంలోఅనుసరిస్తున్న పద్ధతి మార్చుకోవాల్సిన అవసరం ఉందన్న విషయం తెలంగాణ సర్కారుకు మరోసారి తెలిసే పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఉమ్మడి రాష్ట్రంలో అమలైన చట్టాల్లో మార్పులు చేయటం వల్ల కలిగే ఇబ్బంది సుప్రీంకోర్టు విచారణకు వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో బీసీలుగా ఉన్న కళింగులు.. తెలంగాణ రాష్ట్రంలో ఆ వర్గాన్ని బీసీ జాబితా నుంచి తీసేయటాన్ని తప్పు పడుతూ.. ఇద్దరు వైద్య విద్యార్థినులు కోర్టును ఆశ్రయించారు.

కళింగ సామాజిక వర్గానికి ఉమ్మడి రాష్ట్రంలో బీసీ హోదా ఉండేది. అయితే.. దాన్ని సవరిస్తూ తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో.. వైద్య విద్యాకోర్సుల్లో తాము రిజర్వేషన్లు కోల్పోతున్నామంటూ ఇద్దరు వైద్య విద్యార్థినులు హైకోర్టును ఆశ్రయించారు. విద్యార్థినులకు అనుకూలంగా హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుఇవ్వగా.. ద్విసభ్య ధర్మాసనం మాత్రం అందుకు భిన్నంగా తీర్పు ఇచ్చింది.

దీంతో.. సుప్రీంకోర్టును వీరిద్దరూ ఆశ్రయించారు. తాజాగా ఈ కేసునకు సంబంధించిన వాదనలు జరిగిన సమయంలో సుప్రీం ధర్మాసనం సూటిప్రశ్నలు వేసింది. అదే సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

2014 జూన్ 2కు ముందు ఉమ్మడి రాష్ట్రంలో పిటీషనర్ లకు రిజర్వేషన్ ఉన్నప్పుడు.. ఏ ప్రాతిపదికన వారి రిజర్వేషన్ లు తీసేశారని ప్రశ్నించింది. అందరూ తెలుగు మాట్లాడేవారే కదా.. ఏపీకి చెందిన విద్యార్థులు రిజర్వేషన్లు ఉందని వస్తారు.. లేవని మీరెలా చెప్తారు? రిజర్వేషన్లపై తెలంగాణ ప్రభుత్వం కమిషన్ వేసుకోవచ్చు కదా అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హెచ్ ఎల్ దత్తు వ్యాఖ్యానించారు.

ప్రస్తుతానికి పిటీషనర్ల ఇద్దరికి రిజర్వేషన్ల రద్దుపై స్టే ఇస్తూ నిర్ణయాన్ని వెలువరించింది. కళింగ సామాజిక వర్గం తెలంగాణలో లేనందున.. దాన్ని బీసీ రిజర్వేషన్ల జాబితా నుంచి తీసేస్తూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో.. ఏపీలో రిజర్వేషన్లు ఉన్న సామాజిక వర్గం.. తెలంగాణలో ఏదైనా అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు కానీ.. వారు మాత్రం రిజర్వేషన్లు పొందే అవకాశం ఉండదు. ఇది తమ అవకాశాలు పొగొడుతుందన్నది పిటీషన్ దారుల ప్రశ్న. దీనికి సుప్రీం స్పందిస్తూ.. విభజన వల్ల కొన్ని జిల్లాలు ఒక రాష్ట్రానికి వెళ్లినంత మాత్రాన రిజర్వేషన్లు చెల్లవని చెప్పటం సమంజసం కాదని అభిప్రాయపడటం గమనార్హం.

విభజన తర్వాత పలు అంశాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు న్యాయస్థానాల్లో ఎదురు దెబ్బలు  తగులుతున్నాయి. తాజాగా.. కళింగుల రిజర్వేషన్ల వ్యవహారంలోనూ తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయానికి భిన్నంగా సుప్రీం స్పందించటం చూస్తుంటే.. సరైన కసరత్తు లేకుండానే విధానపరమైన అంశాల విషయంలో నిర్ణయాలు తీసుకుంటున్నట్లుగా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News