ఆ ఇష్యూలో షాకింగ్ గా మారిన సుప్రీం తీర్పు!

Update: 2018-08-24 04:42 GMT
దేశ అత్యున్న న్యాయ‌స్థానం ఇచ్చిన తాజా తీర్పు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగానే కాదు హాట్ టాపిక్ గా మారింది. తీవ్ర సంచ‌ల‌నంగా మారిన ఈ తీర్పు సారాంశాన్ని సింఫుల్ గా చెప్పాలంటే దేశంలోని అన్ని ప్రార్థ‌న స్థ‌లాల్లో జ‌రుగుతున్న వ్య‌వ‌హారాల పైన స‌మ‌గ్ర‌.. న్యాయ‌ప‌ర‌మైన మ‌దింపు జ‌ర‌గాల‌న్న తేల్చింది.

అంటే.. దేశ‌లోని దేవాల‌యాలు మాత్ర‌మే కాదు.. మ‌సీదులు.. చ‌ర్చిలు.. అన్య మ‌తాల‌కు చెందిన మందిరాలు.. చివ‌ర‌కు దాతృత్వ సంస్థ‌లు సైతం సుప్రీం చెప్పిన ఆడిట్ ప‌రిధిలోకి వ‌స్తాయి. ఆయా సంస్థ‌ల్లోకి ప్ర‌వేశం.. అక్క‌డి ప‌రిస‌రాలు ప‌రిశుభ్ర‌త‌.. భ‌క్తుల‌కు క‌ల్పిస్తున్న సౌక‌ర్యాలు.. ఇబ్బందులు.. ప్రార్థ‌న స్థ‌లానికి ఉన్న ఆస్తులు.. అప్పులు.. నిర్వ‌హ‌ణ ఖ‌ర్చుల‌తోపాటు నిర్వ‌హ‌ణ‌కు ఎదుర‌వుతున్న ఇబ్బందుల విష‌యాల్ని జిల్లా జ‌డ్జిలు స్వ‌యంగా ప‌రిశీలించాల్సి ఉంటుంది.

ఇప్పుడున్న‌కేసుల భారానికి తోడుగా తాజా తీర్పును అమ‌లు చేయాల్సి వ‌స్తే.. కోర్టుల మీదా.. న్యాయ‌మూర్తుల మీద పెను భారం ప‌డ‌టం ఖాయం. జిల్లా కోర్టులు ప‌రిశీలించి.. ఆ నివేదిక‌ల్ని హైకోర్టుల‌కు ఇస్తే.. వాటిని ప్ర‌జాహిత దావాగా హైకోర్టు  స్వీక‌రించి వాటిపై విచార‌ణ జ‌రిపి తీర్పులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ నిర్ణ‌యం న్యాయ‌వ్య‌వస్థ మీద తీవ్ర‌మైన ప‌ని భారాన్ని పెంచుతుంద‌న్న మాట బ‌లంగా వినిపిస్తుంది.

ఎందుకంటే.. సుప్రీం తీర్పును కానీ అమ‌లు చేస్తే.. దేశంలోని 20 ల‌క్ష‌ల ఆల‌యాలు.. 5 ల‌క్ష‌ల మ‌సీదులు.. వేల సంఖ్య‌లో (అన‌ధికారికం స‌మాచారం ప్ర‌కారం ల‌క్ష‌ల్లో అంటున్నారు) ఉన్నాయి. ఇక‌.. దాతృత్వ సంస్థ‌ల‌కు లెక్కే లేదు. ఇలాంటి వాట‌న్నింటిని కోర్టు త‌మ ప‌రిధిలోకి వ‌చ్చి.. వాటిని ప‌రిశీలించి.. వాటి లెక్క‌ల్ని త‌నిఖీ చేయాలంటే ఎంత పెద్ద బాధ్య‌తో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అదే జ‌రిగితే.. న్యాయ‌వ్య‌వ‌స్థ వ‌ద్ద పెండింగ్ లో ఉన్న 3 కోట్ల కేసుల మాటేమిటి? అన్న‌ది మ‌రోప్ర‌శ్న‌గా మారింది.

ఓ ప‌క్క కోర్టులో పెద్ద ఎత్తున ఖాళీలు ఉన్న వేళ‌.. వాటి భ‌ర్తీ మీద దృష్టి పెట్ట‌ని ప్ర‌భుత్వం తీరుపై న్యాయ‌ముర్తులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇది చాల‌ద‌న్న‌ట్లుగా సుప్రీం కోర్టు తీర్పును కానీ అమ‌లు చేయాల్సి వ‌స్తే.. ఇబ్బందిగా మారుతుంద‌ని చెబుతున్నారు. ఒక్క త‌మిళ‌నాడులోనే దాదాపు 7వేల ప్రాచీన దేవాల‌యాలు ఉన్నాయ‌ని.. చాలా దేవాల‌యాల‌కు పాల‌క మండ‌ళ్లు లేవ‌ని.. నిర్దిష్ట‌మైన పాల‌నా ప‌ద్ధ‌తులు లేవ‌న్న మాట వినిపిస్తోంది. ఇలాంటి వేళ‌.. లెక్క‌కు మిక్కిలిగా ఉన్న దేవాల‌యాల విష‌యంలో కోర్టులు క‌లుగ‌జేసుకుంటే ప‌ని భారం భారీగా ఉంటుంద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి.. దీనిపై సుప్రీం మ‌రో నిర్ణ‌యం తీసుకుంటుందా?  లేక‌.. త‌న ఆదేశాన్ని తూచా త‌ప్ప‌కుండా అమ‌లు చేయాల‌ని కోరుతుందా? అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది.


Tags:    

Similar News