హైవేల‌పై ఇక అలాంటివి కుద‌ర‌దు

Update: 2016-12-15 09:47 GMT
జాతీయ ర‌హ‌దారుల వెంట ఆహ్లాద‌క‌ర‌మైన ప్ర‌యాణం ఎంత బాగుంటుందో ..కొంద‌రు మందుబాబులు అస్త‌వ్య‌స్త-ప్ర‌మాద‌క‌ర‌మైన‌ డ్రైవింగ్ వ‌ల్ల ఒక్కోసారి అంతే న‌ర‌కంగా కూడా ఉంటుంది. అయితే ఇక నుంచి అలాంటివి జ‌ర‌గ‌కుండా చూసేందుకు సుప్రీంకోర్టు కీల‌క తీర్పు వెలువ‌రించింది. జాతీయ రహదారుల వెంబడి మద్యం అమ్మకాలు నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. హైవేలపై బార్లు - వైన్‌ షాపులను నిషేధిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. జాతీయ రహదారులపై వచ్చే ఏప్రిల్ నుంచి మద్యం అమ్మకాలు నిలిపివేయాలని రాష్ట్రాల‌కు ఆదేశాలు జారీ చేసింది.  రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకే హైవేలపై మద్యం అమ్మకాలను నిషేధిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది.

ప్ర‌జా సంక్షేమం రీత్యా హైవేలపై ఉన్న మద్యం దుకాణాల లైసెన్సులు రద్దు చేయాలని, అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా దీన్ని అమలు చేయాలని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం ఆదేశించింది.  అయితే ప్రస్తుతం లైసెన్స్ లు ఉన్న మ‌ద్యం దుకాణాలు గడువు ముగిసే వరకు కొనసాగించవచ్చని పేర్కొంది. ప్రస్తుత లైసెన్స్‌ల గడువు తీరాక పునరుద్ధరణ చేయరాదంటూ ఆదేశించింది. హైవేలపై ఉన్న బార్లు - వైన్ షాపుల బ్యానర్లను తొలగించాలని, జాతీయ - రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంలో బార్లు - వైన్ షాపులు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఇక‌నైనా మందుబాబుల ఆగ‌డాలు జాతీయ ర‌హదారుల‌పై త‌గ్గిపోతాయేమో  వేచి చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News