వ్యాపమ్‌ నిందితుల పాపం పండుతుందా?

Update: 2015-07-09 09:17 GMT
సంచలనం సృష్టించిన మధ్యప్రదేశ్‌ వ్యాపం కుంభకోణంపై సీబీఐ విచారణకు సుప్రీం కోర్టు ఓకే చెప్పింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో మధ్యప్రదేశ్‌ గవర్నరు రాంనరేశ్‌ యాదవ్‌, మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. నాలుగువారాల్లో దీనిపై సమాధానం చెప్పాలంటూ ఆదేశించింది. దీంతో మధ్యప్రదేశ్‌ సీఎంను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ కేసు విచారణ వేగవంతమవుతుందని ఆశిస్తున్నారు.

    మధ్యప్రదేశ్‌ వ్యాపం కుంభకోణంలో ఒకరి తరువాత ఒకరు వరుస మరణాలు సంభవిస్తుండడంతో కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ, కొందరు ప్రజా ఉద్యమకారులు... ఇలా తొమ్మిది పిటిషన్లు దాఖలయ్యాయి. వీటన్నింటినీ సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించి కేసు సీబీఐకు అప్పగించాలని ఆదేశించింది. అదేసమయంలో ఆ రాష్ట్ర గవర్నరు రాంనరేశ్‌ యాదవ్‌ను తొలగించాల్న పిటిషన్‌పై న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదించగా ఇంతవరకు ఆయన ఎందుకు చర్యలు తీసుకోలేదు.. ఆయనపైనా ఎందుకు చర్యలు తీసుకోలేదని కోర్టు ప్రశ్నించింది.

    కాగా ఈ పిటిషన్ల విచారణ సమయంలో... ఈ కేసులన్నీ సీబీఐ విచారిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున వాదించిన ముకుల్‌ రస్తోగీ చెప్పడంతో దీనిపై పెద్దగా వాదోపవాదాలేమీ జరగలేదు. అయితే... ఈ విచారణ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. సీబీఐ దర్యాప్తు విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన మధ్యప్రదేశ్‌ హైకోర్టు కేసును తెలివిగా సుప్రీంకు పంపించి చేతులు దులుపుకొందంటూ సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. మరోవైపు ఈ కేసు విచారణను సుప్రీం కోర్టే స్వయంగా పర్యవేక్షించే అవకాశం ఉందని న్యాయవర్గాల్లో వినిపిస్తోంది. అయితే.. సీబీఐ విచారణతోనైనా ఈ వ్యాపం వెనుక ఉన్నవారి పాపం పండుతుందా.. లేదా అన్నది చూడాలి.

  
Tags:    

Similar News