ఆధునిక సమాజంలో పాశ్చాత్య పోకడల వల్ల కొంతమంది భార్యాభర్తల మధ్య సంబంధాలు దెబ్బతింటోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొన్ని జంటలు కీచులాడుకుంటూనే కాపురాలు కొనసా...గిస్తున్నాయి. అయితే, తమ భాగస్వామితో ఉన్న మనస్పర్థల కారణంగానో కొంతమంది వివాహేతర సంబంధాలు పెట్టుకొని పచ్చని కాపురాల్లో నిప్పులు పోసుకుంటున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో వివాహితలతో అక్రమ సంబంధం నెరపుతూ ఇబ్బందుల పాలవుతున్నారు. చివరకు ఆ వ్యవహారం బట్టబయలు కావడంతో కటకటాలపాలవుతున్నారు. అయితే, ఈ తరహా వివాహేతర సంబంధం కేసుల్లో సదరు వివాహితతో పాటు ఆమెతో అక్రమ సంబంధం నెరపిన వ్యక్తిది కూడా తప్పుంది. కానీ, ఇండియన్ పీనల్ కోడ్ లోని 497వ సెక్షన్ ప్రకారం....కేవలం మగవారినే శిక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో వివాహేతర సంబంధాలను (ఆడల్టరీ) నేరంగా పరిగణించే 497వ సెక్షన్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. తాజాగా, గురువారం నాడు ఆ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీం......పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సెక్షన్ 497ను కొనసాగించాల్సిన అవసరముందన్న కేంద్రం వాదనతో దేశంలోని అత్యున్నత ధర్మాసం విభేదించింది. ఈ తరహా వాదనను కేంద్రం ప్రోత్సహిస్తే....దానిని తీవ్ర నేరంగా పరిగణించాల్సి వస్తుందని కేంద్రానికి అక్షింతలు వేసింది.
వాస్తవానికి సెక్షన్ 497 ప్రకారం వివాహేతర సంబంధాల కేసుల్లో ఇరువురి తప్పు ఉన్నప్పటికీ.....వివాహితలను మినహాయించి.. కేవలం పురుషుడిని మాత్రమే శిక్షిస్తున్నారు. సదరు పురుషుడికి ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా లేక ఈ రెండూ గానీ విధిస్తున్నారు. వివాహేతర సంబంధం వ్యవహారంలో సదరు మహిళ కూడా పురుషుడితో సమానంగా తప్పు చేసినా....ఆమెకు ఎటువంటి శిక్ష విధించడం లేదు. అయితే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం కుల - మత - జాతి - ప్రాంతాలకు అతీతంగా స్త్రీ - పురుషులంతా చట్టం ముందు సమానం. అందువల్ల, 497 సెక్షన్ కూడా ఆ ఆర్టికల్ కు లోబడే ఉండాలని, 497 సెక్షన్ ను రద్దు చేయాలని జోసెఫ్ షైనీ అనే వ్యక్తి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ నేపథ్యంలో ఆ పిటిషన్ పై సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం నేడు విచారణ జరిపింది. సమానత్వపు హక్కును ఈ సెక్షన్ ఉల్లంఘిస్తున్నట్టుగా ప్రాథమికంగా అనిపిస్తోందని సుప్రీం వ్యాఖ్యానించింది. మరోవైపు, వివాహ వ్యవస్థ పవిత్రతను కాపాడేందుకు సెక్షన్ 497ను కొనసాగించాలన్న కేంద్రం వాదనతో సుప్రీం విభేదించింది. కేంద్రం ఇదే వాదనను పాటించినట్టయితే ఇప్పుడున్న నేరం కన్నా తీవ్రమైన నేరంగా దానిని పరిగణించాల్సి ఉంటుందని సుప్రీం పేర్కొంది.